కావేరి పెళ్ళి
*****
"బావ గారూ! మా అమ్మాయికి పెళ్ళి చేద్దామనుకున్నా. మీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం వుంటే చెప్పండి" అడిగాడు రామారావు తనకు బావ వరుస అయ్యే శంకర నారాయణను.
" నా దగ్గరకు రాకముందు ఏవైనా పెళ్ళి సంబంధాలు చూశార?"అడిగాడు శంకర నారాయణ.
"ఆఁ! పది సంబంధాలకు పైగానే చూశాం. అందులో ఏ ఒక్క సంబంధమూ నచ్చలేదు మా అమ్మాయికి ." అన్నాడు రామారావు.
"అయితే నీకు మా కాలనీలో వుండే రామనాథం గారి కూతురు కావేరీ కథ చెప్పాల్సిందే" అన్నాడు శంకర నారాయణ.
"ఆ కథేంటో చెప్పు బావా! "అడిగాడు రామారావు ఎంతో కుతూహలంతో.
"ఈ రోజుల్లో అమ్మాయిలు తక్కువై, అబ్బాయిలు ఎక్కువ కావడంతో పెళ్ళి మార్కెట్లో అమ్మాయిలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
అయినా పిటీ ఏంటంటే రామనాథం గారి రెండవ అమ్మాయి కావేరీకి ముప్పైఐదు ఏళ్లు దాటిపోయినా ఇంకా పెళ్ళి కాలేదు.
అమ్మాయికి ఏమైనా కాలు వంకరా లేక కన్ను వంకరా అంటే అదేం లేదు. లక్షణంగా వుంది.చక్కని చుక్క. కుందనపు బొమ్మలా అందంగా చూడ్డానికి భలే బావుంటుంది .
చదువు సంధ్యలు ఏ మైనా తక్కువా అంటే అదీలేదు. బిటెక్ చదివి ఓ మల్టీ నేషపల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తోంది.మంచి జీతం. అయినా కావేరి ఇంకా పెళ్ళి కాకుండా కుమారిగానే మిగిలిపోయింది."
"ఎందుకూ?!"అడిగాడు రామారావు ఉత్సుకతో.
"రామనాథం గారికి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి శ్రావణి బీయెస్సీ బీఈడీ చేసి జిల్లా పరిషత్ హైస్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. చిన్నమ్మాయి కావేరి బీటెక్ కంప్యూటర్స్ సైన్స్ చేసి సాప్ట్ వేర్ ఇంజనీరుగా హైదరాబాదులో పనిచేస్తోంది. ఆఫీసుకు దగ్గర్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని తన కొలీగ్ పావనితో కలిసి వుంటోంది.
కావేరీకి ఇరవై మూడేళ్లప్పుడు ఆమె అక్క శ్రావణికి పెళ్ళయింది. బావ చూడ్డానికి ఏమంత అందంగా,అట్రాక్టివ్ గా కనిపించడు.నల్లగా,పొడుగ్గా, గడకర్రలా వుంటాడు. బి.ఎ.చదివి రివెన్యూ డిపార్ట్ మెంట్ లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు.
బావను చూడగానే 'అక్కయ్యకి బావగారు ఎలా నచ్చారో ఏమో!అమ్మానాన్నల మాట కాదనలేక చేసుకున్నట్టుంది. నేనైతేనా ఇలాంటి వాణ్ణి చేసుకోడానికి ఒప్పుకునేదాన్నేకాదు.' అనుకుంది మనసులో.
కావేరి తన అందచందాలు, చదువు,ఉద్యోగం చూసుకొని తెగ మురిసిపోతూ 'అక్క మాదిరి అందంగా లేనివాడిని పెళ్ళి చేసుకోకూడదని, స్మార్ట్ గా, హాండసమ్ గా వున్న వాడిని, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసేవాడిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని గట్టిగ నిర్ణయించుకుంది.
ఆశయం మంచిదే. ప్రతి ఆడపిల్లా తన పెళ్ళికి ముందు కోరుకునేదే !కానీ ,పెళ్ళి విషయంలో కాస్త పట్టు విడుపులు వుండాలని, పెద్దలమాట వినాలనే తత్వం కాదు కావేరిది.
