సామవేదం షణ్ముఖశర్మగారు-
రాముడేలిన నేల
```
ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరిక దేశం భారతదేశం.
మానవుడి మొదటి సాహిత్యంగా చరిత్రకారులు అభివర్ణిస్తున్న ఋగ్వేదం మన పుణ్యభూమి ఫలం.
క్రమబద్ధమైన నగర పట్టణ గ్రామాది నివాస వ్యవస్థ, మానవ సంబంధాల మర్యాదలను పటిష్ఠపరచిన కుటుంబ సామాజిక వ్యవస్థ- ప్రథమంగా ప్రధానంగా దృఢంగా పదిల పరచిన ఘనత మన ప్రాచీన సనాతన భారతీయ హిందూ సంస్కృతిదే.
దీనికి ప్రమాణాలుగా మన రామాయణ భారతాది గ్రంథాలు పరిశీలిస్తే ఎన్నో విషయాలు తేట పడతాయి.
రాజ్య విధానం, దేశస్వరూపం రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. నాటి రాజులు భూమిలో జలవ్యవస్థను, సస్య భూములను పరిరక్షించారు. తాత్కాలిక లాభాల కోసం శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీయలేదు. తమ భోగాల కోసం ప్రజాక్షేమాన్ని భంగపరచలేదు. బాలకాండ, అయోధ్యకాండలోనే నాటి దశరథుని పాలనా స్వరూపాన్ని వాల్మీకి హృద్యంగా వర్ణించాడు.
తన పితృ పితామహులు పాటించిన ధర్మ విధానాలతో భరతుడు, శ్రీరాముడు పాలన చేశారు. నాటి దేశం ఎలా ఉందో - రాముని మాటల్లో-
’కచ్చి చ్చైత్య శతైర్జుష్టః సునివిష్ట జనాకులః౹
దేవ స్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోప శోభితః౹౹
ప్రహృష్టనర నారీకః సమాజోత్సవ శోభితః౹
సుకృష్ట సీమా పశుమాన్ హింసాభిః పరివర్ణితః౹౹
అదేవ మాతృకో రమ్యః శ్వాపదైః పరివర్జితః౹
పరిత్యక్తో భయైః సర్వైః ఖనిభిశ్చోపశోభితః॥
వివర్జితో నరైః పాపైర్మమ పూర్వైః సురక్షితం౹
కచ్చిజ్జన పదః స్ఫీతః సుఖం వసతి రాఘవః౹౹
- చైత్య శతాలతో కూడినది.
విశాలమైన రాతికట్టడాలను 'చైత్యం' అంటారు. అలాంటి వందలాది పెద్ద భవనాలతో కూడినది. మరొక అర్థంలో - సరిహద్దు రాళ్ళతో కూడినది. భూముల సరిహద్దును పద్ధతి ప్రకారం నిర్దేశించే రాళ్ళు ఉన్నాయని అర్థం. చక్కగా నివసిస్తున్న జనులు కలది. నాటి ప్రజలు తమ నివాసాలలో సర్వ సౌకర్యాలతో సౌఖ్యాలతో ఉన్నారు.
దేవస్థానాలతో ఉన్నది. రామాయణ కాలం నాటికి (లక్షల సంవత్సరాల క్రితమే) ఈ దేశంలో దేవాలయాలు ఉండేవని రామాయణంలోనే అనేక చోట్ల కనబడుతోంది. ప్రజల దాహార్తిని తీర్చడానికి మార్గ మధ్యంలో చల్లని నీటి సదుపాయాలున్నవి విశాలమైన మంచినీటి చెరువులతో ప్రకాశిస్తున్నది.
ఎప్పుడూ పరమ సంతోషంతో ఉన్న స్త్రీ పురుషులు కలది. సంతోషం గొప్ప సంపద. మంచి సంస్కారాలున్న మనసులు సంతృప్తిగా ఉంటాయి. చక్కని పాలన ఉన్నప్పుడు స్త్రీ పురుషులందరూ సకల సంతోషాలతో ఉంటారు. సమాజం చక్కని ఉత్సవాలతో సందడిగా ఉన్నది. వేడుకలు జరిగే వేళలు ఎక్కువ. సంపత్సమృద్ధికీ, సామాజిక సామరస్య జీవనానికి సంకేతాలు.
మంచి వ్యవసాయం కలిగిన భూములున్నది. ఈ దేశం అనాదిగా కృషి ప్రధానదేశం. అందుకే ఆ రోజుల్లోనూ రైతులకు ప్రాధాన్యాన్నిచ్చారు. పద్ధతి కలిగిన కృషితో సారం తగ్గకుండా భూమిలో మంచి పంటల్ని పొందేవారు - అనే విషయం ఇటువంటి వాక్యాలలో రూఢి అవుతోంది.
