Monday, July 22, 2024

*****శాంతితోనే ధ్యానం శ్రీ గెంటేల వెంకటరమణ

 [7/21, 17:06] +91 73963 92086: శాంతితోనే ధ్యానం
శ్రీ గెంటేల వెంకటరమణ
*నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః*
✳️ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి అనేక బాధలతో సతమతమౌతున్నాడు. ఆ బాధల నుండి విముక్తికోసం శాంతిని వెతుక్కుంటున్నాడు. ఆ శాంతిని వెతికే ప్రయత్నంలో అనేక ప్రక్రియలు, విధానాలు అవలంబిస్తున్నాడు. ప్రతి ప్రయత్నంలోనూ, విధానంలోనూ బాధకు తాత్కాలిక ఉపశమనం దొరుకుతుందే గానీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. అసలు బాధకు కారణమైన అంశాలేమిటో తెలుసుకొని వాటిని తొలగిస్తే తప్ప పరిపూర్ణ శాంతి సాధ్యం కాదు. మన మనసును విశ్లేషించుకుంటేనే ఏ బాధకైనా ఉన్నమూలం ఒక్కటేనని అర్ధం అవుతుంది. మనిషిలోని అన్ని బాధలను సమూలంగా పెకిలించివేసే మహత్తర మార్గం శ్రీ రమణ భగవాన్ సూచించిన మూలాన్వేషణ !
✳️ మనకి ఏ ఆలోచన లేనప్పుడు ఏ బాధ కలగటంలేదు. బాధకు ప్రాథమిక కారణం మన ఆలోచన. ఏ ఆలోచన లేకపోతే హాయిగా నిద్రాసుఖాన్ని అనుభవిస్తాము. అలాగని అసలు ఆలోచన లేనిదే జీవనమేలేదు. మరి అలాంటప్పుడు ఆలోచనలు ఆపటం ఎలా సాధ్యం. *జీవనంలో ఉంటూ ఆలోచనలు ఆపకుండా బాధలను అధిగమించడం ఎలా?* అందుకు భగవాన్ చూపిన తరుణోపాయం ఆలోచనలకు మూలం ఏమిటో అన్వేషించటం.
✳️ సాధారణంగా తన ముందున్న ప్రపంచాన్ని మనసు గమనిస్తుంది. ఆ గమనింపుతోనే జీవనాన్ని కొనసాగిస్తుంది. అందుకు పరిమితమైన ఆలోచన సరిపోతుంది. కానీ మనసుకు కోరిక కలిగినప్పుడు అది తీర్చుకోవడం కోసం అదనపు ఆలోచనను మొదలు పెడుతుంది. ఎప్పుడో నాటిన మామిడిటెంకె సంవత్సరాల తరబడి పంటను ఇచ్చినట్లే కోరిక అనే ఒక్క విత్తనం మనలో నిరంతరాయంగా వర్తమానంలో అవసరం లేని ఆలోచనలను పుట్టిస్తూనే ఉంటుంది. మూలంలో ఉన్న ఆ విత్తనాన్ని పెకిలిస్తే తప్ప ఈ ఆలోచనల పరంపరను అరికట్టలేము. అందరం బాధలను పోగొట్టుకోవాలను కుంటున్నాము గానీ అందుకు మూలమైన అనవసరపు ఆలోచనలను ఆపటం లేదు. ఏ కొద్దిమందో నిజంగా ఆలోచనలు ఆపుదామని తనకు నచ్చిన రకరకాల ధ్యాస ప్రక్రియలు అవలంబిస్తున్నారు. మిగిలిన సామాన్యులంతా కేవలం తమకు సమస్యల నుండి విముక్తి కోసం శాంతిని ఆశిస్తున్నారు. మరికొందరు తమకు కావాల్సిందేమిటో అందుకు ఏమి చేయాలో తెలియకుండానే ధ్యాన ప్రక్రియలను అనుకరించి ఊహల్లో తేలుతున్నారు. మరి కొందరు తమకు ఆసక్తి లేకుండానే సాధనను ప్రారంభించి వత్తిడికి గురి అవుతున్నారు.