పెద్దమ్మాయి శ్రావణికి పెళ్ళి చేసిన ఏడాది తర్వాత కావేరి పెళ్ళి చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు.
పిల్ల అందంగా వుండి బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా మంచి కంపెనీలో పనిచేస్తుండటముతో చాలా మంది అబ్బాయిల తల్లిదండ్రులు కావేరిని తమ కోడలిగా చేసుకోవడానికి ముందుకొచ్చారు.
మొట్ట మొదటి సారి ఎంటెక్ చదివి ,ఎంబీయే చేసి ఓ మంచి మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో వున్న అబ్బాయి తన తల్లిదండ్రులుతో కలిసి పెళ్ళిచూపులకు వచ్చాడు.
'అబ్బాయి మంచివాడు. బుద్ధిమంతుడు,గుణవంతుడు. మంచి ఫామిలీ. మేము అన్నీ విచారించాము. చేసుకో. సుఖపడతావు.' అని తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా వినక...
"అబ్బాయి అందంగాలేడు. నల్లగా,లావుగా వున్నాడు. నేనేమో తెల్లగా అందంగా వున్నా. నా పక్కన అతడు 'కాకి ముక్కుకు దొండ పండులా వుంటాడు'. నే చేసుకోను ."అని తెగేసి చెప్పి రిజెక్ట్ చేసింది.
అమ్మాయి అందమైన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటోందనుకొని కావేరి తల్లిదండ్రులు ఈ సారి బాగా అందంగా వున్న అబ్బాయి వాళ్లను పెళ్ళి చూపులకు ఆహ్వానించారు.
"అబ్బాయి స్మార్ట్ గా హాండసమ్ గా బాగున్నాడు కానీ బిఎ చదివాడు. నాకంటే తక్కువ. పైగా అబ్బాయి స్టేట్ గవర్నమెంట్ లో గుమాస్తా. చాలా చిన్న ఉద్యోగం. జీతంకూడా తక్కువ. నాకొచ్చేదాంట్లో సగం కూడా రాదు. నా స్టేటస్సు,లెవెలు ఎక్కడ? అతని స్టేటస్సు,లెవెలు ఎక్కడ?నాకు ఏ విధంగానూ సరితూగడు. అందుకని ఈ అబ్బాయిని చేసుకోను "అని రిజెక్ట్ చేసింది.
ఇలా తల్లిదండ్రులు తెచ్చిన చాలా సంబంధాలు అబ్బాయి బాగలేడని,చదువు తనకంటే తక్కువని,ఉద్యోగం చిన్నదని, జీతం తక్కువని,తన స్టేటస్ కి సరితూగడని వంకలు పెడుతూ రిజెక్ట్ చేసింది .
కావేరితో కలసి ఫ్లాట్ లో వుండే పావని ఆఫీసులో కావేరికంటే ఐదేళ్లు సీనియర్.అందంగా బావుంటుంది. కావేరి పెళ్ళి చూపులకు వెళ్ళొస్తున్న సంగతి, తల్లిదండ్రులు చూపిన పెళ్ళి సంబంధాలు రిజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసి ఒక రోజు కావేరితో....
"కావేరీ ! నీకు నా కథ చెప్పాలని వుంది. వింటానంటే ఇన్నాళ్ళూ చెప్పని నా పర్సనల్ విషయాలు చెప్తాను. వింటావా?"
"ఎందుకు వినను? చెప్పు...చెప్పు...వింటా!"అని ఎంతో కుతూహలంతో అడిగింది కావేరి.
మాది వైజాగ్. నేనక్కడే బీటెక్ చదివా. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోస్టు వస్తే వచ్చి చేరా. కొత్తలో అమీర్ పేట దగ్గర ఓ లేడీస్ హాస్టల్లో వుండేదాన్ని.
ఓ అబ్బాయి మా పక్క వీధిలో వుండే వాడు. అతడు మా హాస్టలు మీదుగా నడుచుకుంటూ వెళ్తూ అమీర్ పేటనుంచి హైటెక్ సిటీకి వెళ్ళేవాడు. అతను,నేను హైటెక్ సిటీకి వెళ్ళేప్పుడు, వచ్చేప్నుడు, బస్టాపులో కలిసేవాళ్ళం .అతను చాలా స్మార్ట్ గా, హాండసమ్ గా వుండేవాడు. కొన్ని రోజులు గడిచాక నాతో చిన్నగా మాటకలిపి పరిచయం చేసుకున్నాడు. చాలా సరదాగా మాట్లాడేవాడు. నాకూ అతన్ని చూడాలని, అతన్తో మాట్లాడాలని వుండేది. మాటల్లో తనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌నని చెప్పాడు. కొన్నిరోజుల తర్వాత అతను బిసి అని తెలిసింది. నేనేమో ఓసి.అయినా నాకెందుకో అతనంటే ఇష్టం ఏర్పడింది. ఇద్దరం ప్రేమలో పడ్డాం.
ఈలోపు మా తల్లిదండ్రులు ఓ పెళ్ళి సంబంధం తెచ్చారు. అతను మా చుట్టాలబ్బాయి.స్కూలు టీచర్. మనిషి చూడ్డానికి మామూలుగా వుంటాడు. పెద్ద అందగాడు కాదు.నేనతన్ని హైదరాబాద్ లో నాకు పరిచయమైన అబ్బాయితో పోల్చుకొని చూసి ఔట్ రైట్ గా రిజెక్ట్ చేశా.
మా వాళ్లు వాళ్లది మంచి ఫామిలీ అని, అబ్బాయి గుణవంతుడని, ఏ దురభ్యాసం లేదని, చేసుకుంటే సుఖపడతానని, బాగుంటుందని పరి పరి విధాలుగా చెప్పి చూశారు. అయినా ససేమిరా అంటూ ఒప్పుకోలేదు.
ఓ మూడు నెలల తర్వాత ధైర్యంచేసి కులాంతర వివాహమైనా నాకు పరిచయమైన అబ్బాయిని రిజిష్టర్ మ్యారేజి చేసుకున్నా. మా వైపు వాళ్లు, వాళ్ల వైపు వాళ్లు ఎవ్వరూ రాలేదు. మమ్మల్ని వెలేసినట్టు బాయ్ కాట్ చేశారు. అయినా మేముకూడా వాళ్ళనెవ్వర్నీ పట్టిచ్చుకోలేదు.
కొత్త దంపతులం ఓ సంవత్సరం రోజులు చాలా హ్యాపీగా గడిపాం. 'పెళ్ళి చేసుకుంటే ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగావుంటుందా'అని అనుకునేదాన్ని. ప్రెగ్నెంటయ్యా. ఓ అమ్మాయి పుట్టింది. అయినా మా వైపు వాళ్లు కానీ వాళ్ల వైపు వాళ్లు కానీఎవ్వరూ రాలేదు .మమ్మల్నెవరూ పట్టిచ్చుకోలేదు.
పాపకు ఏడాది వచ్చేసరికి మావారి గురించి ఒకటొక్కటిగా తెలిసి రాసాగాయి.
ఆయన ఓ పెద్ద అబద్ధాలకోరు. తను సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌నని అబద్ధం చెప్పాడు. ఏ ఇంజనీరూ కాదు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అటెండర్.ఇంటర్ ఫెయిలయ్యాడు. పెద్ద తాగుబోతు. తిరుగుబోతు. నెల కాగానే మొత్తం జీతం తనకివ్వమనేవాడు. ఇవ్వకపోతే నానా రభస చేసేవాడు.రోజూ తాగొచ్చి, అల్లరిచేస్తూ చేయి చేసుకొనేవాడు. కొత్తలో పెళ్ళయ్యాక సంవత్సరందాకా ఎంత హ్యాపీగా గడిపానో ఆ తర్వాత వందరెట్లు దుఃఖము,బాధ అనుభవించా.
ఆ టైములో మా పుట్టింటి వాళ్లుగానీ, అత్తారింటి వాళ్ళుగానీ ఎంత వేడుకున్నా దగ్గరకి రానీయలేదు. పైగా బోలెడు దుర్భాషలాడారు.
తర్వాత రోజు రోజుకు ఇంట్లో నరకంగా వుండేది. బాగా తాగొచ్చి, బండ బూతులు తిడ్తూ చేత్తో, కాల్‌తో తన్నేవాడు. ఓ రోజు వాడు పెట్టే బాధలు భరించలేక గృహహింస కేసు పెట్టా .తర్వాత సీరియస్ గా ఆలోచించా. గౌరవప్రదమైన ఇంట్లో పుట్టి, పెద్ద చదువులు చదివి, ఇంత మంచి ఉద్యోగం చేస్తూ, మంచి జీతం సంపాదిస్తూ, గౌరవంగా, స్వతంత్రంగా బ్రతికే కెపాసిటీ వుండి తన్నులు తింటూ బ్రతికే బదులు విడాకులిచ్చి స్వతంత్రంగా బతకాలనుకున్నా.విడాకులకు అప్లయ్ చేసి వాడి అసలు రంగు సాక్ష్యాలతో సహా కోర్టులో బయట పెట్టి విడాకులు తీసుకున్నా. ఇప్పుడు స్వతంత్రంగా హాయిగా వున్నా.
పాపని ఓ నర్సరీలో చేర్చా. నెలకు యాభైవేలు ఇస్తున్నా. అన్నీ వాళ్లే చూసుకుంటారు. నెలకోసారి పాప దగ్గర కెళ్ళి రెండు మూడు రోజులు వుండి,చూసుకొని వస్తుంటా.
మగవాడితో పెళ్ళి, జీవనం బాగానే వుంటుంది.కానీ ,మంచి వాడు కాక మాయమాటలు చెప్పి నమ్మించే మా వారిలాంటి మోసగాడి బారిన పడితే మాత్రం...జీవితం దుర్భరమై, దుఃఖమయమైపోతుంది.
అందుకని నా సలహా ఏంటంటే అందంగా వున్నాడని,మంచి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మి, పెద్ద వాళ్లనెదిరించి, గుణగణాలు తెలుసుకోకుండా, గుడ్డిగా ప్రేమించి పెళ్ళి చేసుకోవడమంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది ఏ విధంగా చూసినా మంచి పనికాదు.
తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు.దానివల్ల రక్షణ కోల్పోతాం. ఉత్తరోత్రా సమాజంలో ఇబ్బందులు వస్తాయి." అంది.
పావని చరిత్ర తెలిసాక ఎట్టి పరిస్థితులలోనూ లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని, పెద్దలు కుదిర్చిన పెళ్ళిచేసుకోవడం మంచిదని నిర్ణయించుకుంది కావేరి. కానీ తన గొంతెమ్మ కోరికలను మాత్రం పక్కన పెట్ట లేకపోయింది.
అసలు ఆమె కోరుకున్న లక్షణాలన్నీ ఏ ఒక్కరిలోనూ వుండేవికావు. ఒకటి రెండన్నా మిస్సయ్యేవి.
కాలగమనంలో ఇంకో ఐదేళ్లు గడిచిపోయాయి.
ఒకసారి ఓ వారం రోజులు సెలవుపెట్టి తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చింది. "నీ తోటి పిల్లలకు పెళ్ళిళ్ళయ్యి ఒకరిద్దరు పిల్లలు కూడా కలిగారు. ఇంకెప్పుడు చేసుకుంటావే పెళ్ళి?"అని తల్లి అడిగితే "నాకు నచ్చిన వాడిని తెండి చేసుకుంటా "అంది కావేరి.
కూతురుకి ఎలాంటివాడు నచ్చుతాడో తెలీక తల్లి తల పట్టుకుంది.
ఒక రోజు సాయంత్రం కావేరిని ... "స్నానంచేసి నీట్ గా తయారవ్వు "అని తల్లి చెబితే "ఎందుకూ?"అని అడిగింది కావేరి.
"ఒక ఇంజనీరు సంబంధం. పెళ్ళి చూపులకు వస్తున్నారు. ఉదయం ఫోన్ చేసి చెప్పారు." అంది.
కావేరి శుభ్రంగా స్నానంచేసి అందంగా ముస్తాబయింది .
చెప్పినట్టే అబ్బాయి వాళ్లు సాయంత్రం వచ్చారు. పెళ్ళి చూపులు జరిగాయి. వెళ్ళేప్పుడు "అమ్మాయి నచ్చింది. లగ్నపత్రిక రాసుకుందాం. మంచి రోజు చూసి పిలవండి. "అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్లు.
వాళ్లు వెళ్ళాక "అబ్బాయి చామనఛాయ. అయినా పరవాలేదు. చూడ్డానికి బానే వున్నాడు.వివరాలు చెప్పు." అని తల్లిని అడిగింది కావేరి.
"అబ్బాయి సివిల్ ఇంజనీర్. స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ .జీతం యాభైవేలకు పైనే. ఏదో ప్రాజెక్టులో పనిచేస్తున్నాడట. వర్క్ సైట్ కి దగ్గరలో గవర్నమెంటువాళ్ళు క్వార్టరు ఇచ్చారు. అక్కడే వుండాలి."చెప్పింది తల్లి.
"ఒక వేళ పెళ్ళయితే నేను భర్త దగ్గర క్వార్టరులో వుండాలి కదా! ఎలా వీలౌతుంది?హైదరాబాద్ లో నా జాబ్ .జాబ్ చేయాలా వద్దా? నేను మాత్రం నా జాబ్ ని పదులుకోను. అలాంటప్పుడు నేను ఒక చోట ఆయనొకచోట వుండాల్సి వస్తుంది.ఆలూ మగలు ఒక చోట వుంఢకపోతే పెళ్ళి చేసుకొని వుపయోగమేంటి?" అని ఆ సంబంధానిని కూడా రిజెక్ట్ చేసింది కావేరి.
తల్లిదండ్రులు తలలు పట్టుకొని 'దీనికి పెళ్ళయ్యే యోగం వుందో లేదో ! వచ్చిన సంబంధాలన్నీ తిప్పి కొడుతోంది.' అని కోపం వచ్చి తర్వాత కావేరికి పెళ్ళి సంబంధాలు చూడ్డం మానేశారు. కాలం వేగంగా దొర్లిపోతోంది. కావేరికి ముప్పైఏండ్లు దాటిపోయాయ్. ఇంకా పెళ్ళికాలే!
'బాత్ రూంలో స్నానం చేసేటప్పుడు ,రొమాంటిక్ నవల చదివేటప్పుడు ,ఏదైనా లవ్ స్టోరీ వున్న సినిమా చూసినప్పుడు, పార్కులో ఎవరైనా కొత్త జంట తమ పాపని ఎత్తుకొని తిరుగుతుంటే చూసినప్పుడు ....మనసు, శరీరము వశము తప్పి మగవాడి పొందు కోరుతోంది. చూస్తుండగానే ముప్పైఏండ్లు దాటిపోయాయి. ఇంకో పదేళ్లు పోతే మెనోపాజ్ టైమొస్తుంది. తల్లి అయ్యే ఛాన్సు వుండదు.
ఇంత అందము, ఇంత మంచి ఉద్యోగము, ఇంత సంపాదన వుండి ఏంలాభం? అందము అడవిగాచిన వెన్నెల అయిపోతుంది. జీవితము నిస్సారమైపోతుంది.'అని మనసులో మదనపడి వెంటనే తల్లికి ఫోనుచేసి "అమ్మా!మీరు నా పెళ్ళి గురించి ఏమీ పట్టిచ్చుకోవడములేదు. శ్రద్ధ తీసుకోవడములేదు. ఆలస్యం చేయకుండా వెంటనే ఏదైనా ఓ సంబంధం చూడండి. మీరు చూసిన అబ్బాయిని పెళ్ళిచేసుకుంటా.కిందటి నెలలోనే నాన్న రిటైర్ అయ్యాడుకదా. ఖాళీగానే వుంటాడు. నా పెళ్ళి గురించి శ్రద్ధ తీసుకోమను. లేకపోతే నేను పెళ్ళి కాకుండానే ముసలిదాన్ని అయిపోతానేమోనని బెంగగా వుంది "అని ఎంతో ఆందోళనతో చెప్పింది కావేరి
ఆరోజు రాత్రి పద్మావతి భర్తతో "ఏమండీ!కావేరి సాయంత్రం ఫోను చేసింది."అంది.
