Wednesday, July 3, 2024

సీతారాముల ప్రణయం!

 శు భో ద యం!

సీతారాముల ప్రణయం!

      శ్లో:  కిమపి  కిమపి  మన్దం  మన్ద మాసక్తి  యోగా
              
           దవిరళిత  కపోలం  జల్పతో  రక్రమేణ

           అశిథిల  పరిరంభా  ద్వాపృతేకైక  దోష్ణో

            రవిదిత   గతయామా  రాత్రి  రేవం  వ్యరంసీత్; /

              ఉత్తర రామచరితమ్-నాటకమ్ - ప్రధమాంకం;

                               ఆదర్శ  దాంపత్యానికి  సీతారాములనే  ముందుగా  మనం  పేర్కొనటం  కలదు.లోకంలో  వారిదాంపత్యం  అంత ప్రసిధ్ధం! యెక్కడ  వివాహ పత్రిక  అచ్చువేసినా  తిలకంగా "జానక్యాః కమలా మలాంజలిపుటే"- శ్లోకం  ఉండితీరాల్సిందే! అటువంటి దంపతుల  సచ్చరిత్ర  ఉత్తర భాగమును  భవభూతి  యనే మహాకవి  ఉత్తర రామచరితమ్  అనుపేర  సంస్కృతంలో  నాటకంగా రచించాడు. అందులో  ఒక శ్లోకమిది. ఇంతకు ముందు నేను F.B. చూస్తుంటే  యెవరో  మందాక్రాన్త  వృత్తాన్ని  గురించి వివరించారు. నాకెందుకో  యీశ్లోకం గుర్తుకు వచ్చింది. ఇదికూడా మందాక్రాంతంలో  వ్రాయ బడటం కారణంకావచ్చు. 

                రాముడు  శంబూక  వధ నిమిత్తం  జనస్థానానికి  వచ్చాడు. పనిపూర్తయింది. పరిచిత ప్రాంతాలలో  తిరుగుతూ  సమీపంలో ఉన్న పంచవటికి  వచ్చాడు. వనవాస సమయంలో  అదిసీతారాముల  నివాసం. అక్కడకు చేరగానే  రామునకు  వెనుకటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆహా!  ఆరోజు  లెంత  ఆనందంగా  గడిచాయి. అనుకుంటూ  నాటియాదంపతుల విహార విశేషములను తలచు కుంటున్నాడు ఇలా!

                  " సీతా  నేనూ   ఒంటిగా   యీగోదావరీ   తీరంలో   ఒకరిప్రక్క నొకరం కూర్చొని  ఒకరి కపోలానికి 
   మరియొకరికపోలం  చేరువగా  నుంచుకొని  దగ్గరదగ్గరగా  నుండి  యేవేవో మాటలు  చాలా మాట్లాడుకునేవారం. ఆనిశిలో శశికిరణాలలో చలియనిపిస్తే  ఒకరినొకరం  కౌగిలింతలతో   వేడి నింపు కునేవారం. ఇలాకాలం   కరగిపోతూ ఉండేది.సమయ మెంత అయినదో ?ఎన్నిజాములు గడచినదో  తెలిసెడిదే కాదు  రాత్రంతా  యిలాగే  గడచి పోయేది" - ఆరోజులు తిరిగిరావు."- అని,

                   ఈశ్లోకం  విషయంలోనే  ఒక కథ ప్రచారంలో  ఉంది. కాళిదాస భవభూతు లిద్దరూ వాహ్యాళి కెళుతున్నారట! భవభూతి తాను రచించిన  యీశ్లోకం చదువగా  తములములు  నమలుతున్న కాళిదాసు  తుపుక్కున నుమిసి  సున్నం యెక్కువైంది! అన్నారట!విషయం భవభూతికర్ధమైనది. ఓహో శ్లోకం చివరిలో  'ఏవం' అని  అనుస్వారము  యెక్కుగా వాడితినని కాబోలును. అనుకొని సున్న తొలగింపగా మరింత మనోజ్ఙముగ శ్లోకార్ధము  మారినదట.

                      రాత్రి రేవ  వ్యరంసీత్  - రాత్రియే గడచెను. అనియర్ధము. రాత్రియంతా  కబుర్లు చెప్పుకున్నా  వారికబుర్లు పూర్తికాలేదు,  కాని, రాత్రి మాత్రం  గడచిపోయింది. అనేఅర్ధంవచ్చింది. బాగుందికదా? సీతారాముల ప్రణయ విహారం!

                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment