ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! ఋషుల సత్సంగము అవసరం అంటారా!
మహర్షి :
అవసరమే. సత్సంగం అంటే సత్యముతో కలసి ఉండటం అని అర్థం. అది అందరికీ సాధ్యం కాదు. అందువల్ల వారు గురువుతో కలసి ఉండాలి. అనేకరకాల ఆలోచనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఋషులతో కలసి ఉండవలసిన అవసరముంది. ఋషి ఇటువంటి మానసిక స్థితిని దాటి ప్రశాంతంగా ఉంటాడు. ఋషుల సమీపాన ఉండటం వల్ల ఇతరులకి కూడ ఆ స్థితే కలుగుతుంది. లేకపోతే ఋషుల సామీప్యాన్ని కోరుకోవటంలో అర్థం ఏముంది!
**
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ధ్యానం అంటే ఒక ఆలోచన(దైవం, ఆత్మ)ను అంటి పెట్టుకోటం. ఒకే చింతన ఇతర ఆలోచనలన్నిటినీ దూరం చేస్తుంది. విక్షేపము (కదలిక) మనోదౌర్బల్యం కనుక ధ్యానం వదలకుండా చేస్తే మనస్సు దృఢపడుతుంది. ఆలోచనలులేని శుద్ధస్థితిలో మనస్సు, ఆత్మయే.
***
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! మహర్షి సన్నిధిలో ఎప్పుడూ శాంతి ఉంటుంది; కాని అది మాలో కొద్దికాలమే ఉంటుంది. మాలో శాంతి శాశ్వతంగా ఉండదు. ఎందుకని?
మహర్షి :
శాంతియే నీ నిజమైన స్వభావము. శాంతియే నిజమైన భక్తి, యోగము, జ్ఞానము. అభ్యాసం వలనే శాంతి లభిస్తుందని మీరు అనవచ్చు. అభ్యాసంలో ఇట్టి తప్పు భావాలు వదలిపోతాయి, అంతే. నీ యధార్థ స్వరూపం నిలిచే ఉంటుంది.
*
ఓం శ్రీ రామలాల పరబ్రహ్మణే నమః
నరసింహ యోగీంద్రులు :
మా గురుదేవులు (శ్రీ రామలాల మహా ప్రభువులు) ఇలా సెలవిచ్చారు :
సమాధి స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలు, ఆత్మ స్వరూపంలో నిష్ఠం అయి ఉంటాయి. ఆత్మ స్వరూపమే పరమాత్మ స్వరూపం కనుక పరమాత్మ యందు నిష్టమైన ప్రాణాలు పరమాత్ముని వల్ల స్వయం పోషకత్వాన్ని పొందుతాయి. సర్వఫలప్రదాత పరమేశ్వరుడు కాబట్టి సమాధిలో ఉన్నపుడు ప్రాణాలు రక్షింపబడటానికి వేరే పదార్థాలు అవసరం లేదు.
**
ఓం నమో భగవతే రామకృష్ణాయ
శారదామాత తమ్ముడు :
అక్కయ్యా! నువ్వు ఎవరికో కలలో కనిపించి మంత్రోపదేశం చేసినట్లూ, ఆ వ్యక్తి ముక్తి పొందుతాడని ఆశీర్వదించినట్లు విన్నాను. మమ్మల్ని నీ ఒడిలో ఎంతో ప్రేమతో చేరదీసి పెంచావు. మేము సదా ఇలాగే ఉండిపోవాలా! మేము ముక్తులము కాలేమా!
శారదా మాత :
గురుదేవుల(శ్రీరామకృష్ణులు) ఇష్టం మేరకే ఏదైనా అంతా జరుగుతుంది. నాదేముంది కనుక! శ్రీకృష్ణుడు, గోపబాలురతో ఆడుకొన్నారు; వారితో నవ్వుతూ తిరుగాడారు; వారితోపాటు భుజించారు; ఎంతో ఆప్యాయతతో సన్నిహితంగా మెలగారు. కానీ శ్రీకృష్ణుడు ఎవరో ఆ గోపబాలురు ఎంతవరకు ఎంతమంది గ్రహించగలిగారు!
No comments:
Post a Comment