Saturday, September 5, 2020

మానవులను ఎన్ని తరగతులుగా విభజించవచ్చు?

మానవులను ఎన్ని తరగతులుగా విభజించవచ్చు?
మానవులను 3 తరగతులుగా విభజించవచ్చు.
(A) జంతు స్వభావం ప్రధానంగా ఉన్నవారు (B) మానవ స్వభావం ప్రధానంగా ఉన్నవారు. (C) దైవత్వం ప్రధానంగా ఉన్నవారు.
(A) జంతు స్వభావం ప్రధానంగా గలవారు తమోగుణ స్వభావులు. వీరు అనేక కోరికలతో వేగిపోయేవారు. ఆలోచనారహితులు. బుద్ధిని ఉపయోగించనివారు. ఇతరులను హింసించి ఐనా తాము ఆనందించేవారు. తమ సుఖం కోసం ఇతరులను కష్టపెట్టేవారు. జంతువులలాగా ఆహార - నిద్రా - మైధునాలతో కాలం వెళ్ళ బుచ్చేవారు. ఇట్టివారికి మంచి లేదు - చెడులేదు, పాపం లేదు - పుణ్యం లేదు, న్యాయం లేదు - అన్యాయం లేదు, దేవుడు లేడు - గీవుడు లేడు, శాస్త్రం లేదు - గీస్త్రం లేదు. తాను మునిగిందే గంగ, తాను మెచ్చిందే రంభ, తనకు తెలిసిందే వేదం, తానొక్కడే తెలివి గలవాడు. ఇట్టివాడు ఎప్పుడూ అశాంతితో జీవిస్తాడు. క్షుద్రమైన ఆలోచనలు చేస్తాడు. నీచమైన పనులు చేస్తాడు. కోపం, అసూయ, ద్వేషం అతడి లక్షణాలు. ఇట్టివారు జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేరు. అటువైపు మళ్ళరు. ఆధ్యాత్మికంగా ఇట్టివారికి ఉన్నతస్థితి కలిగే వీలులేదు. వీరు నిరర్థక జీవులు.

(B) మానవ స్వభావం ప్రధానంగా గలవారు: వీరు రజోగుణ ప్రధానులు లౌకిక విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు. సరైన పద్ధతిలో కోర్కెలు తీర్చుకుంటారు. చేతనైన మంచిని చేస్తారు. తాము చెడకుండా - నష్టపడకుండా ఇతరులకు సాయపడతారు. రజోగుణం ప్రబలంగా ఉన్నవారు గనుక ఉన్నతమైన వాటిని అందుకోవాలని పరుగులు తీస్తుంటారు. అప్పుడప్పుడూ కొంచెం శాంతంగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వీరు మంచి - చెడు, న్యాయం - అన్యాయం అంటూ అన్నీ విచారిస్తారు. భగవంతుడున్నాడనే విశ్వాసం. శాస్త్రాలపై నమ్మకం కూడా ఉంటాయి. ఇట్టివారు కొంత పురోభివృద్ధి చెందితే మంచిమార్గంలోకి నడవగలరు.

(C) దైవత్వం గలవారు:- వీరు సత్వగుణ ప్రధానులు. దైవభక్తి, దైవకార్యాలు, సత్కార్యాలు చేయాలని భావించేవారు. శాస్త్రాలను తెలుసుకోవాలనే తపన కలిగినవారు. ప్రాపంచిక విషయాలకు తీవ్రంగా చలించరు. కొంత వైరాగ్యభావన కలిగి ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తమకు కష్టం కలిగినా నష్టం కలిగినా తోటివాడికి సాయపడాలని చూస్తారు. త్యాగబుద్ధి గలవారు. -
ఇలాంటి సత్వగుణప్రధానులే ఇక్కడ విప్రత్వం గలవారు. ఇలాంటి వారు మాత్రమే వేదాంతాన్ని సరిగ్గా విని అర్థం చేసుకోగలుగుతారు. సాధనలు చేయగలుగుతారు. పెద్దలను, గురువులను గౌరవించగలుగుతారు. అణకువతో, వినయంతో ఉండగలుగుతారు. ఈ లక్షణాలన్నీ బ్రహ్మానుభూతి సాధనలో అవసరమే గనుక ఇట్టి విప్రలక్షణాలుండటం గొప్ప అదృష్టమని చెప్పారు. ఇట్టి లక్షణాలు గలవారు శూద్ర కులంలో జన్మించినా విప్రులే అవుతారు. ఈ లక్షణాలు లేనివారు బ్రాహ్మణకులంలో జన్మించినా వారు శూద్రులే.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment