" ఈ రచన నా స్వీయరచన " - తులసీభాను
💞 మనసు కథలు 💞
🌺 వెన్నెల 🌺
వెన్నెల, వినీత్ ఇద్దరూ చదువుకునేటప్పుడే ప్రేమలో పడ్డారు, తరువాత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఒకేచోట పని కూడా చేసారు...
వినీత్, వెన్నెల కోసం చేయాల్సిన పనుల్లో కొన్ని కొన్ని నిర్లక్ష్యాలు, తొందరపాటు ఆలోచనలూ వెన్నెలకు కోపం, నిరాశ తెప్పించేవి అవి అలా అలా కొనసాగి వారిద్దరి మధ్యన అపార్ధాలు బాగా పెరిగాయి...
వెన్నెల వినీత్ కు, క్రిందటి సంవత్సరం, బ్రేకప్ చెప్పేసింది, ఇహ మనిద్దరి మధ్య ప్రేమ లేదు, మనం ప్రేమికులం కాదు అని వెన్నెల, వినీత్ కు చెప్పేసింది...
కానీ వినీత్ మాత్రం, ఇప్పటికీ వెన్నెల చుట్టూనే తిరుగుతున్నాడు.. షాపింగ్ మాల్స్ అవనీ, సినిమాహాల్స్ అవనీ, మెట్రోలో అవనీ వెన్నెల వెనకాలే తిరుగుతూ ఉండేవాడు వినీత్..
వెన్నెలకు చిరాగ్గా అనిపించి వినీత్ ని విసుక్కునేది, కానీ వినీత్ మూర్ఖంగా వెన్నెల వెనకాలే తిరిగే నీడలా మారాడు...
ఇహ చెప్పి చెప్పి విసిగిపోయిన వెన్నెల క్రమేణా వినీత్ ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది..
ఇలాగే జరుగుతుండగా ఈ రోజున వెన్నెలకు ఆఫీసులో పని లేట్ అయింది, గబగబా మెట్రో స్టేషన్ కి పరిగెత్తుకెళ్ళి లాస్ట్ మెట్రో ట్రయిన్ ఎక్కేసింది... ఆమె వెనుకాలే పక్కనుండే మరో బోగీలోకి వినీత్ కూడా యధావిధిగా మెట్రోలో ఎక్కాడు...
అక్కడక్కడా ఒకరిద్దరు అమ్మాయిలు, ఒక పెద్దాయన, ముగ్గురు అబ్బాయిలు మాత్రమే ఉన్నారు మెట్రో ట్రయిన్ లో... ఒకరొకరుగా దిగుతుండగా చివరి స్టేషన్ లో వెన్నెల, .. వెన్నెలనే సూటిగా చూస్తున్న వినీత్ , అంతకంటే తీక్షణంగా వెన్నెలనే గమనిస్తూ చూస్తున్న మరో ఇద్దరు బలిష్ఠమైన అబ్బాయిలు మాత్రమే మిగిలారు ట్రయిన్ లో... వెన్నెలకు వారి ముగ్గురినీ చూస్తే ఎందుకో వళ్ళు వణికింది....
స్వతహాగా ధైర్యస్థురాలయిన వెన్నెలకు ఆ రాత్రి చీకటి సమయంలో, బహు ఒంటరిగానూ, చాలా భయంగానూ అనిపించి కాళ్ళూ చేతులు చెమటలతో తడిసి చల్లబడిపోయాయి, తను బాగా నమ్ముకున్న సాయిబాబాను తలుచుకుంటూ, ధైర్యం కూడగట్టుకుంటోంది వెన్నెల...
వెన్నెల దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది... గబగబా ట్రయిన్ దిగేసి, చకచకా పరుగులాంటి నడకతో ఎస్కులేటర్ మీదకు వెళ్ళి నుంచుని, ఎస్కులేటర్ కదులుతున్నా కూడా తను కూడా రెండు రెండు మెట్లను దాదాపుగా దూకుతున్నట్లుగా దాటేస్తూ కిందకు దిగి వెళ్ళి రోడ్డును చేరుకుని గబగబా నడుస్తూ వెళుతోంది...
ఎప్పుడొచ్చారో తెలీదు ట్రయిన్ లోని ఇద్దరు అబ్బాయిలు మెరుపువేగంతో వచ్చి, వెన్నెల రెండు చేతులూ చెరో వైపూ బలంగా పట్టుకుని, వెన్నెలను ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న సన్నని సందులోకి లాక్కెళ్తున్నారు వెన్నెలని... వెన్నెల హెల్ప్ హెల్ప్ అని అరవబోతుంటే, ఆమె నోటిని ఒకడు తన మరో చేత్తో గట్టిగా మూసేసాడు...
