Tuesday, July 23, 2024

 మహాభారతం ఎందుకు అర్జున పక్షపాతంతో ఉంది? కర్ణుడు అర్జునుడిలా శక్తివంతుడైనా ఏమీ పొందలేదు జీవితంలో. ఎందుకంత దురదృష్టవంతుడయ్యాడు కర్ణుడు?
వ్యాసుడు ఉన్నది ఉన్నట్టుగా వ్రాసాడు. ఏం పక్షపాతాలో ఏంటో, కాస్త నిదానంగా పరికించి చూస్తే తెలుస్తుంది.

అర్జునుడు అందరికి ఇష్టుడవటమే అతనికున్న ఏకైక అదృష్టము. ఆ మన్నన కూడా అతని సుగుణముల చేత సంపాదించుకున్నాడు.

అర్జునుడు చిన్నతనములోనే తండ్రి పాండురాజును పోగొట్టుకున్నాడు. తండ్రంటే ఎంతభిమానమంటే చిన్నతనంలో భీష్ముడి ఒడిలో ఎక్కి నాన్నా అని పిలిచాడు. అప్పుడు భీష్ముడు నేను నాన్నను కాదయ్యా, నీ తాతను అని చెప్పాడు. కానీ, కర్ణుడు రాధ-అధిరథుల ముద్దు బిడ్డడుగా తల్లితండ్రుల ప్రేమను చూసాడు. (కుంతి విడిచిపెట్టిందని పెరుగుతున్న కర్ణుడికి తెలియదు)

కర్ణుడిని దుర్యోధనుడు ఆదరించి గౌరవంగా చూసుకున్నాడు. పాండవ మధ్యముడుగా ఇద్దరన్నలకు విధేయుడుగా బ్రతికాడు అర్జునుడు. కాబట్టి కర్ణుడు తను కోరుకున్న విధంగా తన జీవితాన్ని గడిపాడు, కానీ అర్జునుడికి ఆ అవకాశమే లేదు.

కర్ణుడు రాజ్యభోగం అనుభవించగా, పాండవులు నానాకష్టాలు పడి జీవితం సాగించారు. ద్రౌపది వస్త్రాపహరణంలో ఎవరు ప్రధాన దోషియో, ఎవరు బాధితులో ప్రత్యేకంగా చెప్పాలా.

కర్ణుడు అవకాశం చిక్కినప్పుడల్లా పెద్దలమీద, నీతికి విరుద్ధంగా నోరు పారేసుకుంటూ దుర్భాషలాడాడు. అర్జునుడు ఎక్కడున్నా వినయంగా, సంయమనంతో ఉంటూ అందరి ప్రేమను చూరగొన్నాడు.

కర్ణుడు రాజ్యభోగాలు అనుభవించగా అర్జునుడు తపస్సులు చేసాడు.

అర్జునుడి జీవితమంతా యుద్ధమే. అర్జునుడు చేసినన్ని యుద్ధాలు కర్ణుడు చేయనే లేదు. కురుక్షేత్రంలో కనీసం పది రోజులు కూడా పోరాడని వాడు కర్ణుడైతే, ఆజి మొదలు తుది వరకు పోరాడి గెలిపించింది విజయుడు.

చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పొచ్చు. కృషి, తపస్సు, వినయ విధేయతలు, గొప్ప వ్యక్తిత్వం, దైవానుగ్రహం అన్నీ చక్కగా కష్టించి సంపాదించుకున్న వాడు అర్జునుడు. అతనిలా జీవితం సాగించటం అంత సులువు కాదు.

No comments:

Post a Comment