*🌀అల్లుడు - ఆవకాయ:*
*"మీ నాన్న ఉత్తరం రాశాడు"😰* అని భార్యతో చెప్పి ఎర్రబడ్డ ముఖంతో బుసలు కొడుతూ గట్టిపడుతున్న ఉప్మాలోని గరిటెను కసికసిగా తిప్పుతున్నాడు మన్మథరావు.
*"సెలవులకి ఊరికి రమ్మన్నాడా?" 🤣* అని సంతోషంతో ఎగిరి గంతేస్తూ అడిగింది భార్య. *"అవును"* అంటూ భార్య చేతికి ఉత్తరం అందించి పళ్ళు కొరికాడు.😢
*ప్రియమైన అల్లుడూ!* 😍...
టీచరు ఉద్యోగం చేసే అల్లుడు దొరికినందుకు నేను గర్వపడుతుంటాను. వేసవి సెలవులోస్తే చాలు నా మనసుకు నువ్వే గుర్తొస్తుంటావు. ఈ సారి కూడా మన తోటలో కాసిన మామిడికాయలు ఒక బస్తా, పెరట్లో కాసిన చింతకాయలు ఒక బస్తా, కొండ ఉసిరికాయలు అరబస్తా మన ఊరివాళ్ళచేత మీ ఇంటికి పంపిస్తున్నాను. మీ అత్తయ్యకు ఆవకాయ అంటే ఆరోప్రాణమని నీకు తెలుసు. 😂 చింతకాయ పేరు వింటేనే నా ఒక్కగానొక్క కూతురు... అదే నీ భార్య ఆనందంతో ఎంతగా గంతులేస్తుందో నాకు తెలుసు.😂 ఇకపోతే నీకూ నాకూ...ఈ వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉసిరికాయ ఎంతో అవసరం అని ఎంతమందికి తెలుసు?
ఓ ముప్పావు బస్తా మామిడికాయలు శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టి పెద్దపెద్ద ముక్కలు తరిగి జిబజిబలాడే నూనెలో తేలియాడేటట్లుగా ఆవకాయ పెట్టు. మిగిలిన పావు బస్తా కాయలతో ముక్కల పచ్చడి పెడతావో తొక్కు పచ్చడి పెడతావో అది నీ ఇష్టం. అలాగే చింతకాయల్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకో. ఆరిన తర్వాత చెక్క రోకలితో నాలుగు దెబ్బలేసి చెదురుమొదురుగా దంచి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టు. ఇక మిగిలింది ఉసిరికాయలు. సగం ఉసిరికాయల్ని సన్నగా కత్తిగాటు వేసి తేనేలో నానబెట్టు. మిగిలిన సగం కాయల్ని ముక్కలు ముక్కలుగా దంచి ఉప్పు పసుపు వేసి తొక్కిపెట్టు.
తేనెలో ఊరిన ఉసిరికాయల్ని ప్రతిరోజూ ఉదయాన్నే నీ భార్యా నా భార్యా నీ పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు. తొక్కలో తొక్కు పచ్చడిని నువ్వూ నేను ప్రతిరోజూ చద్దన్నంలో అద్దుకుని తిందాము. కాబట్టి సెలవుల్లో నువ్వు మరే ఇతర పనులు పెట్టుకోకుండా ఈ మూడు పనులకే నీ విలువైన సమయాన్ని కేటాయించు.
ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మాయినీ, పిల్లల్నీ తీసుకుని పచ్చడి జాడీలను భద్రంగా మోసుకొని మన ఊరికి బయలుదేరు.
ప్రతిసారీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పట్నించీ ఏం తోచట్లేదు అంటుంటావు కదా. ఈసారి నీకు ఆ బెంగ అక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులూ సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడి వడియాలు, తడి అప్పడాలు ఎలా పెట్టాలో నేను నీకు నేర్పిస్తాను.
ఆ...అన్నట్టు చెప్పడం మరిచాను. వచ్చేటప్పుడు పెద్ద ప్లాస్టిక్ షీట్లు నాలుగు తెచ్చుకో. వడియాలను ప్లాస్టిక్ షీట్ల మీద పెట్టినట్లయితే త్వరగా ఎండిపోయి నీళ్ళు చల్లకుండానే చటుక్కున ఊడి గబుక్కున చేతికొస్తాయి. అలా అలవోకగా వడియాలు వొలవడం ఎంత సరదాగా ఉంటుందో నువ్వే చూద్దువు గానీ. నేను చెప్పిన మెళకువలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకో.
🤣నీ రాక కోసం మీ అత్తయ్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది.😍ఈ మధ్య ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా నువ్వెప్పడొస్తావని అడుగుతున్నారట.
ఊరు కాని ఊర్లో నీ కోసం కలవరించే ఇంతమంది అభిమానం నువ్వు సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 😍 ఇక ఉంటాను.
ఇట్లు
*ఎల్లప్పుడూ నీ అభివృద్ధిని కోరుకునే నీ మామగారు.*
No comments:
Post a Comment