*ఇచ్చుటలోవున్న హాయి మరెచ్చటనో లేదోయ్. దీని అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.
ఒకసారి ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో సుఖ సంతోషాలు ఏమీ లేవని అన్నీ ఉన్నా ఏమి తృప్తిని కలిగించడం లేదు నిత్యం ఆనందంగా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని కోరింది.
వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు! అప్పుడు తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది...
ఈ మధ్యనే“నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా అనే వారు ఎవరూ లేరు నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా ఓదారుస్తున్న దుఃఖంతో చిన్న చిరునవ్వు కూడా మర్చిపోయాను
ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న జుట్టుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!
వెంటనే నేను ఆలోచనల్లో పడ్డాను. ‘ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే.., మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా మరింత సంతోషం కలుగుతుంది కదా!’ అని అన్పించింది. ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఎంతో సంతోషం అనిపించింది. ఆ రోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అన్పిస్తుంది. ప్రతిక్షణం ఆనందంగా తింటున్నాను.ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది! అని చెప్పింది ఆ పనిమనిషి. ఈ మాటలతో దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించింది ఆ యువతి. నిజమే డబ్బుతో ఏదైనా కొనుక్కోగలం కాని సంతోషాన్ని కొనుక్కోలేము కదా. పొందితే సంతోషమే కానీ పంచితే పరమానందం అన్న సత్యం ఇదే కదా అనుకొన్న ఆ యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!
మిత్రులారా మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది కాదు. మనవల్ల ఎదుటివారు ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్న దానినిబట్టే మనకు ఆనందం మిగులుతుంది.
ఆనందం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! ఈ ఆనందం మరో రోజులో లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఉంది! సంతోషం పరాధీనత కాదు! అది ఓ నిర్ణయం!!.. లోకా సమస్తా సుఖినోభవంతు అన్న మాటలోని యదార్థం ఇదే కదా! పత్రీజీ మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ నేర్పింది ఈ సత్యమే.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment