"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 3వ భాగము.
ఎలాగైతే, సాలె పురుగు తన గూడును తన నోటినుండే వెలికితీసి తిరిగి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మొలకలు ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీదా, శరీరంపైన అప్రయత్నంగా వెండ్రుకలు ఎలా మొలుస్తాయో, అలాగే "అక్షరపరబ్రహ్మము" నుండి అప్రయత్నంగా ఈ విశ్వము ఉత్పన్నమవుతుంది.
సాలెపురుగు ఉపమానం ద్వారా, ఈ విశ్వమంతా బ్రహ్మము నుండి ఎంతో సహజంగా వెలుబడి తిరిగి బ్రహ్మము లోనే లయమౌతుందని గ్రహించవచ్చు. మొలకల ఉపమానము ద్వారా నేలపట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా మొక్కలు జనిస్తున్నట్లే, బ్రహ్మము పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా ఈ జగత్తు ఉద్భవిస్తుందని గ్రహించవచ్చు. ఇక వెంట్రుకుల ఉపమానం ద్వారా చైతన్యవంతుడైన జీవుని శరీరమునుండి చైతన్యంలేని వెంట్రుకలు మొలుస్తున్నట్లు అసమాన చైతన్యస్వరూపుడైన బ్రహ్మము నుండి జడమైన ఈ విశ్వం వ్యక్తమౌతుందని గ్రహించవచ్చు.
అంటే ఈ విశ్వం యొక్క ఆదికి, అంతానికి బ్రహ్మమే ఆధారమని, జగత్తుకు బ్రహ్మమే ఆశ్రయమని, బ్రహ్మము యొక్క నిజస్వరూపం చైతన్యమని, ఆ చైతన్యంనుండే అప్రయత్నంగా, ఎంతో సహజంగా ఈ విశ్వం వ్యక్తమౌతుందని బోధపడుతుంది.
పైన పేర్కొన్న ఉదాహరణల ద్వారా, ఈ విశ్వము, బ్రహ్మము యొక్క వాస్తవ పరిణామం కాదు, ఇదంతా బ్రహ్మము యొక్క చైతన్యంతో ఏర్పడ్డ శక్తికల్పన లేక మాయారూపం మాత్రమే అని అవగతమౌతుంది.
తపస్సువల్ల బ్రహ్మము వృద్ధి చెందుతుంది. ఆ బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ అన్నంనుండి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు ఆవిర్భవిస్తాయి.
సృష్టికర్త సర్వవిదుడు అయిన బ్రహ్మము, జ్ఞానమనే తపస్సు ద్వారా వీటన్నింటి సృష్టి జరిగింది. అంటే సచ్చిదానందస్వరూపమైన పరమాత్మనుండియే ఈ విశ్వము ఆవిర్భవిస్తుందని చెప్పబడింది.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🙏🏻
No comments:
Post a Comment