(297) (13.06.2025)
ఎక్కడో ఓ మారుమూల పల్లె నుంచి ఈ పట్టణానికి వచ్చినాను
ఈ పట్టణంలో ఓ చిన్న కొలువులో చేరినాను
అనుకోకుండా మన ఇద్దరికి పరిచయం అయింది
ఆ పరిచయం మూడు ముళ్ళకు దారి తీసింది //
పెళ్ళైన కొత్తల్లో ఎన్నో-ఎన్నెన్నో ఇబ్బందులు పడినాము
నీ-నా వాళ్ళను ఎవరిని సహాయము చేయమని అడగకున్నాము
మన రెక్కల కష్టంతో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాము
మనం ఇద్దరము – మనకు ఇద్దరు అంటూ ఉంటున్నాము //
కడుపున పుట్టిన బిడ్డలను చదివించుకుంటూ
మనకు ఉన్న దానిలోనే కలో-గంజో తింటూ
పిల్లలను వృద్ధిలోనికి తెచ్చినాము
ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంటున్నాము //
పెళ్ళిళ్ళు – కాపురాలు అంటూ వాళ్ళు వేరు కాపురం పెట్టగా
మరల మన మిద్దరము ఒంటరి అవగా
నాటి కొత్త కాపురం కబుర్లు ప్రతి రోజూ గుర్తు చేసుకుంటున్నాము
సాయంత్రం పూట సమయాన్ని ఆనందంగా గడిపేస్తున్నాము //
ఆనందంగా నడుస్తున్న పడవ ఓక్కసారిగా ఊగిస లాడింది
నీకు క్యాన్సర్ అన్న విషయం డాక్టర్ చెపితే తెలిసింది
ఇది నీకు ఆఖరి స్టేజ్ అని
రోజులు దగ్గర పడుతున్నాయని
గుండె ఆగిపోయే వార్త ఒకటి చెప్పినారు
బంధు-మిత్రులకు కబురు పెట్టుకోమన్నారు //
ఏన్నో ఏళ్ళ తరువాత మనకు ఇపుడే ఏకాంతము లభించింది
మన ఇద్దరికి ఒంటరిగా గడిపే సమయం దొరికింది
ఇపుడే ఈ విషాదకర వార్త మన చెవిన పడింది
మన ఇద్దరి ఆనందం ఆవిరి అయింది //
మనము ఏదేదో ఊహించుకుంటే
మనం నమ్మిన ఆ దేవుడు మన తల రాత మారుస్తుంటే
నాడు ఎన్నో కష్టాలు పడ్డాము
నేడు ఆనందంగా ఉండాల్సిన సమయంలో బాధ పడుతున్నాము //
ఈ చివరి క్షణాల్లో నిను కంటి రెప్పలా చూచుకుంటా
నీకు ఎటువంటి కష్టం రాకుండా నీ వెన్నంటి ఉంటా
నీ ఆఖరి క్షణాలు నీవు ఎంతో ఆనందంగా గడపాలి
నీ చిన్ని చిన్ని కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి //
ఎంత ఖర్చు అయినా భరిస్తాను
నీ మనసులోని కోరికలన్నీ తీరుస్తాను
నే కోరు కునేది నీవు ఆఖరి క్షణం వరకు ఎంతో ఆనందంగా ఉండాలి
ఇలా ఆనందంలో ఉండగానే నీవు కను మూయాలి //
ఈ భూమి మీదకు వచ్చినందుకు మరణం తప్పదు
అందులో ఆరోగ్యంగా వెళ్ళిపోవడం అన్నది అందరికి దక్కదు
మన మిద్దరం సునాయాస మరణాన్ని కోరుకున్నాము
ఇలా జరుగుతుందని ఏనాడూ ఊహించకున్నాము //
ఇక నీవు నీ అనారోగ్యం గురించి ఆలోచించకు
నీ మనసులో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు
ఆ భగవంతుడు నాకు నీకు సేవ చేసే భాగ్యం కల్పించినాడు
నాడు నీవు చేసిన సేవకు ఈ విధంగా రుణం తీర్చుకోమన్నాడు //
ఈ రోజు నుంచి నాకు ఎవరితోనూ సంబంధం లేదు
నిను విడిచి ఓ క్షణం కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు
24 గంటలు నీ కనుసన్నలలో ఉంటా
అన్ని పనులు పక్కన పెట్టి నీకు సేవ చేసుకుంటా //
అనుకున్న రోజు రానే వచ్చింది
నా దేవి ఎంతో ఆనందంగా కను మూసింది
ఆఖరి క్షణం వరకూ నేను ఆమెతోనే గడిపాను
ఆమె ఆఖరి కోరిక కూడా తీరుస్తాను //
ఆమె కోరింది ఇంటి ముందు ఓ పాలరాతి విగ్రహాము
ఆపై ఆమె మెడలో ప్రతి రోజూ ఓ పూల హారము
నాలో ఊపిరి – ఓపిక ఉన్నంత వరకు ఆమెకు సేవ చేసుకుంటాను
ఆమె తలంపుతో ఆఖరి క్షణాలు ఎంతో ఆనందంగా గడిపేస్తాను //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment