Thursday, July 4, 2024

 మానవ భాష యొక్క నిరంతర ప్రాతినిధ్యాన్ని సృష్టించే చర్య 'రాయడం' దీన్నే వ్రాత వ్యవస్థ అంటారు.మాట్లాడే భాష యొక్క సామర్థ్యాలను వెలికి తీయడానికి మరియు విస్తరించడానికి వ్రాత వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. రాయడం చేసే వ్యక్తిని రచయిత అంటారు. రాయడంలో రచయిత చూపే ప్రతిభను రచనా నైపుణ్యం అంటారు. రచనల్లో ( సాహిత్యం) అనేకానేక ప్రక్రియలున్నాయి. ప్రబంధం, కావ్యం, ఇతిహాసం, కవిత్వం, నాటకం, పద్యం, గేయం, వ్యాసం, ఆత్మకథ, ఇలా ఎన్నో రకాలు.... ఎవరికి ఏ ప్రక్రియ పై ఆసక్తి, అనురక్తి, అభిరుచి ఉంటే అది రాసే ప్రయత్నం చేస్తారు. రాసే ప్రక్రియ పై రచయితకు పూర్తి అవగాహన మరియు అభినివేశం ఉండాలి. అధ్యయనం చేయాలి. వాటి నిమిత్తం అనేక గ్రంథాలు పరిశీలించాలి, పఠించాలి.కొత్త సమాచారం సేకరించాలి. విజ్ఞులను సంప్రదించాలి. గ్రంథం సమగ్రంగా ఆవిషృతమైనప్పుడే పాఠకుల్లో అభిలాష, కుతూహలం పెరుగుతుంది. సంపూర్ణత సంతరించుకున్న రచనలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. స్రష్టలు, నిష్ణాతులు అకుంఠిత దీక్షతో, కష్టపడి విషయ పరిజ్ఞానాన్ని సేకరించి గ్రంథస్థం చేయడంలో తీసుకున్న శ్రద్ధ, అనన్య సామాన్యం. అందుకే మనం వాటిని శ్రద్ధాసక్తులతో చదివి, తన్మయత్వం చెంది, నిర్మల హృదయులం కాగలుగుతున్నాం.  జీవిత సత్యాలను తమ కవితా శిల్పంతో తీర్చిదిద్ది, సరళ శైలిలో, మనోరంజకంగా కృతులను,నీతి వచనాలను, సత్కృతులను జాతికి అందించిన ఆ మహానీయులకు మనం సదా రుణపడి ఉంటాం.రుషి అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు. అటువంటి మహత్తర గుణ సంపన్నుడు రాసే రచన ఏదైనా, లోక కళ్యాణానికి మార్గనిర్దేశం చేయగలుగుతుంది.ముద్రణాయంత్రం రాని ప్రాచీన కాలంలో రుషులు ఆశువుగా చెప్పగా - శిష్యులు తాళపత్రాల మీద గ్రంథస్థం చేసేవారు.వాటిలోని ప్రతి అక్షరం శిలాక్షర సమానమే..... వ్యాకరణ శుద్ధమైన భాష, గంభీరమైన అధ్యయనం,శిష్ట వ్యావహారిక శైలి, సంస్కృతీసంప్రదాయాల పరిపోషణ, ధర్మబోధ ఇత్యాదులు రచయిత రచనా శైలికి,రచనా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇటువంటి రచనలు సమాజ శ్రేయస్సు లో ప్రధాన భూమిక పోషిస్తాయి........ పోలిన రామకృష్ణ భగవాన్.... రాజమండ్రి.

No comments:

Post a Comment