Tuesday, April 27, 2021

నీతి వాక్యము

నీతి వాక్యము


ఒక ఊళ్లో భిక్షకుడు గుడి ముందు అడుక్కుంటూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆ గుడికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద ఉంటుండేవాడు. ఒక భక్తుడు గుడికి వచ్చినప్పుడల్లా ఆ భిక్షకుడి పాత్రలో నాణేలు వేసేవాడు. అతణ్ని ఆప్యాయంగా పలకరించి పండో, ప్రసాదమో చేతిలో పెడుతుండేవాడు. అలా ఆ భక్తుడంటే భిక్షగాడికి ఒక గౌరవ భావం ఏర్పడింది.

కొన్నాళ్లకి ఆ భిక్షకుడికి బాగా జబ్బు చేసింది. తనకి చివరి క్షణాలు సమీపించాయని అతనికి అర్థమైంది. ఆ సమయంలో ఆ భక్తుడితో తన మనసులోని కోరిక విన్నవించుకున్నాడు. చనిపోయాక తనని ఆ చెట్టు కిందనే సమాధి చెయ్యాలని కోరాడు. దానికి ఆ భక్తుడు అంగీకరించాడు.

భిక్షకుడు కన్నుమూశాడు. భక్తుడు అతను చెప్పిన స్థలంలోనే గొయ్యి తవ్వాడు. ఆశ్చర్యం.. బంగారు నిధి బయటపడింది. అదతని సొంతమైంది.
ఏళ్ల తరబడి దైవ సన్నిధిలో భగవన్నామ స్మరణ చేస్తూ గడిపినందుకు ఆ భిక్షకుడు స్వర్గానికి వెళ్లాడు. భక్తుడికి బంగారు నిధి దొరికిన విషయం అక్కడ తెలిసింది. మొదట నిర్ఘాంతపోయాడు. తనని ప్రేమగా పలకరించే వ్యక్తికి అది దొరికినందుకు తర్వాత సంతోషించాడు. అయితే అతడిలో ఓ సందేహం.

‘‘జీవితాంతం నేను ఆ నిధి మీదే కూర్చున్నాను. కానీ, చివరి వరకూ భిక్షగాడిగానే ఉండిపోయాను. నాలుగు డబ్బులు దానం చేసిన ఆ భక్తుడు కోటీశ్వరుడయ్యాడు. ఏంటీ మాయ’’ ఇంద్రుణ్ని అడిగాడు ఆ యాచకుడు.
‘‘నీ జీవితమంతా భగవంతుడి సాన్నిధ్యంలో గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అయితే, నీ సమీపంలోనే ఉన్న నిధి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావు. అతను రోజూ భగవత్సేవ చేస్తూ యథాశక్తి నీకు దానం చేశాడు. అందుకే అతణ్ని ఆ నిధి వరించింది. నిజానికీ చాలా మంది తమలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు. దానివల్ల పక్కవారు లాభం పొందుతుంటారు’’ సమాధానమిచ్చాడు ఇంద్రుడు. మౌనంగా తలదించుకున్నాడు ఆ యాచకుడు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment