Sunday, March 30, 2025

 తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడు. 1913లో వారు వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేసిన 
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి జన్మదిన జ్ఞాపకం !

       🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్య దేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మల్లించారు.
......
అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.
......
సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరీ పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశు కవితాజంట
విన్యాసాలు స్వత:రసదౄష్టి పెరిగినా, ఆశుకవితల
మీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది. న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కౄతిని 'లలితా(1909)గా, టెన్నిసన్క్ రచన - 'డోరా'ను 'అనుమతీ(1910) లఘుకావ్యంగాను, 'తౄణకంకణం' (1912) నూతనరచనలను సౄష్టించాలని సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది. మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలీ, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు. విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు.  వీరి కావ్యాలు మొదటదశలో ఎవరి దౄష్టిని ఆకర్షించలేదు.  కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు. ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకౄతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది. ఈ యితివౄత్తంతో నవీనశైలితో  పద్యకావ్యం  రాయప్రోలుకు కలిగిన నూతనదౄష్టితో వంగదేశం వలసపోయారు. విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు. కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళీ అవతరణకు దారితీసింది. ఈ ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హౄదయములను చేల్చి చదవమనీ సదయులందరికి సందేశాన్నిచ్చారు.

• భావం + కవిత్వం = రాయప్రోలు....

భావం లేనిదే కవిత్వమే లేదు. కవిత్వమెక్కదుంటుందో భావమక్కడే వుంటుంది.  ఆక్షేపకులు  రెండు కళ్ళు మూసుకుని, భావకవిత్వంలోని భావాన్ని ఒకకంటితోనూ, కవిత్వాన్ని రెండో కంటితోనూ, చూడడం పరిపాటే. పూర్వసాహిత్యంలో రసధ్వని, భావధ్వని వుండడం సహజసత్యం. నిజానికి భావకవిత్వంలో అభినయార్ధతత్వం అంతర్లీనంగా వుంటుంది. హస్తం, దౄష్టి, మనస్సు, భావం, రసం కళకు సల్లక్షణాలు. ఏ భాషలోనైనా కవిత చెప్పదలచుకొన్నారంటే మాటలతోనే చెప్పాలి. భావం కొత్తదైనప్పుడు భాషలోనున్నపదాలు భావం చెప్పడానికి చాలనప్పుడు ఉన్న మాటలతోనే కొత్త పదచిత్రాలు కట్టుకోవాలి. అయినా చెప్పలేకపోతున్నామనే బాధ కవికి కలుగుతుంది అని వివరిస్తూ, విశ్వనాధ - 'అస్మదీయ కంఠము నందాడు చుండెనొక ఎదోగీతి బయటకు నుబికి రాదు, చొచ్చుకొని లోనికిని పోదు ద్రచ్చిపోయె, నాహౄదయమమీ మహా ప్రయత్నమందు" అంటారు. వివిధ విఫలయత్నాలలోనే హౄదంతరంలో నవజపాశోణ సంధ్య తోచిందని, వాంచాసిద్ధి క్రమంగా సిద్ధిస్తుందని చెప్పాడు. 
.......
రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీతి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉంది. అని వ్రాశారు....

• ఉదాహరణలు....

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట
అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు

ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు
తృణ కంకణమునుండి:

అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునను వసియించియున్న
దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!

• భావకవితాధారకు పాదులు పోసిన కవిరాయడు....
 
ఆధునిక కవిత్వానికి ముఖ్యంగా భావకవిత్వానికి ఆంగ్లసాహిత్య పరిచయం వల్లనే ప్రోద్బలం వచ్చిందని నిస్సందేహంగా ఆనాటి కవులు భావించారని, భావకవిత్వం రావడానికి కారకుల్లో రాయప్రోలువారు, వారి 'తౄణకంకణం' అని  ఆరుద్ర వివరించడం.భావకవుల్లో ప్రముఖులైన వారంతా 1891-1900 మధ్య జన్మించిన వారు, 1919 నాటికి భావకవిత్వం అందరి నోళ్ళలో పడిందని, ఈ బౄందంలోని ప్రధమశ్రేణి కవుల్లో రాయప్రోలు వారు ప్రధముల్లో ప్రధములు అనికూడ ఆరుద్ర అభిప్రాయపడ్డారు. ఈ బ్రందం మీదనే, సనాతనుల తిట్లూ, సమకాలిక సహౄదయుల దీవనలూ వర్షించబడ్డాయి. వీరందరి సమగ్రకవితాదర్శనం వల్లనే భావకవిత స్వరూప ప్రభావాలు అంచనా వేయబడడం సాధ్యమైనాయి అని పలువురి భావన. ఈ అష్టాదశకవిబౄందానికి భావకవిత్వానికి ప్రాతినిథ్యం వహించి 'ముద్దుకౄష్ణా 'వైతాళికులూ ఖంఢకావ్యసంపుటం  ప్రచురించాడు. యిందులో గురజాడ (1865) ప్రాచీన సరణికి భరతవాక్యం పాడితే, శ్రీశ్రీ (1910)  నవీన సరణికి నాందిగీతం పాడి, అభ్యుదయ, విప్లవ మార్గాలకు వరుసగా ప్రాతినిథ్యం వహించారు.

• అమలిన ప్రేమ.....
 
'తౄణకంకణం' అమలినప్రేమాంశం ప్రముఖం. రాయప్రోలు వారి ప్రయోగాలు అనుభవభరితాలు. మచ్చుకు కొన్ని :
'గుణలతలు పూచిన శోభలూ, 'చిరునవ్వులు వెన్నెలచెండ్ల విసరా, 'చూపులు వలపుటుచ్చులూ, 'ప్రేమ భావనల్ నూత్న కళలూ, 'నదలు ప్రాయంపు మన్ననలూ, 'కనుల నఋఅవాల్చి పాతితాక్షములతోడ గాంచియును కాంచలేని క్రీగంటకొసలూ, 'చెలిమినాటిన చిత్తమె యార్ద్రమూ.'పడుచుదనముతో చిగురించు వలపులూ. అన్ని అనుభైకవేద్యంబులే. ఈ కావ్యంనిండా దాంపత్యభక్తి, వాత్సల్యరక్తి, సఖ్యసక్తి, ముక్తి సోదాహరణంగా రసానుభూతిని కలిగిస్తూ, అందించారు.

• కవిభావదర్శనం....
 
భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే.  భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యం. 
 
"కవేర్భావ: కవిత్వం" - భావప్రధానం కవిత్వం భావ కవిత్వం. "కవిర్భా: కవిత్వం" - కవిత్వానికే కావ్యం. "నానౄషి: కురుతే కావ్యం" - ౠషి కానివాడు కావ్యం చేయడు". "కవయ: క్రాంత దర్శన:" అని లోకోక్తి. ౠషి ద్రష్ట. దర్శనశక్తి కలవాడు. ఏమిటి దర్శించగలడు? దేన్ని దర్షించిన తర్వాత ఏం చేస్తాడు" తనకు కావలసిన రీతిలో విశ్వాన్ని చూస్తాడు. భావిస్తాడు. భావనం చేస్తాడు. కవి కనుక కవనం చేస్తాడు.  విశ్వాన్ని పరివర్తన చెందేటట్లు మాంత్రికశక్తిని వినియోగిస్తాడు. కవి కూడ మాంత్రికుడే. భావకవి భావాన్ని మంత్రీకరిస్తాడు. భావేంద్రజాలాన్ని, కవితేంద్రజాలాన్ని జోడిస్తారు.

మహమ్మద్ గౌస్ 

        🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

No comments:

Post a Comment