Thursday, July 4, 2024

****అంతర్యామి 🔱 # కుండలినీ యోగవిద్య #

 🔱 అంతర్యామి 🔱

# కుండలినీ యోగవిద్య #

🍁యోగవిద్యకు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయమైన మార్గదర్శకాలు. యమ, నియమ, ఆసన,ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది ప్రక్రియలను అష్టాంగ యోగమని మహర్షి పతంజలి నిర్వచించాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఒక్కొక్క శరీర అవయవం ఒక్కొక్కసారి పుట్టుకు వచ్చినప్పటికీ, అవి కలిసికట్టుగా అభివృద్ధిచెందుతాయి. అలాగే మనిషిలో అంతర్నిహితంగా ఉన్న దివ్యత్వం మెల్లమెల్లగా వికసించి పరిమళం గుబాళిస్తుంది.

🍁హఠయోగం, రాజయోగం, కుండలినీ యోగం పతంజలి యోగ సూత్రాలపైన ఆధారపడ్డ యోగ ప్రక్రియలు. హఠయోగం శరీరాన్ని, రాజయోగం మానసిక సమతుల్యాన్ని, నాడీమండలాన్ని నియంత్రించడం ద్వారా, సాధకుడికి అందజేస్తాయి. నాడి శుద్ధికి ప్రాణాయామం సాధన చేయడం చాలా అవసరం. అనాహతంలో- హృదయ స్థానంలో ఉన్న చక్రంలో ఒక ధ్వని బయలుదేరినప్పుడు నాడీమండలం శుద్ధమైందని చెబుతారు. అలా నాదానుసంధానం చేస్తూ మునుముందుకు సాగడమే కుండలినీయోగం. 

🍁పశుత్వానికి, రుషిత్వానికి నడుమ వారధిలాంటిది మనిపి జీవితం, అన్ని శక్తులు, అన్ని యుక్తులు, అతడి లోపలే ఉన్నాయి. దేవదానవుల క్షీరసాగర మథనానికి మనిషిలో నిత్యం జరుగుతున్న మేధామథనమే ఒక చక్కని నిదర్శనం. ఇంద్రియాలను విచ్చలవిడిగా తిరగనిస్తే, మనసు మరింత తామసానికి గురవుతుంది.

🍁హఠయోగులు తమ లోపల నిద్రాణమై ఉన్న కుండలినీశక్తిని కుంభకాది ప్రక్రియల ద్వారా • మేల్కొలిపి, సహస్రారంతో యోగింపజేస్తారు. ఈ యోగ విద్యను కుండలిని అని చెబుతారు. ఈ కఠినమైన ప్రక్రియను గురుముఖంగా నేర్చుకోవడం చాలా అవసరం. ఆరు చక్రాల విద్య నేర్చుకునే సమయంలో, లభించే సిద్ధులు చక్రబంధాలై మనిషి బుద్ధిని పెడదోవ పట్టిస్తాయి. అలాంటి విపత్తు నుంచి కాపాడటానికి, రహదారిపైన నల్లేరు నడకలా ముందుకు సాగడానికి శిక్షకుడు, పర్యవేక్షకు అయిన గురువు తోడు ఉండటం ఎంత అవసరమో వేరుగా చెప్పనవసరం లేదు. 

🍁యోగం అంటే ఆత్మ పరమాత్మల సంయోగం, యోగం ఎనిమిది రకాలు. అవి- రాజయోగం, కర్మయోగం, బుద్ధియోగం, జ్ఞానయోగం, భక్తియోగం, లయయోగం, మంత్రయోగం, హఠయోగం, చక్రాలను గురించి, కుండలినీ శక్తిని గురించి, హఠయోగ ప్రదీపికలో వివరాలున్నాయి.

🍁 వేదాలలో, పురాణాలలో యోగ ప్రస్తావన కనిపిస్తుంది. కుండలినీ యోగం పాశ్చాత్యులను కూడా ఆకర్షిస్తోంది. ఆత్మవికాసానికి, ఆధ్యాత్మ జ్ఞానప్రకాశానికి కుండలినీ యోగమే ప్రధానం అంటారు శ్రీరామకృష్ణ పరమహంస.

🍁మూలాధార చక్రంలో ఈ శక్తి పాములా
చుట్టచుట్టుకుని పడుకుని ఉన్నంత కాలం- మనిషి ఆహారం, నిద్ర, మైథునం భయం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటాడు. బుద్ధి వికాసానికి ఆ శక్తిని నిద్ర లేపాలి. కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వైపు మళ్లించాలి. ప్రాణశక్తిని ఇచ్ఛాశక్తి, మనోశక్తి, క్రియాశక్తిగా మార్చి అమృత స్థితిని అందుకోవాలి. పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ ప్రక్రియ ద్వారా ఈ యోగ విద్యను పరిపుష్టం, పరిపూర్ణం చేయడానికి కొన్ని ముద్రలు, బంధాలు జతపరచాలి. అప్పుడు పాములా పడుకున్న కుండలినీ శక్తి లింగ స్థానానికి, నాభి స్థానానికి, హృదయ స్థానానికి, కంఠ స్థానానికి, భ్రూమధ్యానికి పాకి- ఇడ, పింగళ, నాడులను వదిలి సుషుమ్నా నాడి ద్వారా ఆ ప్రాణశక్తితో బ్రహ్మరంద్రాన్ని చేరుతుంది. ఆ వేయి రేకుల పద్మపుష్పాన్ని సహస్రారం అంటారు. 'ఓం నమశ్శివాయ' ఆరు చక్రాలకూ అనువైన మంత్రం. ఇంకా లోతుకు వెళ్ళదలచినవారు యోగ్యుడైన
గురువును ఆశ్రయించాలి, అభ్యాసం చేయాలి.🙏

-✍️ఉప్పు రాఘవేంద్ర

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment