*కుక్క కాటుకు చెప్పుదెబ్బ*
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం ఉండేది. అ ఊళ్ళో వనమయ్య అనే ఆసామి ఉండేవాడు. అది చలికాలం వనమయ్యా, అతని స్నేహితులూ ఇంట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నా రు. అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. వనమయ్య ఊరికే వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు.
స్నేహితులంతా "ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు. నీవేమీ ఘనకార్యం చెయ్యలేదా ?" అని ఎగతాళి గా అడిగారు.
అప్పుడు వనమయ్య "నేనేదయినా చేయగలను. ఏమి చేయ్యమంటారో చెప్పండి, చేసి చూపిస్తాను" అన్నాడు.
"అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి ఉండాలి. ఏ విధంగానూ వేడి తగలరాదు. పొద్దు పొడిచే వరకూ అలాగే నిలబడి ఉండా"ల అని హెచ్చరించారు.
"సరే అలాగే నిలబడతాను. నేను గనక ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను. అదీ పందెం" అన్నాడు వనమయ్య.
ఇంట్లో కుంపటి, దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు. అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది. మంచు కురవడం ప్రారంభమైంది. పళ్ళు గిట్ట కరుచుకునిపోయాయి. అటూ ఇటూ పచార్లు చేయటం మొదులుపెట్టాడు.. ఇంతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది. ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లనిపించింది. ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది.
స్నేహితులు వచ్చి "మొత్తానికి నువ్వే గెలిచావయ్యా" అని అభినందించారు. "నీ కడుపు బంగారం గానూ! ఇంత చలి ని ఎలా ఓర్చుకున్నావయ్యా?" అని అడిగారు.
“అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాన్ని చూస్తూ వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను” అన్నాడు వనమయ్య.
“ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ దీపం వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు పందెం లో ఓడిపోయినట్టే. నీవు మాకు విందు ఇవ్వాల్సిందే” అని అందరూ పట్టుబట్టారు.
“ఎక్కడో దూరంగా ఉండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది? ఇది అన్యాయం” అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు. విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు.
ఏమి చెయ్యాలో దిక్కుతోచక గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని ఆయన్ని వేడుకున్నాడు. ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని
చెప్పి పంపించాడు.
సరేనని ఇంటికి వెళ్లి మరుదినం ఒక కుండలో బియ్యము నీళ్ళు పోసి చూరుకు వ్రేలాడదీసి కింద చిన్న దీపం వెలిగించి పెట్టాడు. మధ్య మధ్యలో ఒక చిన్న బల్ల మీద ఎక్కి వుడికిందా లేదా అని చూస్తున్నాడు. మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు.
"వంట అయిందా వనమయ్యా? అని అడిగారు. ఇదిగో ఇంకా ఉడుకుపట్టలేదు. పొద్దుననగా పెట్టాను" అన్నాడు. వాళ్ళు లోపలి వచ్చి చూసి "ఇలా పెడితే ఎలా వుడుకుతుంది? నీకేమైనా పిచ్చా?" అన్నారు స్నేహితులు.
"దీపం చిన్నదైనా, ఎంత దూరంగా ఉన్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా, మరి ఇదీ అంతే" అన్నాడు వనమయ్య. వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ ఇంటికెళ్లి వనమయ్య కు ఘనంగా విందు ఇప్పించారు..
No comments:
Post a Comment