Tuesday, July 23, 2024

****శ్రీ రమణీయం - 33🌹 👌మారేది దృశ్యాలే కానీ అద్దం కాదు👌

 [7/23, 04:38] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 33🌹
👌మారేది దృశ్యాలే కానీ అద్దం కాదు👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

🌈 33. మారేది దృశ్యాలే కానీ అద్దం కాదు 🌹

✳️ మన మనసు అద్దం లాంటిది. దానిముందు ఏ వస్తువును ఉంచితే దానినే అది ప్రతిబింబిస్తుంది. ఇక్కడ దృశ్యం మారుతుంది కాని అద్దం మారడం లేదు. నిజంగా దృశ్యంతో పాటు అద్దంకూడా మారిపోతే అది ఫోటో అయిపోయి ఉండేది. కాని అలాజరగడంలేదు కదా! మనమనసు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మన కన్ను, ముక్కు, చెవి, నోరు ఏది అందిస్తే మన మనసు దాన్నే ప్రతిబింబిస్తుంది. ఈ జగత్తులో ప్రకృతి అంతా భిన్నంగా ఉంది కనుక మనసు వాటిని భిన్నంగానే చూస్తుంది. అంటే చెట్టుని చెట్టుగా, పువ్వును పువ్వుగా గుర్తిస్తుంది. మార్పు అంతా ప్రకృతిదేగానీ మన మనసుది కాదు. మనం ఈ విషయం గుర్తించలేక మనసే చపలత్వంతో ఉందని అను కుంటున్నాం. 

✳️ మనసుకు కదలటం, మారడం, తిరగడం అనే లక్షణం ఏది లేదు. అదంతా సృష్టిలోనే ఉంది. దాన్ని మనం మనసు ద్వారా తెలుసు కుంటున్నాం. నిజానికి మనం అనుకుంటున్న ఆ చపలత్వమే లేకపోతే, రోజంతా కళ్లముందు ఒక్కటే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తే మనం దాన్ని జీవనంగా పరిగణిస్తామా? అలా కనిపించే వాడిని ఆరోగ్యవంతుడిగా అంగీకరిస్తామా? రోజంతా కళ్లతో అనేక దృశ్యాలు చూస్తున్నాం. చెవులతో అనేక విషయాలు వింటున్నాం. నోటితో అనేక రుచులు ఆస్వాదిస్తున్నాం. కనుకనే కళ్లు, చెవులు మూసుకున్నా మనకు అనేక దృశ్యాలు, శబ్దాలు స్ఫురణకు వస్తున్నాయి.

✳️ మనం గమనించే తేడాలన్నీ ప్రకృతిలో ఏర్పడినవే తప్ప మన మనసు వల్ల ఏర్పడినవి కావు. ఎందుకంటే మన మనసు పరిశుద్ధ ఆత్మకు సమానం. ఆత్మ మన జీవనంకోసం మనసుగా మారి కళ్ళు, ముక్కు. నోరు, చర్మం, ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. మనసు మార్పును తెలుసుకుంటుందే గానీ అది మారటం లేదు. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే తురీయావస్థ. సినిమాలో ఎన్ని బొమ్మలు మారినా తెర మార్పుచెందటం లేదు. అలాగే మనలో ఆ తెరలాంటి మనసుని ఏ దృశ్యం, అనుభవం మార్చటంలేదు. అలా కాక ఒక దృశ్యం, ఒక అనుభవంతో మన మనసు మారిపోతే మరొక దృశ్యానికి, అనుభవానికి ఆస్కారం ఉండదు. తిరుపతి వెళ్ళి కేవలం వేంకటేశ్వరస్వామిని మాత్రమే చూస్తూ కూర్చుంటామా! అక్కడి అందాలను చూస్తాం. ప్రసాదపు రుచులను ఆస్వాదిస్తాం. అందుకే వేంకటేశ్వరస్వామిని ధ్యానించాలని కళ్ళు మూసుకుంటే ఆ సుందర దృశ్యాలు, ప్రసాదం రుచులు కూడా మన మనసులో మెదులుతాయి.

