శ్రీమద్రామాయణము.
(235 వ ఎపిసోడ్),
""పోగాలము దాపురించిన వారు,
దీపనిర్వాణ గంధమును,
అరుంధతిని,
మిత్రవాక్యమును,
మూర్కొనరు,కనరు,వినరు"""
పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో పై విషయాన్ని ఇలా వివరించారు.
వెలుగుతున్న దీపము కొండెక్కితే అనగా తన వెలుగును కోల్పోయినప్పుడు ఒక విధమైన వాసన వస్తుంది,
సప్త ఋషిమండలములో చివర అనగా తోక స్థానములో యున్న జంటనక్షత్రాలలో ఒకటి అరుంధతి,
అలాగే నిజమైన మిత్రుడు తన స్నేహితుని హితము కోరి మంచి వాక్యాలు చెప్పుతాడు,
చావు దగ్గరపడ్డ వానికి పైన చెప్పబడ్డవి అనగా దీపనిర్వాణ గంధముపు వాసన గ్రహించ లేరు,అరుంధతి నక్షత్రాన్ని చూడలేరు,అలాగే మిత్రుని మాటలను వినరు.
ముక్కుపుటాలకి స్పష్టముగ వాసనవచ్చె ఆ గంధపువాసన తెలుసుకొనలేక పోతే వాడి చావు దగ్గరపడ్డట్టే. (ముక్కుకి వాసన తెలియటము లేదంటే "కరోనా" సోకియుండవచ్చు)
అలాగే ఆదర్శదాంపత్యానికి ఉదాహరణగ నిల్చిన వశిష్ట అరుంధతుల దర్శనము క్రొత్త దంపతులకి శుభసూచకముగ చూపిస్తారు ఆ నక్షత్రము కనపడకపోతే వారి దాంపత్యము సరిగ సాగదు.
ఇక చావు దగ్గరపడ్డవాడు మిత్రుడు చెప్పే ఆప్త వాక్యము వినిపించుకోడు.
రామాయణములో మూడవదియైన మిత్రవాక్యము వినక రావణాసురుడు ప్రాణాలు కోల్పోయాడు. మారీచుడు సీతాపహరణము కోసము తన ఆలోచన వివరిస్తున్న రావణాసురినితో
""సులభాః పురుషా రాజన్! సతతం ప్రియవాదినః,
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః||,(అరణ్య.కాం.37-02),
ఓ రాజా! యజమానికి ఆపద వచ్చినప్పుడు దాని గురించి యోచించక అతని ప్రాపకము కోసము అతనితో అనవసరపు ఇచ్చకాలు చెప్పేవాళ్లే లోకములో ఎక్కువగ ఉంటారు.యజమానికి అప్రియము కలిగినా అతనికి మేలు చేసే హితవు చెప్పే వాళ్లు ఉండరు.ఒకవేళ ఒకరిద్దరు యున్నా ఆ మాటలు వినేవాళ్లు అసలు యుండరని మారీచుడు రావణునికి చెప్పి రాముని బలపరాక్రమముల గరించి చెపుతు రాముడు ఇంద్రునితో సమానుడని వెళ్లడిస్తాడు.
ఆప్త వాక్యము చెప్పిన మారీచునితో రావణుడు కోపగించి,
"" గుణదోషా న పృచ్ఛామి క్షమంచాత్మని రాక్షస,
మయోక్తం తవ చైతావత్ సంప్రత్యమితవిక్రమ||,(40-15).
చావు దగ్గరపడ్డ రావణుడు(పోగాలము దాపురించినవాడు) మారీచునితో
ఓ రాక్షసాధమా! రాజునే అగౌరవపరుస్తు అజ్ఞానముతో నాతో తర్కిస్తున్నావు.నేను తలపెట్టిన సీతాపహరణ మంచిదా చెడ్డదా యని నిన్నడగుటలేదు. నా పనికి నీ సహాయము మాత్రమే అడుగుతున్నానని గదమాయిస్తాడు.
అప్పటికి మారీచుడు ఓపికతో మరొకసారి రావణునికి హితవు చెపుతాడు.
"" విపర్యయే తు తత్సర్వం వ్యర్థం భవతి రావణ!,
వ్యసనం స్వామివైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః,""(41-09),,
ఓ రావణా! నీ హితవు కోరి తెలియచేస్తున్నాను.రాజు గుణహీనుడైనచో సచివులే కాక లంకానగర వాసులందరు కష్టముల పాలగుదురని హెచ్చరిస్తాడు.
అంతకు మునుపే రావణుడు మారీచునితో
"" న చేత్ కరోషి మారీచ ! హన్మి త్వామహమద్య వై,
ఏతత్కార్యమవశ్యం మే బలాదపి కరిష్యసి,
రాజ్ఞో హి ప్రతికూలస్థో న జాతు సుఖమేధతే||,(40-26),
నేను చెప్పినట్లు నీవు చేయకపోతే నినిక్కడే హతమారుస్తాను.నీకయిష్టమైనా సరే సీతాపహరణలో నీవు నాకు సహకరించాల్సినదే. లేనిచో రాజునకు ఎదురు తిరిగినవాడు ఎన్నటికి సుఖపడడని బెదిరిస్తాడు.అయినప్పటికి మిత్రధర్మము పాటించి రావణునికి ఆప్తవాక్యము వినిపిస్తాడు.
కానీ చిన్నయ్య సూరి వచించినట్లు "" పోగాలము దాపురించినవారు మిత్రుల మాట వినరు.
అందదుకే రామాయణములో రావణాసురుడు ఆప్తవాక్యాలు పెడచెవిన పెట్టి మృత్యువాత పడ్డాడు.మిత్రులు చెప్పే మంచిమాటలు వింటే మృత్యవుకి దూరమవుతారని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment