Sunday, July 7, 2024

*****ధృవోపాఖ్యానము

 *శ్రీరమణీయభాగవత కథలు- 20 - (1)*
( బాపు-రమణ )

జరిగిన కథ: మహాశక్తివంతుడైన గరుత్మంతుడు స్వర్గలోకం నుండి అమృతం తెచ్చి కద్రువకిచ్చి తన తల్లి దాస్యం నుంచి విడిపిస్తాడు. శ్రీహరికి వాహనమవుతాడు.


ఇక చదవండి


******
*ధృవోపాఖ్యానము- 1*


*యాగశాల*
శుక: పక్షిజాతిని పాముజాతిని ఆదరించిన ఆ పరంధాముడు పసి బిడ్డలను కూడా ఎంతగానో ప్రేమించి చేరదీశాడు. పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా కనుపించని భగవంతుడు- అయిదారేళ్ల బాలుడైన ధ్రువుడిని ఆరు మాసాల తపస్సుకే కరుణించాడు. 

ఆ పుణ్యకధ విను.

పరీ:
పసిబాలుడు అని జాలిపడి అంత సులువుగా వరమివ్వడం పక్షపాతం కాదా? దేవుడికి కూడా చిన్నా పెద్దా రాజూ పేదా అనే తేడాలుంటాయా?

శుక:
రాజూ పేదా అనేకాదు. దేవతలూ దానవులూ అన్న భేదం కూడా వుండదు. అలావుంటే అంతమంది రాక్షసులకు అంత పెద్ద వరాలు లభిస్తాయా? రాజా! తపస్సు ఫలించడానికి కొలమానం- ఎంతకాలం ఎంతకష్టం అన్నది కాదు. ఎంత నిష్ట ఎంత శ్రద్ధ అన్నది. 

విశ్వామిత్రుడి వంటి ఋషికి మోహం రెచ్చకొట్టి మేనకా, అహం రెచ్చగొట్టి త్రిశంకుడూ దీక్ష పాడు చేశారు. ఆ తపశ్శక్తి తిరిగి సంపాదించడానికి ఆయనకు కొన్ని వేల ఏళ్లు పట్టింది.

బాలుడు ధ్రువునికి ఆ సమస్యలు లేనే లేవు. అతని కోరిక కూడా దేవుడిని చూడాలనే తప్ప ఏం కోరాలన్నది స్పష్టంగా తెలియదు.

పరీ:
ఆశ్చర్యంగా వుంది. ఏం కావాలో కూడా తెలియని పసిబిడ్డ వెళ్లడం ఎలా జరిగింది?

అతని తలితండ్రు లెవరు?

శుక:
ఉత్థాన పాదుడనే రాజుకి సునీత, సురుచి అని ఇద్దరు భార్యలు. 

పెద్ద భార్య కుమారుడే ధ్రువుడు. రాజుకి చిన్న భార్య సురుచి మీదనే మక్కువ ఎక్కువ.

        *రాజమందిరం*

ఒక నాడు సురుచి మేడలో రాజు కూర్చుని చిన్న కొడుకు ఉత్తముని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు.

ఇదారేళ్ల బాలుడు ద్రువుడు పరుగున వస్తున్నాడు. సురుచి చిరాగ్గా చూసింది రాజు సురుచి ముఖం వంక
బెదురుగా చూశాడు. ఆమె రుసరుస లాడింది.

ద్రువుడు వచ్చి పరుపుల మీది కెళ్ళి రాజుగారి వడిలోకి పాకుతున్నాడు. సురుచి మందుకు వంగి అతని రెక్క పట్టుకుని లాగేసింది ద్రువుడు బిక్కమొహం వేశాడు.

ధృవుడు: నాన్నగారు! నేను కూడా మీ వడిలో కూచుంటాను.

రాజుగారు సురుచి వంక ఇబ్బందిగా చూశాడు. ధ్రువుడు తిరిగి ముందుకు పాకాడు సురుచి నెట్టి వేసింది.

ఉత్థా :సురుచీ - పోని ఒక్క క్షణం...

సురుచి:
ఇవాళ వడిలో అన్నాడు. రేపు సింహాసనం మీద కెక్కుతానంటాడు. 

పోరా పో! నీకా భాగ్యం కావాలంటే నాకడుపున పుట్టాలి. నీ ఖర్మకాలి ఆ యింట పుట్టావు. ఈ జన్మకింతే. ఇంకో జన్మకేనా నా కడుపున పుట్టాలని ఆ దేవుడిని వరమడుగు ఫో...

ధ్రువుడు రోషంగా తండ్రికేసి చూశాడు. చిన్నకొడుకు ఆయన మీసాలు కిందకి లాగుతు న్నాడు.

ఉత్థా:
(మెల్లగా) మీ అమ్మ దగర కెళి అడుకో బాబూ నే నక్కడికి వస్తానుగా. అప్పుడు మనం ఆడుకుందాము.

ధ్రువునికి కళ్లనిండా నీరు నిండింది. తండ్రి ముఖం మసగ్గా కనబడింది. రెండు చేతులతో ముఖం కప్పుకుని పరుగెత్తాడు.

*సునీత రాజమందిరం*

ధ్రువుడు తల్లి వడిలో తలదాచుకుని ఏడుస్తున్నాడు. ఆమె కూడా దుఃఖిస్తోంది.

సునీ: అవును. మీ చిన్నమ్మ చెప్పింది నిజమే నాయనా? అవిడ కడుపున కాకుండా నా బిడ్డగా పుట్టడం నీ దురదృష్టమే నాన్న వడిలో కూర్చునే భాగ్యం నీకు లేదు బాబూ.

తల్లి వడిలో తలవాల్చిన ధ్రువుడి రెండు కళ్లూ విప్పారాయి. కన్నీరు లేదు. నిశ్చలంగా చూస్తున్నాడు. 

నాన్నగారి ఒడిలో కాదు... ఇంకా ఎత్తయిన చోట కూర్చుంటాను. తమ్ముడికే కాదు. నాన్నకి కూడా అందనంత ఎత్తు మీద పెద్ద వడిలో కూచుంటాను.

సునీ : ఆ శ్రీహరి ఒక్కడే నీ కోరిక తీర్చగలడు నాయనా. మీ ముత్తాత బ్రహ్మదేవుడూ, తాతగారు మనుప్రజాపతీ అంత గొప్ప స్థానాల్లో వున్నారంటే ఆ దేవదేవుని దయే.

ధృవుడు:
(నిశ్చలంగా) ఆ దేవుడు ఎక్కడుంటాడు? ఇంకో రాణిగారి ఇంట్లోనా.

సునీ: ఆయన అందరిలో వుంటాడు. నాలో నీలో అందరిలో! కళ్లుమూసుకుని ఆయన్ని ప్రేమగా పిలిస్తే కనిపిస్తాడు పడుకో

ఆమె వెనక్కి జారబడి కన్నులు మూసుకుంది. 

ధ్రువుడి కళ్లు అలాగే నిశ్చలంగా చూస్తున్నాయి.


*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

*శ్రీరమణీయభాగవత కథలు- 20 - (2)*
( బాపు-రమణ )

జరిగిన కథ:
ధృవుడు తన తండ్రి ఒడిలో కూర్చోనీకుండా తన పినతల్లి సురుచి లాగివేస్తుంది. 
ధృవుని తల్లి సునీత, ధృవుని మహావిష్ణువును ప్రార్థించమంటుంది.

ఇక చదవండి
******
*ధృవోపాఖ్యానము- 2*

*అడవి దారి*

ఉదయం - ధ్రువుడునడిచి వెడుతున్నాడు. ఒక చోట నారదుడు ప్రత్యక్షమై ధృవుని దారిలోకి ఎదురుగా వచ్చి పలకరించాడు.

నార : బాలకా! ఎవరునువ్వు - "ఈ అడవిలో ఒంటరిగా వెళ్తున్నావు?

ధ్రువుడు నారదుని పైనించి కిందదాకా చూశాడు. తేజస్సు చూసి ఎవరో గొప్పవాడని గ్రహించాడు. నమస్కారం
పెట్టాడు.

ధృవుడు : నమస్కారం. నా పేరు ధ్రువుడు

నార : చిరంజీవ! నీ తల్లి తండ్రి ఎవరు?

ధ్రు: నా తండ్రి ఉత్తానపాదుడు. తల్లి సునీతి. నేను దేవుడి కోసం వెడుతున్నాను.

నార : (నవ్వి) దేవుడా? ఆయన ఎక్కడున్నాడని?

ధ్రు: వెతకడానికే ..

