Friday, April 30, 2021

శీలం అంటే...

🌷శీలం అంటే...🌹
🕉️🌞🏵️🌎🌼🚩

శీలం అంటే అన్ని విషయాల్లో మంచి నడత. దానగుణం, దయాగుణం ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా... వారు చేసే వృత్తిని బట్టి చీదరించుకోకూడదు. ధనం కాదు... గుణమే ప్రధానం. వేశ్య వృత్తి చేస్తూ సత్య, ధర్మచరితులైన వారి కథలు చాలా ఉన్నాయి. వాటిలో శూద్రకుడు రాసిన మృచ్ఛకటికం నాటకంలోని వసంతసేన లాంటి కథలు ప్రసిద్ధమైనవి. ఇలాంటి కథలకు పునాది అయిన నగరశోభిణి కథ.
ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కథ.

పూర్వం ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసుకొని, కురు రాజ్యాన్ని కౌరవ్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని తరువాత అతని కొడుకు బోధి కుమారుడు రాజు అయ్యాడు. పరమ ధార్మికుడైన అతని పాలనలో రాజ కుటుంబాలలోని వారి నుంచి సాధారణ ప్రజల వరకూ ధర్మాన్ని ఆచరించి చూపేవారు. దానితో ఆ రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తూ ఉండేవారు.

ఆ సమయంలోనే కళింగ ప్రాంతంలోని దంతపురి రాజ్యాన్ని కాళింగుడు పాలిస్తున్నాడు. అతని రాజ్యం అశాంతితో, అల్లర్లతో ఉండేది. చివరకు వర్షాభావం కలిగి కరువు కాటకాలు తాండవించాయి. ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దాలని తన మంత్రులను కాళింగుడు అడిగాడు. రాజా! మనం ఉపవాస దీక్షలు చేద్దాం. దర్భగడ్డి మీద పక్షం రోజులు పడుకుందాం అన్నారు. అలాగే చేశారు. అయినా పరిస్థితులు మారలేదు. రాజా! యజ్ఞ యాగాలు చేద్దాం అన్నారు. అలాగే చేశారు. అయినా మార్పు లేదు.

మహారాజా! కురు రాజ్యం సుభిక్షంగా ఉంది. దానికి కారణం ఆ రాజు దగ్గర ఉండే అంజనవర్ణి అనే తెల్ల ఏనుగు. దాన్ని తెద్దాం అన్నారు. కురు రాజు దానశీలి. అడిగింది లేదనకుండా ఇచ్చే దాత. కొందరు పండితులు వెళ్ళి, ఆ ఏనుగును తెచ్చారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. అంజనవర్ణి లేకపోవడం వల్ల కురు రాజ్యానికి వచ్చిన నష్టమేదీ కనిపించలేదు. చివరకు కాళింగుని అనుమతితో పండితులు బోధి మహారాజును కలిశారు. మీ సుభిక్షతకు కారణం ఏమిటి? అని అడిగారు. తమ రాజ్య పరిస్థితిని విన్నవించారు.అప్పుడు ఆ మహారాజు మేము పాటించే కురు ధర్మం అన్నాడు. కురు ధర్మమా? అదేమిటో సెలవియ్యగలరా? అని అడిగారు పండితులు. కురు ధర్మం అంటే పంచశీల. జీవహింస చేయకపోవడం, ఇతరుల ధనాన్ని అయాచితంగా ఆశించకపోవడం, మోసపు మాటలు మానడం, కామ దురాచారానికి పాల్పడకపోవడం, ప్రమత్తత కలిగించే పదార్థాల్ని సేవించకపోవడం. ఈ అయిదింటినీ చక్కగా ఆచరిస్తే అదే కురు ధర్మం. అయినా ఈ ధర్మాన్ని మీకు చెప్పడానికి నేను తగను. ఈ ఆచరణలో చిన్న దోషం చేశాను. మీరు వెళ్ళి మా తల్లిగారిని అడగండి అని పంపాడు బోధి మహారాజు. నేను కూడా అందుకు తగను. యువరాజును అడగండి అని అంది మహారాజు తల్లి. అలా వారు యువరాజు దగ్గర నుంచి పురోహితుడు, మంత్రి, రథ సారథి, శ్రేష్టి, కొలతలు వేసే ఉద్యోగి, ద్వారపాలకుడు... ఇలా ఒకరి తరువాత ఒకరి వద్దకు వెళ్ళారు. చివరకు నగర శోభిణి (వేశ్య) దగ్గరకు వెళ్ళారు.
అయ్యా! నాకు కురు ధర్మాన్ని చెప్పే అర్హత లేదు. ఎందుకంటే... నాకు ఒక రాత్రికి వెయ్యి నాణేల ధర చెల్లించేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు. వెయ్యి నాణేలు ఇచ్చి... రాత్రికి వస్తానన్నాడు. కానీ అతను రాలేదు. అలా అతని కోసం రోజులు ఎదురు చూశాను, నెలలు ఎదురు చూశాను. మూడేళ్ళు ఎదురు చూశాను. అప్పటికీ రాలేదు. ఒకరి దగ్గర వెల కుదిరి, మరొకరి దగ్గర వెల పుచ్చుకోవడం దోషం కదా! తప్పు కదా! ఈ మూడేళ్ళలో నేను దాచుకున్నదంతా తరిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. అయినా అతను ఇచ్చిన ఆ వెయ్యి నాణేల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. చిక్కి శల్యమైపోయాను. జీవించే ఆశను వదులుకున్నాను. నేను ఇక బతకాలంటే ఆ వెయ్యి నాణేలే గతి. నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళాను. అంతా చెప్పాను. అప్పుడు ఆయన శోభిణీ! నీకు ధనం ఇచ్చినవాడు రాకుండా మూడేళ్ళు నిండాయి. కాబట్టి ఆ ధనం మీద అతనికి అధికారం లేదు. అది నీదే! అన్నారు. సంతోషంతో వీధిలోకి వచ్చాను. అప్పుడే ఒక వ్యక్తి ఒక్క రాత్రికి వెయ్యి నాణేలకు కుదుర్చుకొని, ఆ ధనాన్ని నాకు ఇవ్వబోయాడు. మనసులో వద్దు అనుకుంటూనే ఉన్నా. కానీ ఆ ధనాన్ని స్వీకరించడానికి నా చెయ్యి కదిలింది. సరిగ్గా అదే సమయంలో... మూడేళ్ళ క్రితం నాకు ధనం ఇచ్చిన మనిషి కనిపించాడు. వెంటనే నా చేతిని వెనక్కు తీసుకున్నాను. నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. అందుకే మీకు కురు ధర్మాన్ని చెప్పడానికి నేను అర్హత లేనిదాన్ని అంది.

ఆమె చెప్పింది వినగానే పండితులు ఆశ్చర్యపోయారు. నోరు వెళ్ళబెట్టారు. కన్నీరు సుడి తిరిగింది. ధర్మాచరణతో ఇంత నిబద్ధంగా బతకాలి. అదే లోకానికి శ్రేయస్కరం అని భావించారు. వెళ్ళి తమ రాజుకు చెప్పారు. ఆనాటి నుంచి కాళింగుడు కురు ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేశాడు. క్రమంగా అతని రాజ్యం కూడా సుఖ శాంతులతో వర్ధిల్లింది.

👏👏👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment