ప్ర : ఈ మధ్య ఒక స్వామీజీవారు ప్రవచనం చేస్తూ- మార్కండేయుడు ప్రళయవేళ జలంలో కొట్టుకుపోతుంటే, ఎవరూ ఆదుకోలేదనీ,తనకు ఆయు విచ్చిన శివుడ్ని ప్రార్థిస్తే,అతడు వచ్చి చేయందించినా లాభంలేక పోయిందనీ, చివరకు శివుడు సైతం ఆ జలంలో కొట్టుకుపోయాడనీ చెప్పారు.ఇది ఎంతవరకు యధార్థం?
జ: ఇటువంటి కథ ఎక్కడాలేదు. ఇంకా శైవవైష్ణవ భేదాలనే సంకుచిత ధోరణులు
మనలో కొందరిని విడవడం లేదు. అందువల్లనే ఇలాంటి కట్టుకథలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ప్రళయకారకుడు శివుడు. మహాప్రళయంలోనూ నశించని తత్త్వం
శివునిది. ప్రపంచమంతా ప్రళయబాధితమైనప్పుడు సాక్షిగా ఉండి, ప్రళయ తాండవం
చేసేది రుద్రుడే.
"... నశ్యత్ ప్రపంచలయం,
పశ్యన్ నిర్భయ ఏక ఏవ
విహరత్యానంద సాంద్రోభవాన్" - అని ఆదిశంకరులు, 'శివానందలహరి'లో ప్రవచించారు. ప్రళయవేళలో కూడా ఏకాకిగా (శక్తి సహితుడై) ఆనందసాంద్రునిగా విహరించే 'నిర్భయ' స్వరూపుడు శివుడు. జగదంబ నామాలలో "మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ" అనే నామం ఉంది.
'మహేశ్వరుడు ప్రళయవేళ చేసే తాండవాన్ని దర్శించే మహేశ్వరీశక్తి' జగదంబేనని సుస్పష్టం.
మృత్యుంజయుడైన శివుడు ఎందులోనూ కొట్టుకుపోడు.
No comments:
Post a Comment