"ఏమిటి విశేషం ?"
"దాని మనసు మారినట్టుంది. మనం ఎలాంటి సంబంధం తెచ్చినా చేసుకుంటా అంటోంది .నాన్నని ఏదైనా సంబంధం చూడమను" అంది.
"సరే!రేపటినుంచి మళ్ళీ వెతుకుతా."అని శ్రద్ధ తీసుకొని తిరిగి ఓ మంచి సంబంధం తెచ్చాడు.
అబ్బాయి చామన ఛాయ.ఎమ్మెస్సీ చదివాడు .ప్రయివేటు కాలేజీలో లెక్చరరు. జీతం పాతిక వేలు. వయసు ముప్పైఐదు. తల్లిదండ్రులు లేరు. ఓ చెల్లెలు వుంది.ఆ పిల్ల గురించే ఇంత కాలం ఆగాడు. ఏడాది క్రితం పెళ్ళి చేశాడు. వాళ్ల ఊరిలో సొంత ఇల్లు, పది ఎకరాల పొలము వుంది. మంచి కుటుంబం. అబ్బాయి బుద్ధిమంతుడు. గుణవంతుడు అని తెలిసింది.
కావేరి తల్లిదండ్రులు కూతురు దగ్గరకి వెళ్ళి, అబ్బాయి గురించి చెప్పి .......
"పెళ్ళి విషయంలో అన్నీ మనం కోరుకున్నట్టే జరగాలంటే జరగవు. కొన్ని విషయాల్లో సర్దుకు పోవాలి. మా విషయమే చూడు. మీ అమ్మ అందంగా బావుంటుంది. మరి నేనో...అందగాడిని కాదే!మామూలుగా వుంటా.పెద్ద ఉద్యోగం కూడా కాదు.మామూలు గుమాస్తా.సొంత ఇల్లు లేదు. పొలం లేదు. అయినా మీ అమ్మ నన్ను పెళ్ళి చేసుకోలేదా?కాపురం చేయలేదా?!
మీ అక్క విషయం తీసుకో. నీకంటే అందంగా వుంటుంది. చదువుకొని ఉద్యోగం కూడా చేసేది. మరి అలాంటిది మా మాట విని మీ బావని చేసుకుంది. ఆయన ఏమైనా అందగాడా?కాదే!అయినా అతన్ని మీ అక్కకు ఇచ్చి పెళ్ళి చేశాం.ఎందుకో తెలుసా?అందం లేకున్నా మనిషి మంచివాడు. గుణవంతుడు.ప్రభుత్వోద్యోగి.
మీ అక్కని బాగా చూసుకుంటున్నాడు. లక్షణంగా ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.
అందంగా వున్నవాడే కావాలనుకుంటే ఎట్లా?మగాడన్నాక కాస్త రఫ్ గానే వుండాలి. ఆడదానిలా అందంగా నాజూకుగా వుంటే ఏం బాగు?అయినా అందంగా వుండి పెళ్ళానికి వరకం చూపించేవాళ్ళు ఎంతమంది లేరు?అందంగా వుంటేసరా..గుణం బాగుండనక్కర్లేదా?
మేము ఈ అబ్బాయి గురించి విచారించాము. మంచివాడని తెలిసింది. ఎంతో బాధ్యతతో తనకంటే ఎనిమిదేళ్ళ చిన్న చేల్లెలిని తల్లిదండ్రులు పోతే బాధ్యతగా పెంచి పెద్ద చేసి పెళ్ళి చేశాడు.