వ్యవసాయానికీ, పాడికీ సహకరించే మంచి పశు సంపద కలది. గోమహిష్యాది, వృషభ మహిషాది పశు సంతతి పుష్టిగా కలిగినది. హింసలు లేనిది. మాటలతో, ఆలోచనలతో, చేతలతో ఒకరినొకరు హింసించుకోని దేశం.
(ఈ కారణంగానే “హిం” సకి “దూ” రంగా ఉండేవాడు “హిందూ” అని కొందరు చమత్కరించారు).
హత్యలు, దాడులు ఈ దేశానికి స్వాభావికంగా లేవు.
కేవలం వర్షం మీదనే ఆధారపడనవసరం లేని భూములు. అంటే - చక్కని జల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న విధానాలు నాడు ఉండేవి. క్రూర జంతువుల వలన భయం లేనిది. రమ్యమైనది.
ఎక్కడికక్కడ సౌందర్యాలు కలది. శుభ్రత వలన, ప్రకృతి రమణీయత వలన, చక్కని భవన గృహ నిర్మాణాల వలన దేశానికి అందం వస్తుంది. ఆ అందం అడుగడుగునా కలిగినది.
ఒక ప్రణాళికా బద్ధంగా భవనాదుల నిర్మాణం జరిగేదనీ, ప్రతి ఇల్లూ వృక్షలతాదులతో, పచ్చికతో అలరారుతుండేదనీ ఈ కావ్యంలో అనేక చోట్ల వర్ణించారు. కొన్ని చోట్ల వివిధ అంతస్తులు, మరికొన్ని తావులు ప్రత్యేక గృహాలు, విహార గృహాలూ... ఒక పద్ధతిగా నిర్మించారని వివరించారు.
నివాస ప్రాంతాలలో హింసాకారక జంతువుల బెడద లేదు. జనులెవరికీ ఎవరి వలనా భయం లేదు.
ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయభ్రాంతమయ్యే జీవనం ఆ రోజుల్లో భారతదేశంలో లేదు.
సమృద్ధి కలిగిన గనులు మిక్కుటంగా కలిగినది. ప్రజలు నేరాలు, దోషాలు చేసే ప్రవృత్తి కలవారు కాదు. పాపచింతన కూడా లేని సంస్కారవంతులు.
- ఇలాంటి నా దేశం, నా పూర్వీకులు ధర్మబద్ధంగా రక్షించిన పావనదేశం సుఖంగా, సర్వతోవికాసంగా ఉంది కదా" అని శ్రీరాముడు అరణ్యవాస సమయంలో తనవద్దకు వచ్చిన భరతునితో అన్నాడు.
దీనినిబట్టి నాటి మన దేశం ఎలా ఉండేదో అర్థమౌతుంది. శ్రీరాముని పూర్వీకులు ఈ ధరణిని అంత చక్కగా ఏలారు. భరత వర్ష సౌభాగ్యం యుగాల క్రితం నుండి దివ్యంగా ఉండేదని ఈ మాటల్లో విశదమౌతుంది. మన భారతదేశం మళ్ళీ మనకి లభిస్తుందా? శ్రీరాముడు ముల్లోకాలనీ కాపాడిన అవతార పురుషుడు భారతదేశం భూములు మాత్రం రామునికి పూర్వం నుండి సుధర్మ భరితంగానే ఉండేది.
రాముడు పట్టాభిషిక్తుడయ్యాక ఈ పాలనా విధానాన్నే కొనసాగించాడు.
అయితే ధర్మ పాలన వల్ల వైపరీత్యాలు లేవు - అనే విషయం రామరాజ్య వర్ణనలో కనిపిస్తుంది.
"స్త్రీలకు వైధవ్యం లేదు. రోగాలు లేవు. అతివృష్టీ అనావృష్టి లేదు. సకాలంలో వానలు కురుస్తున్నాయి. వృద్ధాప్యం రాకుండా ఎవరూ మరణించడం లేదు. భూమి పుష్కలంగా పంటలనీ, ఓషధులనీ అనుగ్రహిస్తోంది.
శ్రీరామునే స్మరిస్తూ అయోధ్య రామమయమయింది. “రామునే చూస్తున్న ప్రజలలో హింసా ప్రవృత్తి కలగడం లేదు" అని వాల్మీకి వర్ణించారు.
'రామునే చూడడం'- అంటే రాముని వ్యక్తిత్వాన్నీ, చారిత్రాన్నీ పరిశీలించడం - అనే అర్థాన్ని మనం గ్రహించవచ్చు.
హింసా లక్షణం లేని శాంతియుత సౌభాగ్య దేశంగా మన భారతభూమి వర్ధిల్లాలంటే రామాయణం మనకు పారాయణం కావాలి.✍️```
No comments:
Post a Comment