🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 22 🌺
🌹 సమదృష్టి 🌹
◆ విద్యుత్ ప్రసారం మన శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. నాడుల (nerves) గుండా అవి ప్రసరిస్తూ అన్ని కండరాలనూ పని చేయిస్తాయి.
◆ అవయవం పాడైపోయిన ఓ రోగికి ఆ అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లలో రెండు “ ఎలక్రోడ్ ” ( విద్యుత్ ప్రసారం కానివ్వగల లోహపు పదార్ధాలు ) లను అమరుస్తారు . ఆ చెయ్యో , కాలో బాగుంటే ఈ నరాల గుండా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని పనిచేయించి ఉండేవి . పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తరువాత , ఆ పుండు మానిన తరువాత ఓ కృతిమాంగాన్ని ఏర్పాటుచేస్తారు . ఈ కృత్రిమాంగం చివర్లో ఉన్న ఎలెక్ట్రోడులకు శరీరంలో అమర్చబడిన రెండు ఎలెక్ట్రోలూ కలిసి విద్యుత్ వలయం పూర్తవుతుంది . ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు - బహుశా ఆ వ్యక్తి చేతి వ్రేళ్ళను కదిలించేందుకు ఉద్దేశించబడింది కావచ్చు ఈ ఎలక్రోడ్ల గుండా క్రొత్తగా అమర్చబడిన కృత్రిమాంగానికి అందుతాయి . అక్కడ వున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమాంగంలోని అనేక ' రిలే'లను కదిలించి , చిన్న చిన్న మోటార్లను చలింపజేసి ఈ క్రొత్త చేతి వేళ్ళను పనిచేయించగలుగుతాయి! ఈ కృతిమాంగాన్ని ఉపయోగించి వ్రాతపనిని కూడా సులభంగా చెయ్యగలమని తెలుస్తోంది .
◆ విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం .ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు . ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గేవరకు తిండి తినదు . మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు . మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణరసాలేవీ ఆ జంతువు భయంతో వణుకుతున్నంతవరకు తయారుకావు . అన్ని జీర్ణరసాలూ లోపల్లోపనే ఇంకిపోతాయి . తిండి తినే స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం .
◆ చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్నవాళ్ళకూ , బాగా దిగులుతో క్రుంగిపోయి ఉన్నవాళ్ళకూ ఎవరూ బ్రతిమాలి గానీ , బలవంత పెట్టి గానీ తిండి పెట్టకూడదు . అటువంటి వాళ్ళ మేలు కోరే వాళ్ళే వాళ్ళని బ్రతిమాలుతారనే విషయం నిజమే గాని ఆ భోజనం మాత్రం వాళ్ళకు ఎటువంటి మేలూ చెయ్యదనే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖం, ఉద్వేగం మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి.
◆ కష్టాల్లో సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి . ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు . అనవసరంగా క్రుంగిపోకూడదు . ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని సాధన చెయ్యాలి .
◆ ఓ మనిషి పరధ్యానంతో ఉన్నా , అతని మొదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నా , అట్లాంటి వాడు సూక్ష్మశరీరయానాన్ని చైతన్యంతో చెయ్యలేడు . టెలీపతీని గానీ , యోగదృష్టిని గానీ , సైకోమెట్రీని గానీ , ఏ విద్యను గానీ సాధించలేడు , ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు .
◆ పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకే సిద్ధులు లభిస్తాయి . మెదళ్ళలోంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలయినంత సరళంగా ఉంటేనే , వస్తున్న సంకేతాలను ' గ్రహించగలిగే శక్తిని మన మెదడు పొందగలుగుతుంది . భావగ్రహణ లేదా భావ ప్రసారణ చెయ్యాలంటే మన మనస్సులు చాలా ప్రశాంతంగా ఉండాలి . మన మనస్సులు తెరచి ఉంచబడాలి . మన మెదళ్ళలో అల్లకల్లోలపు విద్యుత్ప్రసారాలు జరుగుతూ ఉంటే , మన దీనస్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు , ఇంకొకరి ఆలోచనలు ఏవీ మనలోకి రాలేవు . కాబట్టి , మనం ఎలాంటి సంకేతాలునూ అందుకోలేం . నరాల జబ్బుల్తో బాధపడే వాడెవడూ యోగదృష్టిని సాధించలేడు . ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకుని గ్రహించలేడు !
◆ విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది.జీవం అంతా ప్రకంపనే. మృత్యువులో కూడా ప్రకంపనలే ఉంటాయి. మృత్యువు వల్ల నశిస్తున్న కణాలన్నీ నిరంతరం అనేక సమ్మినణాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి.
◆ మన మనస్సుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే మనం దేన్ని కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనస్సు అందిస్తుంది. “ అచేతనమనస్సు ” లో అనంతమైన శక్తులు ఉన్నాయి . అచేతనపు మనస్సును అందుకునే విధానం మాత్రం చాలా మందికి నేర్పింపబడలేదు. మనం చైతన్యంలో పదో వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం . అచేతనపు మనస్సును కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లా మనమూ ఎన్నో అద్భుతాల్ని సాధించవచ్చు .
