Friday, July 5, 2024

 "జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు- 06వ భాగము.
ఆ దివ్య పరమపురుషుని నుండే వేదములు, లోకములు, దేవతలు, యజ్ఞాలు, దీక్షలు, క్రతువులు, కాలము, దక్షిణ, యజమాని, పశువులు, పక్షులు, సస్యాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, ఓషధులు ఆవిర్భవించేయి. అంటే అన్నింటిలో ఆ పరమపురుషుడే అంతర్యామిగా వున్నాడు.

స్థూలంగా చూసిన, సూక్ష్మంగా చూసిన ఈ జగత్తంతా పరమపురుషుడే అన్నమాట. అతడు జీవుని హృదయగుహలో వుంటాడు. జీవునికి దగ్గరగా వుంటాడు అది గ్రహించినవాడే జ్ఞాని.

ఓంకారమనే ధనుస్సులో, జీవాత్మనే బాణమును ఎక్కుపెట్టి, తదేకభావముతో లాగి, బ్రహ్మమనే లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ రకంగా జీవాత్మ భావనతో సాధనచేస్తే బ్రహ్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది. అంటే పరబ్రహ్మముయందే మనస్సులగ్నంచేసి, లోకవ్యవహారం నుండి మెల్లగా బయటపడాలి.

హృదయంలో నున్న ఆత్మను ఓంకారరూపంలో ధ్యానం చెయ్యాలి. అన్నింటిని ప్రకాశింపజేసే వెలుగే ఆత్మ. అదే పరంజ్యోతి, ఆత్మజ్యోతి.

శరీరమనే చెట్టుపై రెండు పక్షుల వలే జీవాత్మ, పరమాత్మలు వుంటాయి. జీవాత్మ పండ్లుతింటూ అదే ఆనందం, సర్వం అనుకుంటుంది. అంటే కర్మలే సర్వస్వంగా భావించి ఫలితాలను అనుభవిస్తుంది. పరమాత్మ సాక్షీభూతంగా అన్నీ గమనిస్తూ వుంటుంది. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మను గ్రహిస్తుందో వెంటనే శోకవిముక్తి కలుగుతుంది.

పరమాత్మను అనుభవించడానికి నాలుగు సాధనాలు చెప్పబడ్డాయి. అవి సత్యము, తపస్సు, సమ్యక్ దర్శనము, బ్రహ్మచర్యము. ఎల్లప్పుడూ "సత్యమే జయిస్తుంది", అంటే సత్యమైన పరమాత్మ మాత్రమే శాశ్వతంగా ప్రకాశిస్తుంది. అసత్యం ఎప్పటికీ జయించదు, అంటే అసత్యమైన ప్రకృతి శాశ్వతం కాదు.

**సూచన : మన భారతదేశ రాజముద్రికపై పేర్కొన్న "సత్యమేవ జయతే" అన్న గొప్ప నినాదం ఈ "ముండకోపనిషత్తు" నుండి తీసుకున్నదే.

ఇంకొన్ని విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాము...🙏🏻

No comments:

Post a Comment