✳️ అద్దం ముందు దృశ్యాన్ని తీయకుండా అద్దాన్ని ఎంత తుడిచినా, కడిగినా ఆ దృశ్యం పోదు. అలాగే మనసుకు బాహ్య దృష్టి తగ్గిస్తేనే అంతరంలో మనం అనుకునే ఆ చపలత్వం పోతుంది. మనసు వాసన చేత బహిర్ముఖం కావాలని అనుకుంటుంది. వాసనంటే మనలో అంతర్లీనంగా దాగివున్న గుర్తు (జ్ఞాపకం). అదే మన మనసును బాహ్య కర్మలకు ప్రేరేపిస్తుంది. అద్దం లాంటి మనసుపై ముద్రలుగా ఏర్పడ్డ వాసనలు మనసు అపవిత్రమైనదన్న భావనను కల్పిస్తున్నాయి. కానీ నిజంగా అది అపవిత్రమైతే గాఢనిద్రలో మనసుకి శాంతి ఎలా లభిస్తుంది. నిత్యజీవితంలో మనకు కలిగే అనేక పవిత్ర భావనలు ఎలా రానిస్తుంది? ప్రకృతిలో మార్పులను మనం నియంత్రించలేం, మార్చలేం. కనుక అవి మనపై ప్రభావం చూపనంత తక్కువగా ప్రకృతిని మనం స్వీకరించాలి.

✳️ విషయాలను సరిచూసుకోవటం జీవితం అయితే సరిచేసుకోవటం ధ్యానం అవుతుంది. మనలో మారని వస్తువు ఏమిటో అర్థం అయితే మనసు చపలం కాదని, నిశ్చలమేనని అర్థం అవుతుంది. ప్రాథమిక దశలో చంచలంగా కనిపించే మనసును బాహ్య విషయాలపైనుండి మరల్చటం ద్వారా నిశ్చలత్వాన్ని పొందుతుంది. మనసు తనపై తాను నిలిచి ఉండాలంటే దాని పరిధి తగ్గిస్తూ రావాలి. పిల్లవాడు పెరటిలో నూతి దగ్గరకు వెళ్ళకుండా ఉండాలంటే ఇంట్లోనే ఏదో ఒక బొమ్మ ఇచ్చి ఉంచాలి. మన మనసుకు కూడా ఏదో ఒక దైవనామం, రూపం అందిస్తే దాని విస్తృతి తగ్గి చపలత్వం పొతుంది. 

✳️ లక్ష్మీదేవికి ‘చంచల’ అని పేరు. అంటే ఆమె స్థలాలు మారుతుందని అర్థం. స్థలం మారుతుందే తప్ప ధనం స్వరూపం మారదు. ఈ ప్రకృతిలో మారేది ఎలాగు మారుతూనే ఉంది. అయితే మారని విషయం అంతర్లీనంగా ఉంది. దాన్ని పట్టుకుంటేనే నిశ్చలస్థితి, శాంతి వస్తుంది. మనం ఈ ప్రకృతిని చూడక తప్పదు. అది మారేది కనుక దాన్ని స్థిరంగా ధ్యానించటం కుదరదు. మారని దాన్ని మాత్రమే ధ్యానించగలుగుతాం. అందుకే మనకు నచ్చిన భగవంతుని రూపాన్ని ధ్యేయవస్తువుగా పెట్టుకోవడం అలవాటైంది. అసలు మనసే మారని వస్తువు అన్న విషయం అనుభవంలోకి వస్తే ఏ ధ్యేయ వస్తువుతో కూడా పని లేకుండానే మనసు దానికదే ధ్యానంగా మారుతుంది. మనసుకు సంకల్పాలు తగ్గితే అవసరాలు తగ్గుతాయి. బయట చూపు తగ్గితే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గేందుకు మనం ఎంచుకున్న ఆధ్యాత్మికతలో కూడా మొక్కులు, ముడుపుల రూపంలో కోర్కెలు పెట్టుకుంటున్నాం. ఆలోచనలను మరింత పెంచుకుంటున్నాం. నిర్వర్తించే ప్రతి పనిలోనూ మరో మనిషి అవసరాన్ని తీర్చాలన్న సంస్కృతి మనది. జపాలు, పూజలు వంటివి చేయించినప్పుడు అది ఇతరులకు పోషణగా మారి, అదే పుణ్యమై మనకి ఫలాన్ని ఇస్తుంది.
[7/23, 04:38] +91 73963 92086: ఇతరుల అవసరాలను మనం తీరిస్తే మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడు.