◆ మొట్టమొదటగా మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోండి . మీ కోరిక ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి . మీకు ఏంకావాలో అడిగి తీరాలి . మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి . మీకు ఏం కావాలి ? బోలెడు డబ్బుకావాలని అడిగితే కుదరదు . ఓ కొత్తకారో , కొత్త మొగుడో పెళ్ళామోకావాలని అడిగితే కుదరదు . మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి . మీ ఆలోచనలలో మీకోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి - ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మీ లక్ష్యంగా ఉంచుకోండి . మీరు వివేకవంతులైతే మాత్రం , డబ్బునూ , ఐహికవస్తువులనూ అభిలషించరు - ఓ గాంధీలాగానో , ఓ బుద్ధుడిలాగానో , ఓ క్రీస్తులాగానో , ఓ సెయింట్ పీటర్ లాగానే మరో ఇంకెవరయినా సన్యాసి లాగానో ఉండాలని మాత్రం కోరుకుంటారు . మీ వెంట తీసుకువెళ్ళగలిగిన , ఇంకో జన్మలో , కూడా మిమ్మల్ని అనుసరించే సచ్చీలతా , జ్ఞాన సంపదా , పుణ్యాలకోసమే మీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు .
◆ మీకు ఏం కావాలో మీరు పూర్తిగా నిశ్చయించుకున్న తరువాత మీరు రెండో అంకంలోకి వస్తారు . మేము ఇదివరకు మీకు చెప్పినట్లుగా - మీరు ఇస్తేనే పుచ్చుకోగలరు. మీరేం ఇస్తారు ? కొంత డబ్బుకావాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ( ఆ డబ్బు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పాలి ) అందులోంచి ఓ ' టిత్ , (tithe) ను అంటే పదవవంతు డబ్బును , ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా ? మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మీరు సహాయం చెయ్యడానికి ఒప్పుకుంటున్నారా ? - సరే , నాకు ఓ లక్ష వస్తే , పదివేలు ఇస్తాను లెండి ” అని చెప్పడం నిరర్ధకం . లక్ష మీ చేతిలో వచ్చి పడకముందే మీరు కష్టాల్లో వున్నవాళ్ళను ఆదుకుంటూ ఉండడాన్ని ప్రారంభించి ఉండాలి . సంతోషంతో సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారంటే “ ఇచ్చి - పుచ్చుకో ” అనే సూక్తి అర్ధాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క.
◆ మీ కోరిక యొక్క లక్ష్యం నిర్దిష్టంగా , స్పష్టంగా ఉండి తీరాలి . ఇక మూడో అంకం గురించి తెలుసుకుందాం . మీకు - ఆ క్రొత్తకారో , క్రొత్త మొగుడో , క్రొత్త పెళ్ళామో ఎప్పుడు కావాలి ? ఎప్పుడో భవిష్యత్తులో కావాలి " అని చెప్పుకోవడం కూడా నిష్పలం - నిరర్ధకం . అదే విధంగా “ వెంటనే కావాలి ! ఇప్పుడే కావాలి ! ” అని చెప్పుకోవడం కూడా అవివేకమే ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు గనుక . ఏ దేవుడికీ ఓ బంగారు ఇటుకను , నిరీక్షిస్తున్న మీ దోసిలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరేపని కాదు కాబట్టి . ఒకవేళ పడినా మీ చేతుల్తో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు . మీ పాదాల
మీద ఆ బరువు పడి కాళ్ళు చితికిపోవచ్చు బహుశా !
ఇది సంభవమే ! మీరు నిర్ణయించుకునే కాల పరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అణుగుణంగా ఉండి తీరాలి . కాబట్టి ఫలానా సంవత్సరం , ఫలానా నెలలో మీకు ద్రవ్యం లభిస్తుందని అనుకోవడం సబబుగా ఉంటుంది . మరో ఐదు నిమిషాల్లో ఓ సంపద మీ చేతిలోకి వస్తుందని ఊహించడం ప్రకృతి ధర్మాలకే విరుద్ధం - మీ ఆలోచనాశక్తి కూడా నిరర్ధకంగా క్షీణిస్తుంది.
◆ మీ ధ్యేయాన్ని సాధించేందుకు మీరేం చేయబోతున్నారు ? ఓ ఉదాహరణకోసం - మీకో కారు కావాలని కోరుకుంటున్నారు అనుకోండి . సరే , ఇంతకూ మీకు కారు డ్రైవింగ్ వచ్చా ? రాకపోతే మీరు కారును కోరుకోవడంలో ఏమయినా అర్థం ఉందా ? కాబట్టి మీకు కారు కావాలని దృఢమైన కోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్చుకోండి . తరువాత మీకు ఎలాంటి కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు .
◆ అలాగే పెళ్ళికోసం మీరు తహ తహలాడుతుంటే ముందుగా మీరు ఎందుకోసం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో మీ అర్హతలేమిటో , ఇచ్చి పుచ్చుకునే స్వభావం మీకుందో లేదో అర్థం చేసుకోండి. సంసారంలో తగిన భాగస్వాములుగా మీరు ఉండగలరో లేదో తెలుసుకోండి . మీ వంతు పాత్రనూ , మీవంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేదో గ్రహించుకోండి . ఇంకొకరిని మీరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్ళకు మీరు తగిన భాగస్వామిగా ఉండాలి కదా . “ పెళ్ళి ” అంటే మీరు ఏమీ ఇవ్వకుండా , అంతా లాక్కునే వ్యవస్థకాదు . పెళ్ళాడిన తరువాత మీరు ఓ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలూ , ఇద్దరి కష్టాలూ , ఇద్దరి సమస్యలూ మీవే అవుతాయి . శారీరకంగా , మానసికంగా , ఆధ్యాత్మికంగా మీరు సరయిన స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి మీరు చక్కటి భాగస్వాములు కాగలరు . సహజీవనం సాగించగలరు .
◆ గోటి మాట కన్నా చేతి వ్రాత చాలా గొప్పది . ఈ రెండూ ఒక్కచోట్లో కలిసి ఉంటే ఎదురులేని జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి . మీకు ఏం కావాలో వ్రాయండి . ఎంత క్లుప్తంగా వ్రాస్తే అంత మంచిది . ఎంత స్పష్టంగా వ్రాస్తే అంత మంచిది . మీకేం కావాలో మీకు తెలుసు కనుక ఆ కోరిక ఏమిటో స్పష్టంగా వ్రాయండి . మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా ? ఈ విషయంలో మీకు మార్గదర్శి ఎవరు ? ఆ వ్యక్తి గుణగణాల గురించి వ్రాయండి . మీకు డబ్బు కావాలా ? మీకు ఎంత కావాలో వ్రాయండి . వ్రాతపూర్వకంగా మీరు ఇంకొకళ్ళకు సహాయం చెయ్యగలమనీ పదోవంతు దానం చేస్తామని వ్రాయండి . ఇదంతా స్పష్టంగా వ్రాసిన తరువాత చివర్లో ' ' నేను యిస్తాను ; తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు ” . అనే మాటను వ్రాయండి . ఆ డబ్బును సంపాదించేందుకు ఏ పనులు చెయ్యదలచుకున్నారో కూడా చివరలో వ్రాయండి .
◆ ఉత్తినే కూర్చుంటే మీకు ఏదీ రాదని గ్రహించండి. తీసుకున్న ప్రతి వస్తువుకూ తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి వుంటుందని మరిచిపోకండి .
" ఉచితంగా ఏదీ మనకు లభించదు ” అని తెలుసుకోండి . అనాయాచితంగా మీకో వంద డాలర్ల డబ్బు ప్రాప్తించిందనుకోండి . ఆ వంద డాలర్లకు సరిపోయే పనిని తప్పక చేయవలసి ఉంటుంది . ఇంకొకళ్ళ సహాయాన్ని మీరు కోరాలనుకునే ముందే ఇంకొకళ్ళకు మీరు సహాయాన్ని చేసి తీరాలి.
◆ ఇదంతా మీరు వ్రాసి ఉంచుకున్నారని మేము భావిస్తున్నాం . ఈ మాటలన్నింటినీ మీలో మీరే రోజుకు మూడుసార్లు బిగ్గరగా చదివివినండి . మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాలను మీలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది . మీ పడకగదిలోంచి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి . మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఓసారి చదవండి . రాత్రి మీరు పడుకోబోయే ముందు మూడోసారి
దాన్ని చదివిపడుకోండి . ముమ్మార్లు మీ నిశ్చయాల్ని ఓ మంత్రంలాగా మీరు కావాల్సిన కారో , డబ్బులో మీ వద్దకు వస్తున్నట్లు ఊహించండి . ఆ డబ్బో , వస్తువో మీ వద్దకు వచ్చేసినట్లు ఊహించండి . ఎంత తీవ్రంగా స్పష్టంగా మీరు ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు సిద్ధిస్తాయి . ఇది పనిచేస్తే బావుణ్ణు . అది నాకు లభిస్తే బావుణ్ణు - రాదేమోనని నా అనుమానం ” – ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడూ మీ ఆలోచనలు సవ్యంగానే సాగాలి . ఎలాంటి అనుమానాలూ మీకు రాకూడదు . మీ ఆలోచనలు ఎప్పుడూ నిర్మాణాత్మ కంగానే సాగుతూండాలి . ఇలా కొంతకాలం చేసేసరికి మీ అంతరంగంలోకి , మీ అచేతనపు మనస్సులోకి ఈ కోరిక బాగా నాటుకుంటుంది .
◆ మీ చేతనత్వపు మనస్సుకన్నా మీ అచేతన చైతన్యం 9 రెట్లు తెలివైనది. మీ అచేతన మనస్సుకు ఉత్సాహం కలిగించగలిగారంటే మీకు దాన్నుంచి సహాయం రావడం ప్రారంభమవుతుంది . మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయమే మీకు లభించి తీరుతుంది . వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తరువాత మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయిని చాలాసార్లు నిరూపించబడి ఉంది . డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి - అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా - ఆకర్షింపబడుతూ ఉంటుంది !
◆ మరణం లేని మీరు సే::మాధవ కొల్లి.
No comments:
Post a Comment