✳️ ధ్యాన ప్రక్రియ అనగానే నిత్య జీవితానికి భిన్నంగా ఒక ప్రదేశంలో కూర్చొని ధ్యాసను ఒక మంత్రం మీదనో, రూపంపైనో, శ్వాసపైనో నిలిపే ప్రయత్నం ప్రస్తుత సమాజంలో పరిపాటిగా మారింది. ఇలా ప్రయత్నం చేసి ఆలోచనలు ఆపటానికి ధ్యానం అనిపేరు పెట్టుకుంటున్నాము. వెలుతురు లేకపోతే ఉన్నదాన్ని చీకటి అన్నట్లుగానే ఆలోచనలు లేకపోతే ఉన్న స్థితిశాంతి. నిజానికి శాంతి ఎప్పుడూ మనలోనే ఉంది. నిజానికి క్రొత్తగా వచ్చి చేరింది ఆలోచనలే. శాంతిని కప్పివేసేవి అనవసరమైన ఆలోచనలు. ఈ అనవసరమైన ఆలోచనలకు కారణం కోరికలు. నిజంగా శాంతి కావాలంటే వీటన్నింటిని తగ్గించుకోవాలి. కానీ కోర్కెలను తీర్చుకునేందుకు వెంపర్లాడుతూనే ఆలోచనలను మాత్రమే ఆపాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఇదంతా ఏదో ఒక విధానంలో మాత్రమే ధ్యానాన్ని సాధించుకోగలం అనుకునే వారి తపన.
✳️ కానీ, ఒక సామాన్యుడికి ధ్యానం అవసరం కన్నా జీవితంలో శాంతి చాలా అవసరంగా ఉంది. అలాంటి శాంతిని సాధించడం కోసమే మహాత్ములు జ్ఞానాన్ని బోధించారు. ధ్యానం యొక్క గమ్యం సత్యదర్శనం. ధ్యానానికి ఉన్న విలువ ధ్యానానికి ఉంది. కొద్దిసేపు ఆలోచనలు ఆపటం వల్ల కలిగే శాంతిని ఆ తర్వాత అన్ని పనుల్లోనూ కొనసాగించేందుకు అది ఉపకరిస్తుంది. అంతేకాని ధ్యానం వల్ల మనలో నింపే కొత్తశక్తి, మన ఆత్మకు కలిగే అదనపు ప్రయోజనం ఏదీ ఉండదు. సాధకుడు కాని సామాన్యుడు కూడా శాంతిని ధ్యానంలో వెతుక్కుంటున్నాడు. కోర్కెలను అదుపులో ఉంచుకుంటే వచ్చే శాంతిని ధ్యాన ప్రక్రియలో వెతకటం ద్వారా అది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం గానే మిగిలిపోతుంది. ప్రయత్నపూర్వకంగా సాధించే తాత్కాలిక శాంతికి ధ్యానం అనిపేరు పెడుతున్నాడు. అంటే మనలోనే ఉన్న శాంతిని ఒక ప్రత్యేక ప్రయత్నంలో పొందడమే ధ్యానం అంటున్నారు. ఏ ప్రత్యేక ప్రయత్నం లేకుండా సద్గుణాలతో మనలో ఉన్న సహజశాంతిని అనుభవించడాన్ని మహాత్ములు జ్ఞానం అన్నారు.
✳️ ఏ సాధన ద్వారా లభించిన శాంతినైనా జీవితమంతా కొనసాగితేనే అది పరిపూర్ణ ధ్యానం అవుతుంది. సాధనతో మొదలైన శాంతి స్పర్శ సాధనా ప్రక్రియతో పని లేకుండానే మన సొంతం అయ్యేంతగా సహజంగా మారాలి. ఈ సృష్టిలో ఉన్న ఏదైనా ఒక వస్తువుపై ఇష్టం ఏర్పడి అది తనకు లేదని తెలియగానే మనిషిలో వెలితి ఏర్పడుతుంది. ఆ వెలితి కోరిక రూపంలో మనసుని బాధిస్తుంది. ఇలా భౌతిక విషయాలతో పాటు మనిషి తన శాంతి కోసం సృష్టించుకున్న ధ్యానప్రక్రియలు కూడా మనిషికి ఒక కోరికగా మారి వేధిస్తున్నాయి. భగవంతుడ్ని తెలుసుకోవాలని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనే తీవ్ర తపనతో ఉన్న ఒకవ్యక్తి సహజంగానే ప్రపంచాన్ని, తన దేహాన్ని మరిచి పోయేంతగా ధ్యానసాధన చేస్తాడు.
[7/21, 17:06] +91 73963 92086: అతనికి ఫలంగా లభించే శాంతి ఈ ప్రపంచాన్ని మరిచిపోవడం ద్వారా అంటే భౌతిక విషయాలపై ఆశను విడనాడటం ద్వారా వచ్చింది. అంతేగానీ అతను శాంతికోసం సాధన చేయడం లేదు. కానీ చాలా మంది శాంతి కోసం కూడా ధ్యానప్రక్రియను ఆశ్రయిస్తున్నారు. వారు ఈ ప్రపంచం విషయంలో తమ కోరికలను విడిచిపెట్టకుండానే కేవలం శాంతిని పొందాలని ధ్యానంలో తపన పడుతున్నారు. వీరి దృష్టిలో ధ్యానం అంటే కోరికలను ఆపకుండా కేవలం తన ఆలోచనలను తాత్కాలికంగా ఆపే ప్రయత్నం. కానీ కోరికలను జయించడం ద్వారానే నిజమైన శాశ్వతమైన ధ్యానం కుదురుతుంది.
✳️ నిత్యజీవితంలో ఏ పనిలోనూ మనం ఇతర ఆలోచనలు ఆపాలని అనుకోవడం లేదు. చివరికి దేవుని పూజ చేస్తూ కూడా ఆలోచనలు మనం కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ మంత్రజపం, నామస్మరణం, శ్వాస పై ధ్యాస చేయాల్సి రాగానే అందుకు అవరోధంగా ఉన్న ఆలోచనలు మనకి అడ్డం అనిపిస్తున్నాయి. సామాన్యుడు ఆలోచనలు ఆపి తాత్కాలిక హాయిని పొందుతున్నాడు. సామాన్యుడికి ఎదురయ్యే బాధలు రెండు రకాలుగా ఉన్నాయి. తాను అనుకున్నది జరుగకపోవడం ఒకటైతే, తాను అనుకోనిది అడ్డురావడం మరొకటి. అంటే తాను కోరుకున్న అనుభవం కాకపోవడం, లేదా తనకు ఇష్టంలేని అనుభవం అనూహ్యంగా రావడం.... ఈ రెండు మనని బాధిస్తున్నాయి. నిత్య జీవితంలో ప్రతి పనిలోనూ అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉన్నట్లే ధ్యానం కూడా ఒక పని అనుకుంటే అందులోను ఇదే రకమైన ఫలితాలు తప్పటం లేదు.
✳️ నిజానికి ధ్యానం అన్నది ఒక పని కాదని, మనలోని శాంతి స్థితిని అనుభవించడానికి పెట్టిన పేరు అని తెలుసుకోవాలి. రోగమే క్రొత్తగా వచ్చింది కానీ ఆరోగ్యం పాతదే. క్రొత్తగా వచ్చిన అనారోగ్యాన్ని తీసేస్తే మనకి మునుపటి ఆరోగ్యం ఎలాగైతే వస్తుందో, క్రొత్తగా వచ్చిన అశాంతిని తీసేస్తే మనకు సహజసిద్ధంగా ఉన్న శాంతి తెలుస్తుంది. చిలుము పట్టిన పాత్రను తోమితే దాని సహజమైన మెరుపు కనపడుతుంది. అలానే కోర్కెలను తొలగించుకుంటే మన సహజశాంతి వ్యక్తం అవుతుంది. అంతే గానీ తాత్కాలిక శాంతి కోసం చేసే ప్రక్రియలు పాత్రకు పూతరంగులు పూసినట్లే సహజమైన గుణాన్ని తెలుపలేవు.