✳️ కన్పించే దృశ్యాలలోని తేడాను కాకుండా వాటిని చూసే మనసులోనే ఏకత్వాన్ని చూడటం ద్వారా సాధనకు దగ్గర అవుతాం. అసలు మనం భిన్నం అని అనటంలోనే ఏకం ఇమిడి ఉంది. భిన్న ఆకృతులలో ఉన్న నగలలో బంగారం ఒకటి గానే ఉంది. చొక్కాలో ఎన్ని డిజైన్స్ మారినా దాన్ని చొక్కా అనే అంటాం. జీవితానికి భిన్నత్వం ఎలా అవసరమో ధ్యానానికి ఏకత్వం అవసరం. అందుకే జీవితంలో ప్రపంచాన్ని చూడాల్సిందే. ప్రపంచాన్ని చూసే మనసు స్వరూపం తెలుసుకోవాలంటే అంతర్ముఖమై సాధన చేయాల్సిందే. మన శరీరమే మనది కానపుడు మనం నాది అని మురిసిపోయే వస్తువులు మాత్రం మనవి ఎలా అవుతాయి. మనకి వచ్చేవి, పోయేవి ఏవి మనవి కావు. అందరమూ అద్దెదారులమే కాని సొంతదారులం కాము. మన ఇంట్లోనుండి వస్తువు పోయిన విధానానికి దొంగతనం అని పేరే తప్ప నిజానికి ఎవరి వస్తువు ఏ సమయానికి ఎవరి వద్ద ఉండాలో వారికే చేర్చటం దైవలీల. మన వల్ల ఈ సంఘానికి నిజంగా పని ఉంటే, దానిని మనం శ్రద్ధగా నిర్వర్తిస్తే మన అవసరాలు ప్రకృతి తీర్చి జీవితాన్ని ఇస్తుంది. మనసు నిజంగా అచలం అయితే ఈ ప్రపంచం లేనట్లే. మార్పును చూసి, చూసి విసుగెత్తి కళ్లు మూసుకుంటున్నామే గాని ఆ మార్పును ఆపలేం కదా! ధర్మ బద్ధంగా జీవించడంలో ఈ విసుగు ఉండదు. మన మరణం కూడా ధర్మంతోనే ముడిపడి ఉంది. కనుకనే మరణిస్తే అతడ్ని 'కాలధర్మం' చెందాడని అంటారు. బహిర్గతం అయిన అద్దం ప్రతిబింబించక మానదు. అలానే మన మనసు బాహ్యముఖం అయితే ఈ ప్రపంచంతోపాటు మారక తప్పదు. ఒకే విషయాన్ని మనసుకు అందిస్తే అది తాత్కాలికంగానైనా మారకుండా ఉంటుంది. అదే మనసుకి మనం అందించే మంత్రజపం లేదా రూప ధ్యానం. మనసు లక్షణాన్ని మార్చటంలేదు. దానికి అందించే విషయాన్ని మారుస్తున్నాం. మంచి విషయాన్ని మనసుకు అందిస్తే మనం అనుకునే చంచలత్వం తగ్గుతుంది. మనసును మారే జగత్తుపై ఉంచితే అదికూడా మారినట్లు కనిపిస్తుంది. మనసు నిలకడగా లేదు కనుకనే జీవితం అంటున్నాం. మన ప్రయత్నం లేకుండా మనసు కదలడం ఆగిపోతే నిద్ర లేదా కోమా అంటున్నాం. అదే స్థితిని ప్రయత్నంతోను, ఎరుకతోను సాధిస్తే సమాధి అవుతుంది. అజ్ఞానానికి, విజ్ఞానానికి దేహమే కారణమన్న సత్యం అవగాహనలోకి రావటం జ్ఞానం. జీవనం కోసం మారే మనసు నిజ స్వరూపం తెలుసుకోవడమే ఆత్మవిద్య.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment