☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
125. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ
ధర్మవిరుద్ధం కాని కామం నా స్వరూపం(భగవద్గీత)
కోరిక లేకుంటే కర్మకు ప్రేరణ లేదు. కర్మ లేకుంటే జగత్తు లేదు. అందుకే
కామం, మోహం కూడా భగవత్ శక్తులే.
ధర్మపరమైన కోరిక మనస్సును నియంత్రించి ఆత్మోన్నతిని పెంచుతుంది. ఆ నియంత్రణకు వైరాగ్యం సహకరిస్తుంది. 'వైరాగ్యః పతన హేతుః' - అని వేదాంత
శాస్త్రకారులే చెప్పారు. దృష్టి జ్ఞానమయమై, నిత్యానిత్య వస్తువివేకం ఏర్పడి లభించే
వైరాగ్యం గొప్పదే. కానీ మనకు అనేకమార్లు పనికి మాలిన విరక్తి ఏర్పడుతుంది.అది కొన్ని వైఫల్యాలవల్ల, నిరాశలు, బద్ధకాల(సోమరితనం) వల్ల, భ్రమల వల్ల కూడా కలగవచ్చు.
పురాణవైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం - అనే మూడు రకాల తాత్కాలిక వైరాగ్యాలను గురించి అనూచానంగా వింటుంటాం. ఇవి ఒక తరహా.
కర్తవ్యాన్ని విస్మరించి, విముఖుని చేసే వైరాగ్యం పతన హేతువు. ఇలాంటి వైరాగ్యం నుంచి అర్జునుని మరల్చాడు శ్రీకృష్ణుడు. ఆ వైరాగ్యాన్ని కూడా 'మోహం' కిందనే
జమకట్టాడు.
'భార్యాబిడ్డల బంధాలు మాయల'ని చెప్పి అన్నిటినీ అందరినీ విడచి కాషాయం వేసుకొని, మరోరకమైన లంపటాలు పెంచుకొనే వారుంటారు. అన్ని భోగాలను జయించినవాడు ఆచరించవలసిన సన్న్యాసధర్మాన్ని, బాధ్యతను భరించలేనివాడు
చేపడితే ఆ ధర్మ మార్గమే అధర్మ మార్గమౌతుంది. రాగద్వేషాలను జయించాలి -అనే ప్రబోధాన్ని మరోలా అర్థం చేసుకొని 'భార్యాబిడ్డల ప్రేమ, తల్లిదండ్రుల అనుబంధం'
వీటిని వదిలేయాలని అనుకుంటారు. అనురాగాన్ని జయించాలంటే, దానిచోట నిరసననీ, ఈసడింపునీ తెచ్చుకొనడం కాదు కదా!
ఒక గొప్ప సంస్థను నిర్వహించేవాడు- 'ఇవన్నీ శాశ్వతమా! వీటి కోసం ఎందుకు వృథా శ్రమ!' అని కర్తవ్యాన్ని వదిలితే ఆ వైరాగ్యం అతనిని అధర్మపరునిగా మార్చుతుంది తప్ప ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడదు. ధర్మానికి అవరోధం కలిగించే వ్యామోహమూ ప్రమాదమే! మన కర్తవ్యాన్ని సమర్థంగా, ఉపయోగకరంగా నెరవేర్చనీయని వైరాగ్యం కన్నా ఫలాపేక్షతో కర్తవ్యోన్ముఖునిగా పనిచేసే వ్యామోహం మిన్న. అది మనల్ని
చైతన్యవంతులుగా జీవింపజేస్తుంది.
అయితే మోహం కోసం పరిధులు దాటితే, ఆ మోహం కోసం ఆత్మోన్నతినీ, సమాజగతినీ దెబ్బతీసే అక్రమానికి దిగితే అదీ ప్రమాదమే. అందుకే దాని పరిమితులు
దానికున్నాయి. ధనాశ మనచే ఒక పనికి ప్రేరేపిస్తుంది. ఆ పనిచేయడం ద్వారా మన ఉనికికి సార్థకత, సమాజానికి ఉపకారం ఉంటాయి. ఆ ధనాశే అధికమైతే వంచనకీ, ద్రోహానికీ హేతువవుతుంది.
ధార్మిక అనుబంధాలలో వ్యామోహం వ్యక్తిని పతనం చేయదు. సంసార నిర్వహణను గొప్పగా గౌరవించి గృహాస్థాశ్రమాన్ని మహోన్నతంగా భావించిన సంస్కృతి, సన్న్యాస
ధర్మాన్ని ఆరాధించాలని కూడా చెబుతోంది. ఈ రెండిటినీ ప్రవృత్తి మార్గం, నివృత్తిమార్గం
- అని సనాతనసంస్కృతి విభజించింది. రెండు మార్గాలూ గొప్పవే. వ్యామోహం లేని మనఃస్థితికి నివృత్తి మార్గం. ఈ రెండవ మార్గానికి చెందిన మనఃస్థితికి రాకుండానే
ఆ మార్గపు వేషం ధరిస్తే వాడు సమాజానికి శత్రువే అవుతాడు. మనస్సుకు నిజంగా వైరాగ్యం వస్తే, సంసారాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే యోగిగా జీవించవచ్చు. అది
సాధించలేకుంటే ఉన్న మోహాన్ని సంసారపు బంధాలకే పరిమితంచేసి, ధార్మికంగా జీవించవచ్చు. అది అతడికి ప్రమాదహేతువు కాదు.
వ్యామోహానికి రెండు కోణాలు ఉన్నట్లే వైరాగ్యానికి కూడా రెండు కోణాలున్నాయి.
No comments:
Post a Comment