Sunday, March 2, 2025

 *ఈరోజు పురాణ కథ రావణుఁడు గురించి:*

రాక్షసుల రాజు. ఇతని రాజధాని లంక. తండ్రి పులస్త్యుని కొడుకు అగు విశ్రవసుఁడు. తల్లి సుమాలి కూఁతురు అగు కైకసి. భార్య మయుని కూఁతురు అగు మందోదరి. సోదరులు కుంభకర్ణ విభీషణులు. కొడుకులు ఇంద్రజిత్తు మొదలగువారు. ఇతనికి పదితలలు ఉండుటచే దశకంఠుఁడు, దశగ్రీవుఁడు అను నామధేయములు కలిగెను. మఱియు ఇతఁడు మహత్తరము అగు తపము సలిపి బ్రహ్మవలన తనకు మనుష్యులు తక్క తక్కినవారిచే చావు లేకుండ వరము పొంది ఆ వరప్రభావముచే మిగుల గర్వితుఁడు అయి త్రిలోకములయందు ఉండు సాధువులను, ఎల్లవారిని మిగుల హింస పెట్టుచు ఉండెను. ఆ హింసలకు ఓర్వఁజాలక మునులును దేవతలును బ్రహ్మచెంతకు పోయి మొఱలిడిరి. అప్పుడు బ్రహ్మ వారిని పిలుచుకొని పాలసముద్రమున ఉండు విష్ణువు దగ్గఱకు పోయి ప్రార్థింపఁగ అతఁడు మనుష్యరూపమున శ్రీరాముఁడు అనుపేర భూమిని అవతరించి ఈరావణుని చంపెను. 
ఈ రావణుఁడు దిగ్విజయముచేయ బయలుదేఱినపుడు తొలుత కుబేరునితో తలపడి యుద్ధమునందు జయము పొంది అతని విమానము అగు పుష్పకమును అపహరించుకొని దానిపై ఎక్కి సంచరించు తఱిని అది కైలాసగిరి సమీపమున నిలుపఁబడఁగా అందులకు కారణము విచారించి శివుని మహిమ అని నంది వలన ఎఱిఁగి నావిమానమును అడ్డగించిన శివుని కొండతోడ ఎత్తిపాఱవైతును కాక అని కైలాసమును పెల్లగించి చెండాడినట్టు ఎగరవైవ ఆరంభించెను. అప్పుడు ఆకొండపై ఉన్న శివుఁడు తన కాలి పెనువ్రేలితో ఆకొండను అదుమఁగా వీనిచేతులు దానిక్రింద చిక్కుకొని ఊడతీసికొన కూడక పోయెను. ఆ బాధచే వీఁడు చిరకాలము గొంతెత్తి ఏడ్చి ఏడ్చి కడపట శివుని పలుదెఱుఁగుల నుతించెను. అంత అతఁడు కరుణార్ద్రచిత్తుఁడు అయి తన కాలివ్రేలిని ఎత్తఁగా వీఁడు తన చేతులను ఊడ తీసికొనెను. ఇట్లు ఆ కొండక్రింద చేతులు తగులుకోఁగా వీఁడు గొప్పధ్వనితో రోదనముచేసి నందున వీనికి రావణుఁడు అనుపేరు కలిగెను.

ఇది కాక ఈరావణుఁడు ఒకానొకప్పుడు వాలితో యుద్ధము చేయ కోరి కిష్కింధకు పోయి అచట వాలిని కానక అతఁడు దక్షిణ సముద్రమునకు స్నానార్థము పోయి ఉన్నాఁడు అని విని అచటికి పోయి చూచి సంధ్యవార్చుచు ఉన్న అతని వెనుకప్రక్కచేరి మెల్లమెల్లఁగా పట్టుకొన యత్నింపఁగా, అతఁడు అది తెలిసికొని రావణుని చేతులు తన సందిట చొప్పింపఁబడునంతవఱకు కదలక మెదలక ఉండి సందిట అదిమి పట్టుకొని నాలుగు సముద్రములయందు ముంచి అలయించి పిమ్మట ఏమి ఎఱుఁగని వానివలె దిగవిడిచి దశగ్రీవా ఎక్కడనుండి వచ్చితివి అని పరిహసించెను. అంతట రావణుఁడు లజ్జితుఁడు అయి అతనితో స్నేహముచేసి ఆవలపోయెను.

మఱియొక సమయమున కార్తవీర్యార్జునునితో పోరాడవలెనని పోయి అతనిచేత చెఱసాలలో ఉంచఁబడెను. 

మఱియు ఈరావణుఁడు స్వర్గముమీఁద దండెత్తిపోవుచు మేరుపర్వతపు నెత్తమునందు దండుతోడ విడిసి ఆదారిని నలకూబరుని ఒద్దకు పోవుచు ఉన్న రంభను బలాత్కారముగా పట్టి రమించి విడిచెను. ఆ వృత్తాంతము నలకూబరుఁడు తెలిసికొని రోషాయత్తచిత్తుఁడై రావణుఁడు రంభను పట్టినట్టు ఇఁకమీఁద బలాత్కారముగా ఏయాఁడుదానినైన పట్టెనేని వానితలలు అప్పుడే వేయి వ్రక్కలు అయి చచ్చును గాక అని శపించెను.

ఇంతేకాక ఈరావణుఁడు దేవేంద్రునితో యుద్ధముచేయునపుడు ఇంద్రుని ఏనుఁగు అగు ఐరావతము తన కొమ్ములతో వీనిఱొమ్మున క్రుమ్మఁగా ఆకొమ్ములు తునిఁగి పోయెను. కనుక వీఁడు మిగుల దృఢమైన దేహము కలవాఁడు అని ఊహింప వలయును. వెండియు ఇతనికి బ్రహ్మవరప్రభావముచేత కడుపున అమృతకలశము ఒకటి కలిగి ఉండుటచే వీనితలలు ఎన్నిమాఱులు నఱికినను మరల మరల మొలచుచు ఉండును. ఆసంగతి విభీషణునికి తెలియును కనుక అతఁడు చెప్పఁగా రాముఁడు ఆయమృతకలశమును భేదించి తలలు నఱకఁగా వీఁడు చచ్చెను.

No comments:

Post a Comment