Monday, February 5, 2024

 నీ దృష్టిని బట్టే సృష్టి

తులసీదాసు ప్రతిరోజూ సాయంత్రం  రామాయణప్రవచనం చేస్తుండేవారు...

హనుమంతులవారు ఓ వృద్ధమానవుని రూపంలో ఆ చివరి వరుసలో కూర్చొని వింటుండేవారు...

ఓరోజు తులసీదాసుగారు సుందరకాండ చెబుతూ...

"హనుమంతుడు లంకలో, ఓ తోటలో తెల్లనిపూలను చూచెను" అని చెప్పారు...

హనుమంతుడు ఉలిక్కిపడి, 'అరె నేను చూచింది ఎర్రని పూలు కదా!' అనుకుని, సర్లే సభ అంతా ఖాళీ అయిపోయాక, దాసుగారికి చెబుదాం...అని మిన్నకుండిపోయారు...

ప్రవచనం అయిపోయింది...
సభంతా ఖాళీ అయిపోయింది...

వృద్ధ మానవుని రూపంలో ఉన్న హనుమ, 
తులసీ చెంతకు చేరి, "అయ్యా! దాసుగారూ! హనుమంతులవారు చూచింది తెల్లని పూలు కాదండీ...ఎఱ్ఱనిపూలు" అన్నాడు.

"కాదు హనుమంతులవారు చూచింది తెల్లనిపూలే" అన్నాడు స్థిరంగా.

"కాదు ఎఱ్ఱనివి" అన్నాడు ఆ వృద్ధుడు స్వరం పెంచి.

"కాదు తెల్లనివి" దాసుగారు పట్టు వదలలేదు...

ఇక లాభం లేదనుకుని హనుమంతులవారు తన నిజరూపంతో దర్శనమిచ్చి-

"నేనెవరుకున్నావు? నేను హనుమాన్... స్వయంగా ఆ తోటలో పూలను చూచినవాణ్ణి.  నేను చూచింది ఎఱ్ఱనిపూలే" అన్నాడు.

"హనుమా! మీకు సహస్రాదిక వందనములు...
మీ దర్శనం రామదర్శనానికి శుభసూచకం...
మీరు చూచింది తెల్లని పూలే"
అన్నారు దాసు చిరునవ్వుతో...

వొళ్లు మండింది హనుమాన్ కు...

హనుమ రాముణ్ణి ప్రార్థించాడు...
రాములవారు ప్రత్యక్షమయ్యారు...

ప్రత్యర్థులిద్దరూ రామునికి నమస్కరించుకున్నారు...

"హనుమా ఏంటి విషయం?" అడిగారు రాములవారు...

చూడు రామా! నేను లంకలో చూచింది ఎఱ్ఱని పూలైతే, ఈ దాసు తెల్లనిపూలు అంటున్నాడు...
అన్నాడు చిన్నపిల్లడిలా హనుమ.

రాములవారు చిరునవ్వుతో-
"అవును హనుమా! నీవు చూచింది తెల్లని పూలే."
అన్నారు.

"హే రామా! మీరు కూడా దాసు పక్షం అయిపోయారా?" అన్నారు విచారంగా.

"లేదు హనుమా! నీవు చూచింది తెల్లనిపూలే...
కానీ రావణునిపై ఆగ్రహంతో ఉన్న నీ కళ్లు ఎరుపెక్కి ఆ తెల్లనిపూలు ఎఱ్ఱగా కనబడ్డాయి...అంతే." అని తీర్పుతీర్చారు రాములవారు.

ఇద్దరూ సంతోషించారు...
హనుమ, దాసుగారిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు...
రాములువారు మాయమైనారు...

* * *

"నీ దృష్టిని బట్టే సృష్టి" 
అనే ఆధ్యాత్మిక నానుడికి పరమ ఉదాహరణ ఈ కథ. 

నీవు చూచే ప్రపంచం నీదే, నీవే...
అన్న సద్గురు సూక్తికి పరమ ఉదాహరణ ఈ కథ.

"సిద్ధా! లోకాలెన్నిరా?" అని అడిగిన బ్రహ్మంగారికి,
"ఎవడి లోకంలో వాడున్నాడు గురువుగారూ!" అని సిద్ధయ్య చెప్పిన సమాధానానికి పరమ ఉదాహరణ ఈ కథ. 

* * *

బ్రహ్మ అనేవాడు ఒకడు ఉండి, ఒక లోకాన్ని సృష్టించడం, అందులో అందరం ఉండడం కాదు, 

"నేనే" బ్రహ్మ.

"నేను" స్వయంగా సృష్టించుకున్న లోకంలో అందరూ ఉన్నారు, బాబు నుంచి బ్రహ్మతో సహా.
నేను కనే కలలో బాబుతో సహా సకలమూ ఉన్నట్లుగా.

బాబు కల నుండి మేలుకుంటే
సమస్తమూ పోయి, బాబే మిగులుతాడు.

కానీ "నేను" కనే ఈ జగత్కల నుండి మేలుకుంటే, 
బాబుతో సహా సమస్తమూ పోయి
"నేను" మిగులుతాను.

ఆ "నేను" బాబు కాదు.
ఆ "నేనే" నేను.
అని బాబు తెలుసుకోవడమే ఆత్మవిచారఫలం.

అందువల్లనే మన గురువుగారు పదే పదే చెబుతుంటారు-

"నీవు దేనిని చూచినా, ఎవరిని చూచినా 
నిన్ను నీవు చూస్తున్నట్టు అనిపించాలి." అని.

"నేను తప్ప ఏమీలేదు"
"నేను మాత్రమే ఉన్నాను"
"నేనే విశ్వకేంద్రం"

....ఇవన్నీ జ్ఞానమంత్రాలు....

* * *

ఈ తులసీ-హనుమ కథకు చారిత్రక ఆధారాలు అడిగితే, నా వద్ద లేదుగానీ, 
నా చిన్నవయసులో ఓ అద్భుతమైన పుస్తకం చదివాను... ఆ పుస్తకం ఆద్యంతమూ మధురాతి మధురము... 

ఆ పుస్తకం - "వినోభాభావే గీతాప్రవచనాలు" 
ఈ కథ అందులోనిదే. 

భారత స్వాతంత్ర్యపోరాటంలో కొంతకాలం చెరశాలలో ఉన్నప్పుడు తోటి ఖైదీలకు భగవద్గీతపై వినోభాభావే చేసిన  ప్రసంగాల సమాహారమే ఆ పుస్తకం. 

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువదగిన పుస్తకం అది.

అందులో ప్రతిపేజీ నాకు ఇప్పటికీ గుర్తు.
అన్నిసార్లు చదివాను...

ఆధ్యాత్మికోన్నతిని కలిగించే ఇలాంటి మధురమైన కథలు ఎన్నో ఉన్నాయి అందులో...

గాంధీమహాత్ముడంతటివారు ఆధ్యాత్మికగురువుగా భావించిన మహావ్యక్తి - ఆచార్య వినోభాభావే.

* * *

No comments:

Post a Comment