Friday, July 5, 2024

నారద సంతానం*

 *నారద సంతానం*
👩🏽‍🦲🧑‍🦲👨🏼‍🦲

రచన : మురళీమోహన్

ఒకసారి నారదుడు వైకుంఖానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ప్రక్కన కూర్చున్న లక్ష్మీదేవి నారదుడిని చూసి ప్రక్కకు తొలగి వెళ్ళిపోబోయింది. అది చూసిన నారదుడు నవ్వుతూ..
"నారాయణ, నారాయణ” అంటూ "నన్ను చూసి తొలగవలసిన అవసరం ఏముంది తల్లీ, నేను వృద్ధ తపస్విని. సంసార బంధాలకు చిక్కనివాడిని” అని విష్ణు మూర్తి వైపు చూసి, "నారాయణా! నీ లీలా విలాసాలేమిటో నాకర్ధం కావడం లేదు. నీ మాయలేమిటో నాకు తెలుపవ య్యా అన్నాడు.

దానికి విష్ణుమూర్తి నవ్వుతూ, “ఆ అవకాశం త్వరలోనే వస్తుందిలే” అని నవ్వి వూరుకున్నాడు.

కొంతసేపు సంభాషించిన తరువాత, విష్ణుమూర్తి దగ్గర శలవు తీసుకొని నారదుడు భూలోక సంచారానికి బయలుదేరాడు.

ఒకనాడు నారదుడు భూలోక సంచారం చేస్తూ కలువపూవులతో వికసించి మనోహరంగా వున్న కొలను నొక దానిని చూశాడు. దానిలోకి దిగి స్నానం చేయాలనిపించి, తన మహతీ వీణను ఒడ్డున ఉంచి, “నారాయణ నారాయణ” అనుకుంటూ కొలనులోకి దిగి మూడు మునుగులు మునిగి పైకి లేచాడు. ఆశ్చర్యంగా అతడు ఆ వెంటనే స్త్రీగా మారిపోయాడు. అతడికి పూర్వజ్ఞానం కూడా పోయింది. అతడు ఒడ్డుకు చేరే సరికి, ఆటుగా వెడుతున్న ఒక రాజ కుమారుడు స్త్రీ రూపంలో వున్న నారదు డిని మోహించాడు.

వారు గాంధర్వవిధిని వివాహం చేసుకుని కొంత కాలం సంసారం చేశారు. వారికి అరవైమంది పుత్రులు కలిగారు. వారికి ప్రభవ, విభవ మొదలైన పేర్లు పెట్టారు. కొంత కాలానికి ఆ రాజు వారిని విడిచి ఎటో వెళ్ళిపోయాడు.

ఆ స్త్రీ తన పుత్రులను సాకడానికి ఎన్నో పాట్లు పవడవలసి వచ్చింది. వారు ఘోరమైన ఆకలితో అలమటించేవారు.
ఆ స్త్రీ వారి అందరికీ ఆహారాన్ని తెచ్చి ఈవ్వలేకపోయింది. ఆకలి బాధతో ఒక్కొక్కరే మరణించసాగారు. ఇంతలో ఆమెకు సమీపంలో ఒక మామిడి చెట్టు కన్పించింది. దానికొక మామిడిపండు వుంది. ఆతృతతో వెళ్ళి దానిని అందుకో బోయింది ఆమె. కాని అది అందలేదు. తన పుత్రుడి శవాన్ని ఒక దానిని నేల మీద వేసి దాని మీదకు ఎక్కి అందుకో బోయింది. కాని ఆ మామిడి పండు మరింతగా పైకిపోయింది. ఆమె పుత్రుల శవాలను ఒక్కొక్కటి పేర్చుతూ పైకి చేరుతూ ఆ పండును అందుకొనేందుకు ప్రయత్నించింది. ఆమె అరవై పుత్రులు మరణించారు. అయినా ఆ పండు ఆమెకి అందలేదు. అది అంతకంతకు అలా పైకి పోయింది. తన పుత్రులు అందరూ మరణించడంతో ఆమె పెద్ద పెట్టున ఏడ్చింది. ఇంతలో ఆమె ముందు శ్రీ మహా విష్ణుపు ప్రత్యక్షమయ్యాడు.

దానితో ఆమెకు పూర్వజ్ఞానం కలిగింది. ఆమె తనకు తన యథారూపం ఇమ్మని విష్ణువును వేడుకొంది.

దగ్గరలో వున్న కొలనును చూపి అందులో స్నానం చేయమని శ్రీ మహా విష్ణువు ఆమెకు సలహా ఇచ్చాడు. నారదుడు ఆ కొలనులో మునిగి పైకి లేచేసరికి పూర్వ రూపం పొందాడు.

“చూశావా నారదా, సంసార బంధంలో పడనని ఆనాడు పలికావు కదా! ఇప్పుడు కొడుకులు మరణించారని ఇంతగా విలపిస్తావెందుకు? సతులు, సుతులు మాయ, సంసారం మాయ, అదే విష్ణుమాయ. ఈ మాయని తెలుసుకుని బయటపడడం నాకు కూడా సాధ్యం కాలేదు. అందుకే అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఇప్పటికయినా బోధపడిందా?” అన్నాడు. నారదుడు విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

ఆ కొలను సమీపాననే  శ్రీ మహావిష్ణువు భావన్నారాయణ స్వామిగా వెలిశాడు.
నారదుడు దేవతలు అందరిని ఆహ్వా నించి అక్కడే శ్రీ మహా విష్ణువుకు ఆలయ నిర్మాణం చేయించి స్వయంగా ఆ విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. 

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణం దగ్గిర గల సర్పవరం గ్రామంలో ఈ దేవాలయం వుంది.

నారదుడు స్త్రీగా మారిన కొలను నారద గుండమని, నారదుడు పూర్వ రూపం పొందడానికి మునిగిన కొలను మోక్ష గుండమని పేరు. సర్పవరం లోని భావ నారాయణస్వామి దేవాలయానికి దగ్గర లోనే ఈ రెండు గుండాలు వున్నాయి.

నారదుడు స్త్రీగా వున్నప్పుడు పుట్టిన అరవైమంది పుత్రులూ సంవత్సరాల
పేర్లుగా చిరస్మరణీయులు అయ్యారు. వారి పేర్లు ప్రతి ఉగాదికీ ప్రారంభం ఆయే సంవత్సరంతో మొదలై ప్రతి యెడూ మారుతూ ఉంటాయి.
👨🏼‍🦲🧑‍🦲👩🏽‍🦲
*సమాప్తం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

No comments:

Post a Comment