Friday, May 2, 2025

 మే డే స్ఫూర్తికి భారతీయ ఆద్యుడు మలయపురం సింగారవేలర్



ప్రపంచ వ్యాప్తంగా మే ఒకటవ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. 1886 మే 4న షికాగోలోని హే మార్కెట్‌లో కార్మిక సంఘాల సభలో పోలీసు కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మరణించిన కార్మికుల బలిదానాన్ని స్మరిస్తూ వారి పోరాట పటిమకు ప్రతి ఏడాది మే 1న నివాళులర్పించాలని 1889లో అంతర్జాతీయ సోషలిస్టు సమాఖ్య నిర్ణయించింది. నాటి నుండి మే 1ని కార్మిక దినోత్సవంగా జరపడం ప్రారంభమయ్యింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై, కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం అడుగంటిన అనంతరం మేడే వేడుకల ప్రభ కొంత మసకబారింది. అయినా కార్మికోద్యమాల విజయానికి ప్రతీకగా మేడే ప్రపంచమంతటా భాసిల్లుతూనే ఉంది. 

భారత ఉపఖండంలో తొలిసారిగా 1923 మే నెల మొదటి రోజున మద్రాస్‌లో అరుణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ కార్మిక లోకంతో పాటు భారత కార్మిక శక్తి పిడికిలి బిగించి నినదించిన ఆ రోజుకు ఈ మేడేతో నూరేళ్లు పూర్తవుతాయి. శతాబ్దం క్రితం జరిగిన ఆ చరిత్రాత్మక ఆరంభానికి కర్త, క్రియ మలయపురం సింగారవేలర్. సింగారవేలు చెట్టియార్‌గా కూడా సుప్రసిద్ధుడైన ఈయన వ్యక్తిత్వంలో పలు పార్శ్వాలు గోచరిస్తాయి. ఉపఖండపు తొలితరం కమ్యూనిస్టు (భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు), న్యాయవాది, వ్యాపారవేత్త, కార్మిక నాయకుడు, సామాజిక న్యాయ ఉద్యమ సారథి, బౌద్ధునిగా దక్షిణ భారత – ముఖ్యంగా తమిళ సామాజిక – యవనికను స్ఫూర్తిదాయకంగా ప్రభావితం చేసిన చరిత్ర నిర్మాత సింగారవేలు.

1860లో మద్రాస్‌లో ఒక సంపన్న మత్స్యకార (పరదవర్) కుటుంబంలో సింగారవేలు జన్మించారు. ఆధునిక భారతదేశ తొలి దళిత సిద్ధాంతకర్త, భాషావేత్త, సిద్ధ వైద్య నిపుణుడు అయిన అయోతి దాస్, రష్యన్ విప్లవం, పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంతో ఉత్తేజితుడైన సింగారవేలు స్వాతంత్ర్య, కార్మికోద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. ఒక పరిపూర్ణ ఉద్యమకారుడిగా, పలు రంగాల నిష్ణాతుడిగా ప్రజా జీవనంపై ఆయన తనదైన ముద్ర వేశారు. అయోతి దాస్ కులపీడన సమస్యకు బౌద్ధ దమ్మ స్వీకారమే పరిష్కార మార్గమని భావించి సిలోన్ మహాబోధి సంఘం మాదిరిగా మద్రాస్‌లో శాక్య బౌద్ధ సంఘాన్ని సింగారవేలు స్థాపించారు. 1902లో ఒక బౌద్ధ సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లి అక్కడ మార్క్స్ రచనలను చదివి సామ్యవాద సిద్ధాంతం పట్ల ఆకర్షితుడయ్యారు.

