*💎నేటి ఆణిముత్యం💎*
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
*ప్రతిపదార్థం:*
చదువు అంటే విద్య; ఎంత కల్గినన్ అంటే ఎంత ఉన్నప్పటికీ; రసజ్ఞత అంటే ఆ చదువుల సారం తెలియకపోతే; ఇంచుక అంటే ఏ మాత్రమూ; చాలకున్నన్ అంటే ఆ చదువు వ్యర్థమైనది; ఎచ్చటన్ అంటే ఎక్కడైనా గుణసంయుతులు అంటే మంచిగుణాలు కలిగినవారు;ఎవ్వరు అంటే ఏ ఒక్కరూ; మెచ్చరు అంటే పొగడరు; మంచికూరను అంటే చక్కని రుచిని ఇచ్చే కూరను; పదునుగన్ అంటే తగినవిధంగా; నలపాకమున్ అంటే నలమహారాజు చేసేలా తయారు చేసినప్పటికీ; అందులో అంటే ఆ కూరలో; ఇంపు + ఒదవెడున్ అంటే చక్కని రుచిని కలిగించే; ఉప్పులేక అంటే లవణం లేకపోతే; రుచి అంటే జిహ్వ; పుట్టగన్ + నేర్చును + అటయ్య అంటే వస్తుందా? (రాదు అని అర్థం)
*భావం:*
ఒక మనిషి ఎంత విద్వాంసుడైనప్పటికీ, విద్యలోని సారాన్ని కొద్దిగానైనా గ్రహించకపోతే అటువంటి విద్య ఎందుకూ పనికిరాదు. ఆ విద్యను పండితులైనవారెవ్వరూ మెచ్చుకోరు. నలమహారాజులాగ వంట చేసినప్పటికీ అందులో ఉప్పు వేయకపోతే ఆ కూరకు రుచి కలగదు.
చేసే పని సక్రమంగా ఉండాలి. అప్పుడే దానికి పండితులనుంచి, మేధావుల నుంచి తగిన గుర్తింపు వస్తుంది. అంతేకాని, పనిని మొక్కుబడిగా చేయటం వల్ల దానికి గుర్తింపు రాదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
No comments:
Post a Comment