🪷 *కోరికలు ఎలా ఆపుకోగలం!!* 🌈
✳️ కోరిక, దాని పుట్టుక, పరిణామాలను విశ్లేషించుకుంటే అది బలహీన పడిపోతుంది. ఎంత ఎత్తుపై నుండి పడితే అంత బాగా దెబ్బతగినట్లుగానే ఒక విషయంపై ఎంత ఆశ పెట్టుకుంటే దాని ఫలితం అంతగా మనని బాధకు గురిచేస్తుంది. ఒక విషయంలో ఏర్పడిన ప్రతికూల ఫలితం కన్నా, అనుకూల ఫలితంపై మనం పెట్టుకున్న ఆశలే ఎక్కువగా బాధపెడతాయి. ఒక స్త్రీ తన బిడ్డను పురిటిలోనే పొగొట్టుకుంటే పొందే బాధకన్నా, పుట్టే బిడ్డ కోసం ముందే చేయించుకున్న నగలు బట్టలు ఆ బాధను మరిన్ని రెట్లు పెంచుతున్నాయి. ధ్యానం అనే పేరు మనిషి సృష్టించుకున్నదే అయినా అది మనిషిలో నిరంతరం ఉన్న స్థితే. కొత్తగా తెచ్చుకునేది కాదు. మనిషి ఆశను తగ్గించుకంటే అది వ్యక్తమౌతుంది. మనిషి పనిచేయడానికి అలవాటుపడ్డాడు. ఒక గంటసేపు ఆ పనిని ఆపి విశ్రాంతి అంటున్నాడు. విశ్రాంతి అన్నది కొత్తగా వచ్చింది కాదు. ఆ పనికన్నా ముందు తానున్న స్థితే. ఇది అర్థం అయితే మనం ధ్యానం కోసం ప్రయత్నం చేయాలో, లేక ఉన్న శాంతిని దూరం చేస్తున్న కోరికలను ఆపుకోవడం కోసం ప్రయత్నం చేయాలో తెలుస్తుంది.
✳️ మనలో కోరికలు రకరకాలుగా ఉన్నాయి. ఫలానాది కావాలనుకోవటమే ఒక కోరిక అయితే, అది ఫలానా పద్ధతిలోనే ఉండాలనుకోవడం మరో కోరిక. మనసులో కోరిక మొదలైతే దాని యొక్క పర్యవసానాన్ని మనం నియంత్రించలేము. అందుకే కోరిక కలిగే ముందే దాని ఫలితం ఎడల అవగాహన కలిగి ఉండాలి. అంటే మంచీ చెడులు, సాధ్యాసాధ్యాలు ఉచితానుచితాలు ఆలోచించుకోవాలి. మనం తయారు చేయని విత్తనం నుండి వచ్చే పంటను మనము అనుకున్నట్లుగా కావాలనుకుంటున్నాము. వేప విత్తనం వేసి మామిడి పండును ఆశిస్తున్నాము. విత్తనం ఏర్పాటులోనే దాని పంట కూడా నిర్ణయించబడివున్నది.
✳️ కోరికలు ఆలోచనల విషయంలో నియంత్రణతో పాటు దాని యెడల ఎరుక కలిగి వుండాలి. కాని కోరికలు ఆలోచనల విషయంలో మన ప్రమేయం కూడా లేనంతా నియంత్రణ కొరవడు తున్నది. నియంత్రించడం ద్వారా వచ్చే శాంతిని, ధ్యానాన్ని మాత్రం మనం కావాలనుకున్నట్లు కోరుకుంటున్నాము. మనం అశాంతిలో లభిస్తున్న స్వల్ప విరామాన్ని ధ్యానం అనుకుంటున్నాము. అది భ్రమ. ఆ భ్రమ నుండి అసలు అశాంతికి తావులేని జ్ఞానాన్ని సాధించే స్థితికి ఎదగాలి. అందుకు మన జీవన అవసరాలను గుర్తెరిగి వాటిని పెనవేసుకొని మనని బాధిస్తున్న కోరికలను మనం నియంత్రించుకోవాలి.

No comments:

Post a Comment