19వ శతాబ్దం చివరి అంకంలోనే మన దేశంలో కార్మికోద్యమాలకు బీజం పడింది. నిర్దిష్ట నిబంధనలతో, పటిష్ఠ ప్రణాళికతో తొలి కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత సింగారవేలుదే. ఏప్రిల్ 27, 1918న మద్రాసులోని బకింగ్ హామ్ కర్నాటిక్ టెక్స్టైల్ మిల్లు (వస్త్ర పరిశ్రమ) కార్మికులను కూడగట్టి ‘మద్రాస్ లేబర్ యూనియన్’ పేరుతో తొలి ట్రేడ్ యూనియన్‌ను ఆయన స్థాపించారు. బకింగ్ హామ్ మిల్లు కార్మికులు తమ హక్కులకై సింగారవేలు నాయకత్వంలో ఉద్యమించారు. 

సింగారవేలు భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడుగా ఉంటూ సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. వేల్స్ యువరాజు తన భారత పర్యటనలో భాగంగా జనవరి 13, 1922న మద్రాస్‌కు వచ్చాడు. మద్రాస్ నగరం ఆయన పర్యటనకు భారీ ఎత్తున నిరసన తెలిపింది. జలియన్ వాలా బాగ్ మారణకాండకు కోపోద్రిక్తులైన ప్రజలు స్వాగత ద్వారాలను ధ్వంసం చేశారు. యువరాజు పర్యటనను స్వాగతించిన జస్టిస్ పార్టీ నాయకుడు త్యాగరాయ చెట్టి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.

1922 సెప్టెంబర్‌లో మద్రాస్ కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కార్మికులకు కాంగ్రెస్ అండగా నిలువవలసిన అవసరం గురించి సింగారవేలు విశదీకరించారు. గయలో కాంగ్రెస్ జాతీయ మహాసభలో కార్మికుల పోరాటం జాతీయ ఉద్యమంలో భాగం కావాలని సింగారవేలు ప్రతిపాదించారు. కార్మికులంతా సంఘటితమై దోపిడీకి వ్యతిరేకంగా, వనరుల సమాన పంపిణీకై పోరాడవలసిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ వైఖరిలో నిబద్ధత కరువైనదని భావించిన సింగారవేలు 1923 మే ఒకటవ తేదీన స్వంతంగా ‘లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్’ను స్థాపించారు. 

ఉపఖండం భూభాగంపై ప్రప్రథమంగా ఎర్ర జెండాను ఎగురవేశారు. ఆ రోజున మద్రాస్ హైకోర్టు ఎదురుగా సముద్రతీరంలో, అలాగే ట్రిప్లికేన్ బీచ్‌లో అరుణ పతాకాన్ని వందలాది ప్రజల సమక్షంలో ఎగురవేసి సింగారవేలు చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం చింతాద్రిపేట్‌లనున్న నేపియర్ పార్క్‌ లో కూడా ఆ రోజున సింగారవేలు ఎర్ర జెండాను ఆవిష్కరించినట్టు తెలుస్తోంది.

1925లో కాన్పూర్‌లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభకు సింగారవేలు అధ్యక్షత వహించారు. ఆ సభలోనే మేడేను సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డాంగే, ఘాటే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్తా మొదలైన నాయకులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు అధ్యక్షత వహించమని సింగారవేలును వారే కోరడం కార్మిక వర్గ శ్రేయస్సు పట్ల ఆయనకు గల అంకితభావానికి నిదర్శనం. కమ్యూనిస్టు పార్టీలో కొంత కాలం పనిచేసిన సింగారవేలు, పెరియార్‌కు సన్నిహితుడై ఆత్మ గౌరవ ఉద్యమంలో పాల్గొన్నాడు. లేబర్ అండ్ కిసాన్ గెజెట్, తొజిలాలమ్ (శ్రామికుడు) లాంటి పత్రికలను ఆయన నడిపారు. శాస్త్ర విజ్ఞాన విషయాలపై రచనలు చేస్తూ, కార్మిక పోరాటాలకు తన వంతు సహాయం చేస్తూ సింగారవేలు ఫిబ్రవరి 1946లో మరణించారు.

No comments:

Post a Comment