Wednesday, January 24, 2024

శతమానం భవతి*— *త్రిశతమానం భవతి

 *శతమానం భవతి*— *త్రిశతమానం భవతి*

మనిషి జీవితంలో రెండే వాస్తవాలు- ఒకటి పుట్టుక, రెండు మరణం. మరణాన్ని జయించాలన్నది మనిషి చిరకాల వాంఛ.

మహాభారతంలోని ఉదంకోపాఖ్యానం, క్షీరసాగర మథనం, సర్పయాగం- మనిషి కోరికను ప్రతిఫలించే ఘట్టాలు. మరణం అంటూ లేని స్థితిని- అమరత్వమని, తిరిగి పుట్టుక లేని స్థితిని మోక్షమనీ చెబుతారు.
*‘తనువే నిత్యముగా ఒనర్పుము... అది లేదా... చచ్చి జన్మింపకుండ ఉపాయంబు ఘటింపుము’"* అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి వెలిబుచ్చింది- ఆస్తికులందరి కోరిక.

రావణాసురుడు, హిరణ్యకశిపుడు వంటి దానవులు ఆరాటపడింది- అమరత్వం కోసం.

*శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతిం చెదన్‌’* అని పోతన వంటి కవులు తపించింది- మోక్ష స్థితికోసం.

రాక్షస గురువు శుక్రాచార్యుడు సాధించిన *‘మృతసంజీవని విద్య’* అమరత్వ సాధనలో తొలి విజయం. అయితే, ఆ విద్య- మరణించినవారిని అదే స్థితిలో తిరిగి బతికించడానికే తప్ప వృద్ధాప్యాన్ని, మరణాన్ని నివారించడానికి పనికిరాలేదు. పైగా యుగాలు గడిచేకొద్దీ మనిషి ఆయుర్దాయం తరిగిపోతూ వచ్చింది.

శ్రీ కృష్ణుడు 125 ఏళ్లు జీవించాడని హరివంశం విష్ణుపురాణం భాగవతం స్పష్టం చేశాయి. అది ఆయన నడి వయస్సు. ధర్మ రాజుకు 80వ ఏట పట్టాభిషేకం జరిగిందని పరిశోధకులు తేల్చారు. ఆ పై 36 ఏళ్లు ఆయన పరిపాలన సాగించాడు.

భీష్మపితామహుడు తన 170వ ఏట దేహ త్యాగం చేశాడని భారతం చెబుతోంది. ఆయనది స్వచ్ఛంద మరణం. అవి ద్వాపరయుగం నాటి ఆయుర్దాయాలు. ఈ ‘కలియుగమందు మానవులు- అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు’ అంది భాగవతం. అల్పతరమంటే ఓ నూరేళ్లని దాని లెక్క- అదైనా, పద్ధతిగా జీవిస్తే. ‘ఎవడు బతికేడు యాభైలు మూడు’ అని శ్రీశ్రీ అన్నది అందుకే!

పద్ధతిగా జీవించడమంటే- ‘ధర్మబద్ధంగా...’ అని అర్థం. ‘తపమునను, బ్రహ్మచర్య వ్రతమున, హిత మితాశనమున(మితభోజనం), రసాయన అభ్యాసమునను(ఔషధ విజ్ఞానం వల్ల) పెరుగును ఆయువు’ అంది భారతంలోని ఆనుశాసనిక పర్వం.*‘యుక్తాహార విహారస్య...’* శ్లోకంలో గీతాచార్యుడు చెప్పిందీ అదే. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే మాటను వందలసార్లు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం.

కాని దాని తాత్పర్యం తలకెక్కాలంటే మాత్రం మనిషికి అరవై ఏళ్లు పడుతోంది. ఆ సత్యాన్ని పాతికేళ్లకే ఒంటపట్టించుకొన్నవాడు నిశ్చయంగా శతాయువు అవుతాడని ఆయుర్వేదం హామీ ఇస్తోంది. *‘చరమధాతు రక్ష(శుక్ల ధాతువు సంరక్షణ) సమ్మతినొనరించు సజ్జనుండు వర్షశతము బ్రతుకు!’* అని హితవు చెబుతోంది చారుచర్య. ఈ అన్నింటినీ కలిపి ఆలోచిస్తే ఆ వందేళ్లు సైతం పూర్తిగా ఎందుకు బతకలేకపోతున్నామో- మనకే తెలిసిపోతుంది. 

బతుకు నావను రేవులోని వ్యసనాల మోకుకు ముడిపెట్టి, నూరేళ్ల ఆయుర్దాయపు ఆవలి తీరానికి చేరుకోవాలని ఎంత ఆరాటపడితే మాత్రం... ఏం ప్రయోజనం?

No comments:

Post a Comment