Thursday, February 29, 2024

మనసు

 .                *మనసు*
.               *********

      విమానమ్మది విమానమ్మని
 మురిసి పోదుము గగనమున గని ! 
   విమానమ్మును మించు వడి గల
     విమానము ఒకటున్నదీ యిల ! 

   ఏది యా నిజమగు విమానము ? 
      ఎక్కడున్నది ఆ విమానము ? 
   ఇలలొ కనబడునది విమానమ ?! 
   కలలొ కనబడునది విమానమ ?! 

     ఆధునిక నూతన విమానమ ! 
      యక్ష గంధర్వుల విమానమ ! 
       దేవతల పుష్పక విమానమ ! 
     కాదు కాదు మరే విమానము ?! 

       ఇక్కడే మనలోనె ఉన్నది ! 
    విశ్వమంతడుగిడుతు ఉన్నది ! 
      కంటికగుపడకుండ ఉన్నది ! 
     స్పర్శ కైనను తెలియ కున్నది ! 

      తలచు రీతిగ తలచినంతట
      తలచు లోపలె విశ్వమంతట
      తిరిగి తిరిగిటు వచ్చుచున్నది. 
      తృప్తిగా మననుంచు చున్నది. 

   ఏది యా నిజమగు విమానము ?!
   మనలోని మనసే ఆ విమానము ! 
     అడ్డు లేనిది !  అదుపు లేనిది ! 
      అంత యింతని చెప్ప రానిది ! 

       చూడవలె ననుకున్న దానిని
       తక్షణమె చూపించు దర్శిని ! 
       దర్శినీ ! ఇది సుదూర దర్శిని ! 
         సాటి లేని అదృశ్య దర్శిని ! 
               అదృశ్య దర్శిని !! 

         **********************
రచన :---- రుద్ర మాణిక్యం. (✍️కవి రత్న) 
   రిటైర్డ్ టీచర్.   జగిత్యాల (జిల్లా) 

*************************************

No comments:

Post a Comment