నా స్వస్థానం - గాఢనిద్ర
_______
నాకు సత్యం తెలియబడితే,
నా కుటుంబానికి ఏమైనా మేలు ఉంటుందా?
అని అడిగారు శ్రావణిగారు.
* * *
నా కల నుండి నేను మేలుకుంటే,
నా కలలో ఉన్నవారికి ఏదైనా మేలు ఉంటుందా? అని ప్రశ్నించడం లాంటిదే.
'మేలు' పొందటానికి అసలక్కడ ఎవరూ ఉండరు.
సత్యసాక్షాత్కారం అంటే-
"మెలకువ నుండి మెలకువ."
ఈ నిజమైన మెలకువలో 'నేను'కు తప్ప
ఎవరికీ, దేనికీ ఉనికి ఉండదు.
నేను అంటే శ్రావణీ అని కాదు.
శ్రావణీ కూడా కలలో భాగమే.
నిజానికి కల-మెలకువలు రెండూ - అసత్యమే(కలే).
గాఢనిద్ర ఒక్కటే - సత్యం(నిజమైన మెలకువ)
కల,మెలకువలో కలిగే సమస్యలకు
కల, మెలకువలోనే పరిష్కరించుకోవాలి.
సత్యసాక్షాత్కారం అనేది గాఢనిద్ర వంటిది.
అక్కడ "నేను" అన్న పరమానందకరమైన
ఎఱుక తప్ప మరే సమస్యా ఉండదు.
సత్యసాక్షాత్కారంలో(అనగా గాఢనిద్రలో)
ప్రపంచమూ ఉండదు, కుటుంబమూ ఉండదు.
* * *
అజ్ఞాని-
తన స్వస్థానం మెలకువ అని,
అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్లి వస్తుంటానని
అనుకుంటాడు.
జ్ఞాని-
తన స్వస్థానం గాఢనిద్ర అని,
అప్పుడప్పుడు కల,మెలకువలోకి వచ్చిపోతుంటాను అని ఉంటాడు.
* * *
అజ్ఞాని -
ఎఱుక లేకుండా మెలకువలోకి(ప్రపంచంలోకి) జారుతాడు.
తిరిగి ఎఱుక లేకుండా గాఢనిద్రలోకి(స్వరూపంలోకి)వెళతాడు.
జ్ఞాని-
సంపూర్ణ ఎఱుకతోనే మెలకువలోకి(ప్రపంచంలోకి) జారుతాడు.
తిరిగి ఎఱుకతోనే గాఢనిద్రలోకి(స్వరూపంలోకి) వెళతాడు.
అందువల్లనే -
అజ్ఞాని మెలకువను "ఇల" అన్నారు.
జ్ఞాని మెలకువను "కల" అన్నారు.
అజ్ఞాని నిద్రను - మైమరపు అన్నారు.
జ్ఞాని నిద్రను - మెలకువ అన్నారు.
అజ్ఞాని రాకడను - జన్మించడం అన్నారు.
జ్ఞాని రాకడను - అవతరించడం అన్నారు.
అజ్ఞాని పోకడను - నిర్యాణం అన్నారు.
జ్ఞాని పోకడను - నిర్వాణం అన్నారు.
నిద్ర-మెలకువ
రాకడ-పోకడ
ఇద్దరికీ సమమే.
"ఎఱుక" ఒక్కటే తేడా.
* * *
కలలు మెలకువలు కలయని ఎరిగిన
మెలకువ తానే అనిలాచలా!
అన్నారు మన గురువుగారు.
ఇది మెలకువలో ఉండవలసిన ఎరుక.
ఇది సాధన.
"ఎఱుక మరచు చోట ఎఱుగుట బ్రహ్మంబు" అన్నాడు మనవేమన.
ఎఱుక మరచు చోటు - నిద్ర.
నిద్రలో నేనున్నాను అన్న ఏఱుక తోడైతే అదే బ్రహ్మము.
ఇది నిద్రలో ఉండవలసిన ఎరుక.
ఇది సిద్ధి.
* * *
ఎరుక లేని నిద్ర - మామూలు నిద్ర - జడం.
ఎరుకతో కూడిన నిద్ర - గాఢనిద్ర - చైతన్యం.
ఈ ఎరుకతో కూడిన నిద్రకే తురీయం అని శాస్త్రీయనామం.
* * *
జ్ఞానికి ఈ కల, మెలకువలు విహారస్ధానాలు.
విహారం పూర్తయ్యాక,
తన తనువుతో సహా అన్నిటినీ విడిచిపెట్టి
తన స్వస్థానమైన గాఢనిద్రలోకి(స్వరూపంలోకి) వెళ్లిపోతాడు.
అక్కడ "రెండు" లేని "ఒకటి"గా ఉంటాడు.
ప్రశ్న లేని "సమాధానం"గా ఉంటాడు.
లో-వెలి లేని "బట్టబయలు"గా ఉంటాడు.
* * *
జ్ఞానికి-
"కల-మెలకువ-నిద్ర" అనేది - విహారం.
గాఢనిద్ర అనేది - స్వరూపం.
రండి...అందరం గాఢనిద్రలో "ఏకం" అవుదాం.
No comments:
Post a Comment