నీకు ఇంతక ముందు ఎన్నో మంచి సంబంధాలు తెచ్చాం. కానీ వాటినన్నిటినీ ఏదో ఒక వంక పెట్టి రిజెక్ట్ చేశావు. ఇప్పుడు నీకు ముప్పైఏండ్లు దాటాయి. ఇంకా ఏదో ఒక వంకతో ఈ సంబంధం కూడా రిజెక్ట్ చేశావనుకో ఇక నీకు సంబంధాలు తేవడము మా వల్ల కాదు. నీలా గొంతెమ్మ కోరికలు కోరుకునేవారికి పెళ్ళవడం చాలా కష్టం. చెప్పవలసినది చెప్పా. తర్వాత నీ ఇష్టం ."అన్నాడు
"సరే!మీరు చెప్పినట్టే నడుచుకుంటా. మన ఊరిలోనే పెళ్ళి చూపులకు ఏర్పాటు చేయండి. వస్తా."అంది కావేరి.
కావేరి సెలవు పెట్టి తల్లిదండ్రుల దగ్గరకి వచ్చింది. పెళ్ళి చూపులకు ఏర్పాట్లు జరిగాయి. అబ్బాయి తన చెల్లెలిని,చిన్నాన్నని వెంట పెట్టుకొని పెళ్ళి చూపులకు వచ్చాడు. పెళ్ళి చూపులు జరిగాయి. కావేరిని చూశారు. రెండుమూడు రోజులలో కబురు పంపిస్తామని చెప్పి వెళ్ళారు.
అబ్బాయి చెల్లెలు ఇంటికి వెళ్ళాక "అన్నయ్యా!అమ్మాయి అందంగా చాలా బాగుంది.మంచి చదువుంది. మంచి ఉద్యోగముంది. అన్నందాలా బాగున్న అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయుండాల్సింది. కానీ, ఇంతవరకూ పెళ్ళి కాలేదంటే నాకు ఎందుకో అనుమానంగా వుంది. మనకు వద్దన్నయ్యా ఈ సంబంధం "అంది.
దాంతో అబ్బాయి కావేరి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు కబురు పంపాడు.
ఇంతకాలం తను ఎంతో అందకత్తెనని, మంచి చదువు ,ఉద్యోగము వుండి బాగా సంపాదిస్తున్నానని, తనను ఎవరైనా సరే పెళ్ళి చేసుకోడానికి రెడీగా, ఇష్టంగా వుంటారని అనుకుంటూ అహంతో వచ్చిన సంబంధాలన్నీ తను ఆశించినట్లు లేవని రిజెక్టు చేస్తూ వచ్చిన కావేరి ఇప్పుడు అబ్బాయి తన సంబంధాన్ని రిజెక్ట్ చేశాడని తెలియగానే షాకయ్యింది! ఏ ఆడపిల్లకైనా పాతికేళ్ల వయసు లోపలే పెళ్ళి చేయాలి. అదే సరైన వయసు. అప్పుడే దాంపత్య జీవితములోని సుఖాన్ని, మాధుర్యాన్ని అనుభవించి మాతృత్వాన్ని పొంది ఆనందమయమైన జీవితాన్ని గడపగలుగుతారు.
నలభైదాటితే మెనోపాజ్ టైము ప్రవేశించి పిల్లలు కలిగే అవకాశముండదు.
అందుకే మన పెద్దలు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగిపోవాలన్నారు. అలా కాక ప్రకృతికి విరుద్ధంగా కెరీరనో, అదనో, ఇదనో అలవికాని ఆశలతో,కోరికలతో సర్దుకొని పోయే మనస్తత్వం లేకుండా అహంతో కావేరిలా ప్రవర్తిస్తే వయసు ముదిరి పోవడము తప్ప ఫలితము వుండదు.
వయసుపోయాక మళ్ళీ రమ్మన్నారాదు. జీవితములోని మాధుర్యాన్ని కోల్పోతారు.
మీ శశికళ అన్నమరాజు 🙏
No comments:
Post a Comment