*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీహరి లీలామృతం 24వ భాగము*
*(సంక్షిప్త భాగవత గాథలు)*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*తృతీయ స్కంధం*
*7వ భాగము*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*🌻కపిల బోధ - భక్తి🌻*
🍃🌺కర్దముని సన్న్యాసంతో, దేవహూతికి బ్రహ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చి, తన కుమారుడైన కపిలునితో ఇలా అంటుంది.
🍃🌺“నాయనా! నీవు నా కుమారుడవే అయినా, నీవు జ్ఞానభాస్కరునిగా అవతరించావని నాకు తెలుసు. ఇంద్రియ సుఖాలే సర్వస్వమని భావించిన నాబోటి వారికి ఈ వ్యామోహంనుండి బయటపడే మార్గం చూపవయ్యా”
🍃🌺అన్న తల్లితో కపిలుడు ఇలా అన్నాడు. “అమ్మా! మనస్సే అన్నిటికి మూలకారణం. అది సత్వరజస్తమో గుణాలతో చేరినపుడు ఇంద్రియ విషాలతో చరించితే బంధం ఏర్పడుతుంది. ఆ మనస్సునే ఈశ్వరునియందు సంగమిస్తే, మోక్షం లభిస్తుంది. అహంకారంతో అనేక దుర్గుణాలు ఏర్పడతాయి. మనస్సు వాటికి దూరమైనపుడు పరిశుద్ధమౌతుంది. అపుడు దుఃఖాలు నశించి, జ్ఞానవైరాగ్యాలు ఉదయిస్తాయి. శరీరం కంటే భిన్నమైనది ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే కోరిక లేకపోవడమే వైరాగ్యం. జ్ఞానవైరాగ్యాలు ఉదయిస్తే మనసులో భగవంతుని యందు భక్తి ఉద్భవిస్తుంది. అపుడు ఆత్మ స్వరూపం కనబడుతుంది. పరమేశ్వరుడు ప్రకృతికి పరుడు. సూక్ష్మస్వరూపుడు. జ్ఞానవైరాగ్యాలతో పరమాత్మను దర్శించిన మునులు ఆ సర్వాంతర్యామికి సర్వమూ సమర్పింపచేసే భక్తి మార్గమే మోక్షప్రాప్తికి ఉత్తమ మార్గమని చెప్పారు.
🍃🌺భాగవతోత్తములు, సర్వ ప్రాణహితులూ, కర్మఫలత్యాగము ననాశ్రయించి, నా గుణగణాలను, చరిత్రను చెప్పుకొంటూ, వింటూ ఆనందిస్తుంటారు. అటువంటి పరమభాగవోతత్తముల సాంగత్యమే వాంఛనీయం. వారి సహవాసంతో శ్రద్ధాభక్తులు జనిస్తాయి. అజ్ఞానం నశిస్తుంది.
🍃🌺భగవద్భక్తి, ముక్తికంటే మిన్న. అది జీవుల కర్మలను, లింగశరీరాన్ని నశింపచేస్తుంది. కొందరు నా చరిత్రను వింటూ, లీలలను స్మరిస్తూ, వాటిలో పరమానందాన్ని పొందుతూ, భక్తిపరవశులై ముక్తిని కూడ కోరుకోరు. కొందరు నా దివ్యసుందరరూపాన్ని మనస్సులో స్థిరం చేసుకుని ధ్యానిస్తూ, ఇతరములైన ఏ భోగాల్ని కోరుకోరు. నిత్యానందంలో మునిగిన వారికి అన్యమేదీ రుచింపదు. అటువంటివారు సంపూర్ణ వైభవంతో అలరారు వైకుంఠాన్ని చేరుకొంటారు.
🍃🌺వారు చివరకు నా కాలచక్రానికి కూడా లోబడరు. ఎందుకంటే నేనే వారికి సర్వస్వం. తల్లితండ్రి గురువు అన్నీను. జనన మరణ సంసార బంధాలనుండి నేను వారికి విముక్తినిస్తాను కనుక ప్రకృతికీ, పురుషునకూ నేనే అధీశ్వరుడను. కనుక నన్ను శరణు కోరనివారు సంసార బంధంలో చిక్కుకొని పోతారు. నా ఆజ్ఞ చేతనే గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు. మృత్యువు సంహరిస్తోంది. అదుచేతనే వైరాగ్యంతో ఋషులు భక్తి శ్రద్ధలతో నాలీలలను స్మరిస్తూ నిర్భయంగా వుంటారు. భక్తియే మోక్షసాధనకు ప్రధాన మార్గమని గ్రహించాలి.
🍃🌺తత్త్వజ్ఞానం : కపిలుడు దేవహూతితో ఇంకా ఇలాగ చెప్పాడు.
🍃🌺“అమ్మా! పరమాత్మ అనాది, అవ్యక్తుడు, త్రిగుణాలు లేనివాడు, త్రిగుణాలనే లీలగా అంటి పెట్టుకొని ఉంటాడు, అపుడు ఆ ప్రకృతి త్రిగుణాత్మకమైన శరీరంతో రూపం ధరించి ప్రజాసృష్టిని ప్రారంభిస్తాడు. దాన్ని చూచి పురుషుడు మోహిస్తాడు. జ్ఞానం మరుగున పడిపోతుంది. ప్రకృతి, పురుషుడు మేళవించగా, పురుషుడు అన్నిటికి తానే కర్తననే భ్రమతో సంసారంలో చిక్కుకు పోతాడు. ఈశ్వరుడు సాక్షీభూతుడు కావటం చేత, ఆత్మకు కార్యకారణ కర్తృత్వములు లేవని జ్ఞానులు తెలుసుకొన్నారు.
🍃🌺ప్రకృతి 24 తత్వాలతో కూడింది అవి పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, అజ్ఞానం ఇవి సగుణ బ్రహ్మకు సంస్థానం. కాలం 25వ తత్త్వం. అంతర్యామిగా పురుషుడు, వెలుపల వ్యాపించనపుడు కాలం అని అనబడుతుంది. సత్వరజస్తమో గుణాల్లో సమతూకం చెదరగొట్టడం కాలం యొక్క ధర్మం. ప్రకృతి, పురుషుడు, కాలం ఈ మూడూ సగుణ బ్రహ్మాంతర్గతములే. కాలం, పురుషుడు కనిపించరు. పరమపరుషుడు
🍃🌺ప్రకృతిలో తన సృష్టిశక్తిని దాచాడు. అపుడు ప్రకృతి మహత్తత్వమయింది. దానినుండి అహం తత్త్వం వచ్చింది. దానినుండియే 24 తత్వాలు పుట్టాయి. చిత్తాన్ని మహత్తత్వమని, వాసుదేవమని అంటారు. సాత్విక అహం నుండి మనస్సు ఏర్పడుతుంది. ఈ అహంకారం శాంత, ఘోర, విమూఢ అని మూడు రకాలుగా కన్పిస్తుంది. శాంతదశలో ప్రకాశం, ఘోరదశలో చంచలం, మూఢ దశలో జడంగా ఉంటుంది. మనస్సులో సంకల్ప, వికల్పాలు ఏర్పడతాయి. సాత్విక అహంకారాన్ని అనిరుద్ధం అని కూడా అంటారు. రాజసిక అహంకారాన్ని ప్రద్యుమ్నం అని అంటారు. వాసుదేవ వ్యూహం షడూర్ములనుండి విడివడి, షడ్గుణాలతో పరిపూర్ణమై, సత్వగుణ ప్రధానమై భక్తజన సంసేవ్యమై అలరారుతుంది.
🍃🌺మహత్తత్వంనుండి పుట్టిన అహంకారం మూడు రకాలు. వైకారికాహంకారం దేవతారూపమై వుంటుంది. తైజసాహంకారం బుద్ధి, ప్రాణరూపాల్ని కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియ విషయాలతో కూడి ప్రయోజన మాత్రమై ఉంటుంది. వైకారికమైన సాత్వికాహంకారాన్ని సంకర్షణ వ్యూహం అధిష్టించి వుంటుంది.
సంకర్షణ పురుషుడు పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి వుంటాడు. దీనినుండి మనస్తత్వం పుట్టింది. దీనికి చింతనలు సహజం. దీనికి సంకల్పం, వికల్పం అని రెండు విధాలు. వీటి వల్లనే జీవులు విభిన్న లక్షణాలతో కన్పిస్తారు. వివిధ కోర్కెలు కలుగుతాయి. దీనినే ప్రద్యుమ్న వ్యూహమని అంటారు.
🍃🌺అనిరుద్ధ వ్యూహం యోగాలకు సంసేవ్యమై శ్యామల వర్ణంలో ప్రకాశిస్తుంటుంది. తైజసాహంకారం నుండి బుద్ధి తత్త్వం పుట్టింది. దీనివల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియా జ్ఞాన సాధనలు ఏర్పడ్డాయి. దీనివల్లనే క్రియాశక్తి, జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు జ్ఞాన, కర్మేంద్రియాలను పనిచేసేటట్లు చేస్తాయి.
🍃🌺తామసాహంకారం నుండి శక్తి తన్మాత్ర పుట్టింది. దీనినుండి ఆకాశం వచ్చింది. దానినుండి శ్రోత్రేంద్రియం పుట్టింది. ఆకాశం అన్నిటికి ఆశ్రయంగా వుండటమే కాకుండా ఆత్మకు, ప్రాణానికి, ఇంద్రియాలకు ఆశ్రయంగా వుంది ఆకాశంనుండి స్పర్శ తన్మాత్రతో వాయువు, దీనినుండి స్పర్శ గ్రహించగల త్వగింద్రియమూ పుట్టింది. దీనివల్ల స్పర్శజ్ఞానం లభిస్తుంది.
🍃🌺వాయువు నుండి రూపతన్మాత్ర తేజస్సు జనించింది. దానిలో చక్షురింద్రియం ఏర్పడి రూపగ్రహణ శక్తి ఏర్పడింది. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సునుండి రసతన్మాత్ర పుట్టింది. దానిలో జలం వచ్చింది. రుచులను తెలుసుకోవడం రసనేంద్రియ లక్షణం. దైవ ప్రేరణలో మార్పు చెందిన జలం నుండి గంధ తన్మాత్ర పుట్టింది. దానితో పృథ్వి ఏర్పడింది. అన్నిటికి భూమితో సంబంధం వుండటంచేత శబ్ద, రూప, స్పర్శ, రస, గంధాలన్నీ కలిసే ఉంటాయి. భోగశరీరుడైన ఒక పురుష రూపాన్ని కల్పించలేని ఒక అసమర్ధ సమయంలో సర్వేశ్వరుడు త్రిగుణాలతో ప్రకాశించినంతనే ఆ తత్వాలు అన్యోన్యమై ఒక పిండంగా తయారైంది. ఆ అండంలో విరాట్ పురుషుడు సంభవించాడు.
🍃🌺ఆ అండాన్ని ఆధారం చేసుకొని చుట్టూ జలం, పృథ్వి, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, జగత్తు, ఒక దానికంటె మరొకటి పదిరెట్లు పెద్దదిగా ఆవరించాయి. ఆ బంగారు అండంలో పద్మనాభుడి రూపం విలసిల్లుతోంది. దేవదేవుడు శ్రీహరి అయిన నారాయణుడు అండంలో ప్రవేశించి, ఆ బ్రహ్మాండాన్ని ఛేదించగా, దానిలోనుండి విరాట్ పురుషుడు దివ్య తేజస్సుతో వెలువడ్డాడు.
🍃🌺ఆ పురుషుని ముఖం నుండి వాణి, అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘోణేంద్రియాలు వచ్చాయి. ప్రాణవాయువుతో కన్నులు, అందులో సూర్యుడు ప్రభవించారు. ధ్యానంతో చెవులు వచ్చాయి. దానితో శ్రోత్రేంద్రియం, దిక్కులూ ఏర్పడ్డాయి. రోమాలు, ఓషధులు, రేతస్సు, జలం, అపానం, మృత్యువు పుట్టాయి. బలం, ఇంద్రుడు, దిక్కులు, ఉపేంద్రుడు జన్మించారు. నాడులవల్ల రక్తం, నదులూ, ఆకలిదప్పులూ, సముద్రాలు పుట్టాయి. హృదయం వల్ల మనస్సు, దానివల్ల చంద్రుడు, బుద్ధి; చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఈ విధంగా ఆ అండంనుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.
🍃🌺ఈ విరాట్ పురుషునిలో పంచభూతాలు మున్నగునవి సమైక్యం పొందలేదు. అందువల్ల క్షేత్రజ్ఞుని (జీవుని) యలేక పోయాయి. తరువాత సమైక్యం చేయగల క్షేత్రజ్ఞుడు చిత్తంలో ప్రకాశించాడు. అందు విరాట్ పురుషుడు బ్రహ్మాండాన్ని అధిష్టించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు.
🍃🌺భక్తి, వివేకం కలిగిన మహాత్ములు ఆ పురుషుని ధ్యానిస్తారు. ప్రకృతి పురుషుల గురించి యథార్థ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. ప్రకృతితోనే సంబంధం ఏర్పరచుకొంటే సంసార బంధం కలుగుతాయి. విరాట్ పురుషుడు సత్వరజస్తమో గుణాలతో ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించినా కూడా, అసంగుడైతే ప్రకృతి గుణాలకు లోనుకాడు, మోహం ఉండదు. సూర్యబింబం లాగా ప్రకాశిస్తాడు. ప్రకృతికి లోనైతే, ప్రకృతి దోషాలతో నానావిధ యోనులతో జన్మించి, కర్మవాసనలను విస్తీర్ణం చేసుకొంటూ ఉంటాడు. ఇలా విషయధ్యాసలో, ఐశ్వర్యాలను పొందినట్లు భ్రమపడుతూ, అసత్తును ఆక్రమిస్తూ, చంచల మనస్సుతో చరిస్తుంటాడు.
🍃🌺కనుక మోక్షం కోరుకునేవాడు యోగాభ్యాసం చేస్తూ, అనన్య భక్తిని పెంచుకోవాలి. నా సత్య స్వరూపాన్ని గ్రహించాలి. పాదసేవలు చేయాలి. నా కథలను వినాలి. సమబుద్ధితో ఉండాలి. మాత్సర్యం ఉండకూడదు. బ్రహ్మచర్యం, మౌనం పాటించడం, స్వధర్మాచరణ చేయాలి. నిత్య సంతుష్టుడై వుండాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానార్జనలో ఆసక్తి పెంచుకోవాలి. గాఢమైన దేహధ్యాసను వదలాలి.
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
No comments:
Post a Comment