నార : ఎక్కడని? ఎలా వెతుకుతావు ?

ధ్రు: తపస్సు చేస్తాను.

నార : నువ్వా? మీ యింట్లో నీ యీడు పిల్లలతో హాయిగా ఆడుకునే ఈడుపిల్లవాడివి. ఈ కారడవిలో తపస్సా! నీకు భయం లేదూ?

ధ్రు:: దేవుడిని వెతుకుతుంటే భయమెందుకు?

నార: ఆకలేస్తే ఎప్పుడేం తినాలో తెలీని వయస్సు దేవుడు కనిపిస్తే ఏం వరం కోరుతావు?

ధ్రు: మా తండ్రిగారి వడిలో కూర్చుంటానంటే మా చిన్నమ్మ వద్దు పొమ్మంది. నాకు కోపం వచ్చింది.

నార: చింరజీవీ! అమ్మ నాన్నా అల్లరి చేస్తే కోప్పడతారు. అంతలోనే ఆదరించి ముద్దులాడతారు. నువ్విలా అలిగి పారిపోవడం తప్పు.

ధ్రు:పారిపోవటం లేదు. మా అమ్మకి చెప్పే వచ్చాను. నేను రాచ బిడ్డని నాకు రోషం వుంది.

నారదుడు కన్నులరమోడ్చి పైకి చూశాడు.

నార:: (తనలో) ఇది నీ ఆలోచన కాదు. ఆ పరమాత్ముడే నీకీ ఊహ కల్పించాడు. ఆయనే దారి చూపిస్తాడు. నీ ద్వారా ఆయన ఈ ప్రపంచానికే ఎదో గొప్ప సత్యాన్ని బోధిస్తాడు. 

ఓ లీలా మయుడా! నా ధర్మం నేను నెరవేరుస్తాను. (తన దివ్య హస్తాన్ని ధ్రువుని శిరస్సుపై వుంచాడు. ధ్రువుని ముఖంలో నూతన తేజం వెలిగింది)

సంకల్ప సిద్ధిరస్తు! జయోస్తు! నాయనా! కొంచెం ముందుకు వెడితే యమునా నది ఒడ్డున మధువనం అనే చక్కటి చిట్టడవి వుంది. 

అక్కడకు వెళ్లి స్నానం చేసి దర్భలు పరచి కూర్చో. నేను ఇపుడు చెప్పే మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో జపం చెయ్యి. (ముందుకు వంగాడు. ధ్రువుడు నమస్కరించాడు) ఇది ద్వాదశాక్షరీ మహామంత్రం. ఈ పన్నెండక్షరాలతో పిలిస్తే దేవుడు కనిపిస్తాడు. 

*ఓం! నమో భగవతే వాసుదేవాయ!*

ధ్రు: *ఓం నమో భగవతే వాసుదేవాయ!* (ముందుకు కదిలాడు)

నారదుడు రెండు చేతులా దీవించాడు. 'నారాయణ నారాయణ! 
*నది వొడ్డు - మధువనము అడవి*.

యమున వొడ్డున ద్రువుడు తపస్సు చేస్తున్నాడు. ఒక కాలిమీద నిలబడి కుడికాలును ఎడమ మోకాలు మీద ఆన్చి నిలచాడు. 

*ఓం నమో భగవతే వాసుదేవాయ!* 

అన్న ద్వాదశాక్షరిని జపిస్తున్నాడు. మొదట మూడు నాళ్ల కొక సారి రేగిపళ్ళు వెలగపళ్లు తిని బతికాడు. తరవాత ఆరేసి దినముల కొకసారి ఆకులలములు తిన్నాడు. మూడవ మాసంలో తొమ్మిది నాళ్లకొక్కమారు జలము తాగాడు. నాల్గవ నెలలో పన్నెండు దినాలకు ఒకసారి మాత్రం వాయు భక్షణం చేశాడు. 

ఆ తరువాత అది కూడా నిలిపి హరినామస్మరణ చేయసాగాడు. చిక్కిన కొద్దీ అతని బరువు పెరిగి భూమి ఒరిగింది. నీరసంతో వాడిన కొద్దీ అతనిలో వెలుగు అగ్నియై మహా తేజమై ముల్లోకాలనూ కదిపి వేసింది. 

ఆ లోకాలను తన కుక్షిలోనే వుంచుకునే పరమేశ్వరుడిని కూడా కుదిపివేసింది. 

