Tuesday, July 9, 2024

 అది 1194  వ సంవత్సరం మార్చ్ ఒకటి , ఫాల్గుణ అమావాస్య. కనౌజ్ నగరం లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, తగలబడ్డ ఇళ్ళే, దోచుకోబడిన దేవాలయాలే, తమ తల్లితండ్రుల , భర్త , బంధుమిత్రుల శవాలమీద పడి ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా తమ మీద పడి చెరుస్తున్న రక్కసిమూకలకు బలైపోతున్న ఆడపడచులే కనిపిస్తున్నారు.

నిన్నటిదాకా తమ మిత్రులు అనుకున్నవారే తమని చంపి, తమని దోచుకుని, బందీలుగా వారి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు.  

అక్కడే రెండు చేతులు కోల్పోయి పడివున్న ఒక సైనికుడు , అవును ఇది మేము చేసిన పాపానికి ఫలితమే మనకు ఇలా జరగాల్సిందే , మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని అరుస్తున్నాడు .

అతడు రెండున్నరేళ్ల  క్రితం తమ రాజు జైచంద్ తరఫున పృథ్విరాజ్ చౌహన్ కి వ్యతిరేకంగా మొహమ్మద్ ఘోరీ తో కలసి పోరాటం చేసి పృథ్విరాజ్ ని ఓడించిన సైన్యంలో ఒక సైనికుడు  . పృథ్విరాజ్ ని ఎప్పటికీ గెలవలేను అని అనుకున్న ఘోరీ పక్షాన నిలబడి సాటి హైందవ రాజు ఐన పృథ్విరాజ్ ని ఓడించి అతడి రాజ్యాన్ని ఘోరీ నాశనం చేస్తుంటే చూసి ఆనందించారు .

కానీ మూడేళ్లు తిరగకుండానే అదే ఘోరీ మిత్రద్రోహానికి పాల్పడి అతడికి ఎంతో సహాయం చేసిన జైచంద్ మీద యుద్ధానికి దిగి అతడిని చంపి అతడి రాజ్యాన్ని సర్వనాశనం చేసి  అతడి రాణిని , అంతఃపుర మహిళలని , ప్రజలను బానిసలుగా తీసుకుని పోయాడు .   

ఇప్పటికీ అదే , ఎప్పటికీ అదే . మన పక్షాన నిలబడి మనకోసం మన పగవాడితో యుద్ధం చేస్తున్న ప్రతీ యోధుడినీ మనమే వెన్నుపోటు పొడిచాము. అలా వెన్నుపోటు పొడిచిన మనము కూడా అలాంటి మిత్రద్రోహానికే గురై ఆ పాపానికి ఫలితం అనుభవిస్తూనే వున్నాము .

అయినా కూడా మనకు చరిత్ర పట్టదు , మనము చరిత్ర నుండి ఏమీ నేర్చుకోము. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాము ఫలితం అనుభవిస్తూనే ఉంటాము .మనం ఇంతేనేమో .

No comments:

Post a Comment