ఊపిరాడక వెన్నెల గిజగిజలాడుతూ కదుల్తూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరొకడు క్లోరోఫామ్ కర్చీఫ్ ని వెన్నెల ముక్కు దగ్గర పెట్టేసాడు.. స్ప్రుహ కోల్పోతుండగా వెన్నెలకు చాలా భయమేసింది...
" నాకు కూడా ప్రియాంకరెడ్డిలాంటి చేదు అనుభవం ఎదురవబోతోందా ఏమిటీ, నేనూ రేపటిరోజును చూడకుండానే చచ్చిపోతానా ఏంటీ, ... " అనేలాంటి బాధ, భయాలతో తల పగిలిపోతుండగా వెన్నెల తల వాల్చేసింది మత్తు తలకెక్కగా....
అర్ధరాత్రి దాటి మూడు గంటల సమయంలో వెన్నెలకు నెమ్మది నెమ్మదిగా తెలివి వచ్చింది... కళ్ళు తెరిచి చూసింది వెన్నెల... కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర మూడు నాలుగు ఎలుకలు కొరకబోతున్నాయి అప్పటికే... వాటిని విదిలించుకుంది వెన్నెల...
చుట్టూ పిచ్చి చీకటి... కంపుకొడుతున్న చిన్న గది, చుట్టూ పిచ్చి పిచ్చి సామాన్లు లాగా చేతులకు కాళ్ళకూ తెలుస్తున్నాయి.. గదిలోని పైనున్న చిన్న చిన్న వెంటిలేటర్ల లోంచీ చిన్నగా వెలుతురు తెలుస్తోంది...
వెన్నెలకు అప్పటికి ఇంకా తాను బతికే ఉన్నానని తెలుస్తోంది, గట్టిగా అరిచి ఎవరినైనా పిలవాలనుకున్నా కూడా అక్కడి పరిస్ధితి ఏమిటో అస్సలు తెలియటంలేదు వెన్నెలకి..అసలు నేను ఇంకాసేపు తర్వాత బతికుంటానో లేదో, నా పరిస్థితి ఎలా కాబోతోందో, నన్ను ఎవరైనా ఎంతలా హింసిస్తారో ఏమో మరి, అని ఆలోచిస్తున్న వెన్నెలకు ఆకాశం బద్దలై తన నెత్తి మీద పడిపోతోందా అనేంత భయం కలిగింది....
ఇప్పుడు నా పరిస్థితి ఏవిటో, నాకు ఏమి జరగబోతోంది, అమ్మానాన్న, అన్న నా గురించి ఏం కంగారుపడుతున్నారో అనేలాంటి ఆలోచనలతో గజిబిజిగా ఉంది వెన్నెలకు...
ఇంతలో మూడున్నరకు దబదబా మని తలుపు దగ్గర ఎవరో తోస్తున్న శబ్దం వస్తోంది...
అది విన్న వెన్నెల గదిమూలకు ముడుచుకుపోయి కూర్చుంది " దేవుడా ఎవరో ఏమిటో, ప్లీజ్ హెల్ప్ మీ దేవుడా " అని సాయిబాబాను వేడుకుంటోంది వెన్నెల...
గది తలుపుని బలంగా తోస్తున్నారు... దేనితోనో తలుపు మీద గట్టిగా కొడుతున్నారు... వెన్నెలకు వళ్ళంతా వణికిపోతూ భయంతో వళ్ళు మొద్దుబారిపోతోంది... " సాయి సాయి .... " అని జపం చేసేస్తోంది వెన్నెల...
గబుక్కున తలుపు తెరుచుకుంది.. ముందుగా ఇద్దరు మనుష్యులు, వెనుకగా ఒకతను గదిలోకి తోసుకుంటూ చొరబడ్డారు... బయటి స్ట్రీట్ లైట్ పలుచటి వెలుతురులో వెనుక ఉన్న అతన్ని పోల్చుకుంది వెన్నెల, అతను వేరెవరో కాదు .. వినీత్...
" ఆ... వినీత్ నా మీద ఇంతలా
పగ పెంచుకున్నాడా " అని అనిపించి వెన్నెలకు గుండె ఝల్లుమంది, చాలా భయం వేసింది....
వీడిది కూడా శాడిస్ట్ ప్రేమేనా, ఛీ అని అనుకున్న వెన్నెలకు మనసు చాలా రోదిస్తోంది....
ముగ్గురూ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో, వెన్నెల అక్కడుందని గ్రహించుకుని, వెన్నెల దగ్గరకు వస్తుండగా .... వెన్నెలకు తెలిసింది ఆ ఇద్దరు మనుష్యులూ పోలీసులు అని....
వినీత్ , వెన్నెల దగ్గరకు వచ్చి " లే వెన్నెల, పద మనం తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేసిన ఆ దొంగ వెధవలిద్దరూ వచ్చే లోగా నువ్వు ఇక్కడ ఉండకూడదు, పదా... " అన్నాడు వినీత్ , వెన్నెలకు సూచనలిస్తూ... చేయి అందిస్తూ...
వినీత్ ని, పోలీసులు ఇద్దరినీ అయోమయంగా చూస్తూ, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెన్నెల , వినీత్ కి తన చెయ్యి అందించి లేచి నుంచుంది...
ఇద్దరు పోలీసులు ఇక్కడే కాపు కాయండి, మళ్ళీ ఆ దొంగలిద్దరూ ఈ అమ్మాయి కోసం రాగానే పట్టేసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఓ పోలీస్ అధికారి వినీత్ ను, వెన్నెలను తమ పోలీస్ జీప్ లో ఎక్కించుకుని వెన్నెల ఇంటివైపుకి దారి తీయించాడు...
వెన్నెల దారిలో అడిగింది, " అసలు ఆ అబ్బాయిలు ఇద్దరూ , తనని ఎందుకు అలా తీసుకుపోయారని, బంధించారని,... "...
అప్పుడు పోలీసుఅధికారి చెప్పాడు " వాళ్ళు అమ్మాయిలను ఎత్తుకుపోయి, వేరేచోట అమ్మేసే బ్యాచ్, అమ్మాయిలను గమనిస్తూ ఉండి, అదును చూసుకుని, అమ్మాయిలను ఎత్తుకుపోతారు, బహుశా రేపు రాత్రివరకూ వెన్నెలను, ఈ గదిలో నిర్భంధించి ఉంచి, తరువాతి రోజు రాత్రి చీకటిలో, ఏదో ఒక బండిని తెచ్చి, అందులోకి, వెన్నెలను ఎక్కించి దూరప్రదేశానికి తరలించేసేవారేమో... " అని....
అది విన్న వెన్నెలకు, వినీత్ కి చాలా భయం వేసింది....
దారిలో వినీత్, వెన్నెలకు చెప్పాడు... వారిద్దరూ వెన్నెలను బంధించి తీసుకెళ్తుంటే, తానొక్కడూ ఏమీ చేయలేనని తెలిసి , జాగ్రత్తగా వారి ముగ్గురి వెనుకనే దాచుకుని దాచుకుని వస్తూ వెన్నెలని వారు గదిలో బంధించడం చూసాడు... వెంటనే పోలీసులకి ఫోన్ లో సమాచారం ఇచ్చి, పోలీసువారు, వారి వారి స్టేషన్ ల పరిధుల గురించి చర్చలు పూర్తయ్యాక పోలీసు వారు వెన్నెల ఉన్న గది దగ్గరకు వచ్చే దాకా, గది వైపే చూస్తూ గమనిస్తూ వీధి చివర మూలలో ఒకచోట నక్కి కూర్చున్నాడు వినీత్... పోలీసువారు వచ్చేదాకా పదేపదే ఫోన్లు చేస్తూ విసిగిస్తూనే ఉన్నాడు వినీత్....
తను ఒక్కడూ తెగబడి ఏమీ చేయలేనని అర్ధమైన వినీత్, పోలీసువారు వచ్చేదాకా ఆపకుండా దీక్షగా ప్రయత్నించిన వినీత్ చివరకు వెన్నెలను సురక్షితంగా, ఆమె ఇంటికి చేర్చాడు....
వెన్నెల తల్లీతండ్రి పోలీసులకి, వినీత్ కి చాలా చాలా క్రృతజ్ఞతలు తెలుపుకున్నారు....
అన్నిరోజులూ నీడలా వెంటాడి వెన్నెలను విసిగించిన వినీత్, అనుకోకుండా ఈ రోజున వెన్నెలకు సాయం చేసి వెన్నెల జీవితం పాడవకుండా కాపాడగలిగాడు.
తులసీభాను
మంగళవారం
2 : 6 : 2020
No comments:
Post a Comment