*ఉగాది మధురిమ.....*
*సంవత్సరారంభాన్ని భారతదేశంలో చాంద్రమాన, సౌరమాన, బార్హస్పత్య మానాల్లో పరిగణిస్తారు. ఈ మూడు వేదజ్యోతిషాన్ని ఆధారం చేసుకొని ఏర్పడినవే. వేద విజ్ఞానానికి అంగమైన జ్యోతిశ్య శాస్త్రం ఆవిష్కరించిన సూర్య సిద్ధాంత'మే అన్ని కాలగణనాలకి ఆధారమని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. తెలుగువారు చాంద్రమానం ప్రకారం సంవత్సరాది జరుపుకొంటారు. యుగాది, ఉగాదిగా వ్యవహరించే ఈ పండుగ 'సృష్ట్యాది' అని పంచాంగాలు, కొన్ని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.*
*చైత్ర వైశాఖాలకు వేదంలో మధు-మాధవ మాసాలని పేర్లు, మధుమాసంలో మొదటి రోజు శుక్ల పాడ్యమి. 'మధు' అంటేనే 'తీయనిది' అని ప్రధానార్ధం. వసంతమంతా ఈ మధుర లక్షణాలతోనే ఉంటుంది. చిగురించి, పూసి, ఫలించే తరు లతలు, మలయ పవనాలు, కోకిల స్వరాలు... ఇవన్నీ దృశ్య శబ్ద మాధుర్యాలే. 'గాలి మధువును వీచాలి. నీరు మధువును ప్రవహించాలి.*
*అలాగే... భూమి, సూర్యకాంతి, ఆకాశం... అన్నీ మధుమయం కావాలి. భావాలు, మాటలు మధురంగా ఉండాలి'-అంటూ వేదం వివిధ మంత్రాలను చెప్పింది. 'మధు' శబ్దంతో ప్రారంభమయ్యే సంవత్సర కాలం ఇలాంటి 'మధురిమలను ప్రపంచమంతా ప్రసరింపజేయాలని శుభాకాంక్షలను వేద ఋషి ప్రవచించాడు. కాలం మధురంగా సాగాలని కోరుకోవడం కంటే గొప్ప శుభాకాంక్ష ఏముంటుంది? ఈ చైత్రమాసానికి కేవలం చాంద్రమానంలోనే కాక, అన్ని కాలమానాల్లోనూ ప్రాధాన్యం ఉంది.*
*ఏడాది పొడుగునా వివిధ ఋతు, మాసాల్లో విభిన్న యజ్ఞాలను ఆచరించే విధానాలను వేదశాస్త్రాల్లో వివరించారు. మారుతున్న ఋతు కాలాలకు అనుగుణంగా, ప్రకృతిలోని దివ్యత్వాన్ని స్పందింపజేసి, యోగక్షేమాలను అందుకోవడమే ఆయా యజ్ఞాల పరమార్థం. ఈ యజ్ఞ విశేషాలే పలు రకాల పండుగలుగా, కాలంలోని మార్పులకు అనుగుణమైన ఆచార వ్యవహారాలతో ఏర్పడ్డాయి.*
*పూర్ణిమనాడు చిత్తా నక్షత్రం కలిసిన మాసం చైత్రం. ఈ రోజున చేసే యజ్ఞం సంవత్సర యజ్ఞాలన్నింటికీ ప్రధానం. ఈ విశేషాన్ని కాళిదాస మహాకవి 'రఘు వంశం' కావ్యంలో చక్కగా అభివర్ణించాడు. భారతీయ వాఙ్మయంలో వేదవిజ్ఞాన ప్రభావానికి ఇది ఒక మచ్చుతునక.*
*'వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరిన సుదక్షిణాదేవి, దిలీప చక్రవర్తి దంపతులు రథాన్ని అధిరోహించారు. అప్పుడు ఆ చక్రవర్తి చిత్తానక్షత్రంతో కూడిన చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు' అని కాళిదాస కవిత. చైత్ర పూర్ణిమనాటి ప్రాధాన్యాన్ని ఈ మాట చెబుతోంది.*
*భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు, కాల మానాల మార్పులు, వ్యవహార సరళిలో వైవిధ్యం ఎంత ఉన్నా, అన్నింటికీ ఏకసూత్రంగా ఉన్నది వైదిక విజ్ఞానమేనని స్పష్టమవుతోంది.*
*సంవత్సరానికి చెందిన సూక్ష్మశక్తిసారం చైత్రమాసంలో ఉందని ధర్మశాస్త్రాల భావం. ఈ నెలలో వచ్చే తిథులకు, వారాలకు కూడా మంచి ప్రభావం ఉంటుందని, వాటిని పాటించి చక్కని ఫలాలను పొందవచ్చని అనేక గ్రంథాలు చెబుతున్నాయి.*
*యజ్ఞం. అగ్ని సర్వదేవతల స్వరూపాలు. అందుకే ఈ. పాడ్యమి బ్రాహ్మీ ముహూర్తంలో శుభ భావనలతో మేల్కొని, అభ్యంగాలతో శుద్ధులమై దేవతలందరికీ నమస్కరించి, కాలాంగాలైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు-అనే పంచాంగాలను సత్సంకల్పాలతో శ్రవణం చేయడం విధిగా పెద్దలు నిర్దేశించారు. నాడు*
*ఇన్ని పవిత్ర దివ్య భావాలతో నూతన వత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉగాదిని జరుపుకొంటున్న సందర్భంలో- ఈ ఏడాది మంచి పరిణామాలతో, దేశ ధర్మాలను పరిరక్షించి, భద్రతను, అభ్యుదయాన్ని అందించే దిశగా, చిత్తశుద్ధితో శ్రమించే నీతి గల నేతృత్వం సిద్ధించాలని ఆకాంక్షిద్దాం.*
*┈┉┅━❀꧁ ఉగాది ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍃🎋🍃 🔔🕉️🔔 🍃🎋🍃
No comments:
Post a Comment