*'ఓంనమో భగవతే వాసుదేవాయ!'*

భూనభాలు సంచలించిపోయేలా ప్రతి ధ్వనిస్తోంది. దేవతలంతా శ్రీ హరిని దర్శించి ఈ సంక్షోభానికి కారణం అడిగారు. ఆయన వారికి అభయమిచ్చాడు.

*అడవి*

ప్రణవ నాదం ముందురాగా - 
ఓం కేశవ! 
ఓం నారాయణ! 
ఓం మాధవ! 
ఓం గోవింద! ఓం ముకుందాది 

నామాలు స్త్రీపురుష కంఠాలతో వినిపిస్తూండగా ధ్రువుడి ముందు శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాద్యాయుధాలతో పీతాంబర ధారియై ఉజ్జ్వలంగా వెలుగుతూ ప్రసన్న రూపంతో ప్రత్యక్ష మయ్యాడు.

ధ్రువుడు నెమ్మదిగా కళ్లు తెరచి చూశాడు. చూడలేక వెంటనే రెండు చేతులతో ముఖం మూసుకున్నాడు.

శ్రీహరి మందహాసం చేశాడు.

ధ్రువుడు కళ్లు తెరిచి చూసి ఆనందంతో సంభ్రమోత్సాహాలతో చేతులు జోడించాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియటం లేదు. కంగారు.

విష్ణువు వంక వేలితో చూపిస్తూ తనవంక చూపించుకుంటూ

ధ్రు: నువ్వు - నేను - నువ్వు ... మా తండ్రి ...అమ్మ ... నేను

శ్రీహరి చిరునవ్వుతో ముందుకు వంగి వేదమయమైన దివ్యశంఖాన్ని ధ్రువుని కపాలానికి ఆనించాడు.

ధ్రువునికి ఉత్సాహం ఉత్తేజం ఉప్పొంగాయి. కళ్లల్లో జ్ఞాన తేజం ఉద్దీప్తం అయి

ధ్రు : 

*నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప                   భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర!                చిర శుభాకార! నిత్య లక్ష్మీవిహార! అవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!*

విష్ణువు సుందర దరహాసంతో అభయ హస్తం చూపి ధ్రువుని తలపై వుంచాడు. ధ్రువుడు శిల్పంలా నిలచి కళ్లు విప్పార్చి ఆలోచనాహీనుడై చూస్తున్నాడు.

విష్ణువు: చిరంజీవి ధృవకుమారా! మహా జ్ఞానులూ యోగులూ వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా సాధించలేని శ్రద్ధాభక్తులు నీ వంటి పసి బిడ్డకు ఆరు మాసాలలో సిద్ధించాయి. ఇది *నభూతో న భవిష్యతి*. 

నీ మనసులో కోరిక నాకు తెలుసు నీ కోరిక కన్న ఎత్తైన స్థానం నీకు ప్రసాదిస్తున్నాను.

ధ్రువునికి ఏదో తోచింది. తలెత్తి చూశాడు. కానీ చెప్పలేక పోయాడు. మాయ కమ్మింది.

విష్ణువు:  అంతరిక్షంలో సప్తర్షి మండలం కన్న పైన వుండి సూర్య చంద్రాదులకు నక్షత్రాలకూ ఆధార భూతమై కేంద్ర స్థానమై వెలిగే ధ్రువ మండలంలో నీకు శాశ్వతస్థానం కల్పిస్తున్నాను. 

కాని అది ఇప్పుడే కాదు. 26 వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి పుత్ర పౌత్ర పరంపరగా వృద్ధి చెందాలి. ఆ పైన ధ్రువ మండలాధిపతివై జగత్ప్రసిద్ధుడవై చిరకీర్తితో వర్ధిల్లుతావు.

భగవంతుడు అదృశ్యుడయ్యాడు. ఏదో చెప్పబోతున్న ధ్రువుడికి ఏం చెప్పాలో ఆక్షణంలో తోచింది గాని దేవుడు వెళ్లిపోయాడు. 

అంత గొప్ప వరాలు పొందినందుకు ఆనందించడం బదులు నిరుత్సాహపడి పోయాడు. ముఖం చిన్నబుచ్చు కున్నాడు. నీరసంగా చేతులు జారవిడిచాడు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

No comments:

Post a Comment