జరిగింది తప్పే ...కానీ
'తమ్ముడు ఇంకా రాలేదేంటి అమ్మా' మళ్ళీ అడిగింది అవంతి.
'వస్తాడులేవే, ఈ గంటలో పదోసారి అడగడం, నువ్వొచ్చావు అని ఒక్క మెసేజ్ పెడితే రెండో నిమిషం లో నీ ముందు ఉంటాడు. నువ్వే చెప్పద్దంటివి. అలాంటప్పుడు ఆగు మరి'. నవ్వుతూ అంది జానకి.
'నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం ఐపోయి నాలుగు గంటలు అవుతోంది. మన ఇంటి నుంచి పది నిముషాలు దూరం లో ఉన్న కాలేజీ నుంచి రావడానికి ఇంత లేట్ ఎందుకవుతోంది . అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి' అడిగింది అవంతి.
'అలా కాల్ చేస్తే ఎగిరి పడతాడు ఇంటికొచ్చాక, వచ్చేస్తాడు లే, పదరా తల్లి, నీకు పాయసం చేసి పెడతా, మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు మనం వెళ్లి పాయసం చేసుకుందాం రా' తన నాలుగేళ్ళ మనవరాలిని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళుతున్న జానకి ని చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంది అవంతికి. తను చదువుకునేప్పుడు రావడం ఒక పది నిముషాలు లేట్ అయితే కంగారు పడి గుమ్మం లో కూర్చునే అమ్మ ఈమేనా అని.
మసకచీకటి ఆవరిస్తోంది అప్పుడే. అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకి గేట్ పక్కన అప్ప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన, గుమ్మము పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి. ఎన్నేళ్లయింది ఇలా ఇక్కడ కూర్చుని, నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటినుంచి ఎక్కడ ఏం మొక్క పెట్టాలి, ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి రోజూ చర్చలే, ఈ ఇంటి గురించి రోజూ కలలే. ఈ బొండుమల్లె అంటు కోసం ఎంత వెతికింది, ఇల్లు పూర్తి అయి ఇంట్లో కి వెళ్ళేలోపు బయట చిన్న పూలతోట ఉండాలనే తన తాపత్రయం చూసి అమ్మ నాన్న ఎంత సరదాపడేవాళ్ళో, తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తి అయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరునెలలు కూడా లేదు ఈ ఇంట్లో. మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తరువాత ఇక్కడ ఇలా ...'.అస్సలు కలలో అయినా ఊహించిందా కన్నవారికి, సొంత ఇంటికి దూరం గా ఇన్నేళ్లు గడుపుతానని '. ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి , కళ్ళల్లో పల్చటి నీటితెర కమ్ముకుంది.
'ఏం చేస్తున్నావు తల్లి, చీకటి పడుతోంది. దోమలు కొడతాయి, లోపలకి వచ్చెయ్'. రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు.
' బాగుంది నాన్నా ఇలా, ఇక్కడ కూర్చుంటే, ఎన్నేళ్లు అయిందో అదే తల్చుకుంటున్నా, కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికి అలానే ఉన్నాయి. గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు' ఆశ్చర్యం గా అంది. అవంతి.
'ఒక్క గార్డెన్ మాత్రమే కాదు తల్లి, నువ్వు గమనించావో, లేదో ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పడికి అలానే ఉన్నాయ్. చిన్న మార్పు కూడా చెయ్యలేదు. చిన్న ఫ్లవర్ వాజ్ కూడా అటు ఇటు మారలేదు. నువ్వు మళ్ళీ వచ్చి ఏదన్న మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఇల్లు ఎక్కడ మార్చకూడదనే మీ అమ్మ అభిప్రాయం . నాది కూడా లే' నవ్వుతూ నే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు.
'నాన్న, మీకో విషయం చెప్పాలి, లాస్ట్ వీక్ ఒక పార్టీ కి వెళ్ళినపుడు అక్కడ పృథ్వీ కనిపించాడు.' నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు.
'అక్కడికి ఎలా వచ్చాడమ్మా వాడు, ఇన్నేళ్లు నువ్వెక్కడ ఉన్నావో వాడికి తెలీకూడదని ఇంత కష్టపడ్డాం. మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి' ఆవేశం తో వణికిపోతున్నాడు రామారావు.
'నాన్న, నాన్న ప్లీజ్ ఎక్సైట్ కాకండి. కనిపించాడు, మాట్లాడాడు. జరిగినదానికి సారీ చెప్పాడు. అతనికి పెళ్లి అయింది తన భార్య ని కూడా పరిచయం చేసాడు. జరిగినదానికి చాలా ఫీల్ అవుతున్నాను. చాలా తప్పు చేశాను. క్షమించమని అతని వైఫ్, మీ అల్లుడుగారు ఇద్దరి ముందు అడిగాడు. మీకు ఈ గుడ్ న్యూస్ ఫోన్ లో కాకుండా ఎదురుగా చెప్పాలనే చెప్పకుండా ఇలా వచ్చేసాను.' గడగడా చెప్పింది అవంతి.
'హమ్మయ్య, ఎంత మంచి వార్త చెప్పావు తల్లి. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత సంతోషం గా ఉన్నా సరే లోపలెక్కడో చిన్న భయం. ఇప్పుడు మటుమాయం అయిపోయింది. నిజం గా పండగరోజే మనకి, అమ్మ కి చెప్తా ఉండు, సంతోషం తో ఎగిరి గంతేస్తుంది' పట్టరాని ఆనందం తో పరుగు లాంటి నడకతో, లొపలకి వెళ్తున్న రామారావు ని చూస్తూవుండిపోయింది అవంతి. ' అక్కా నిజం గా నువ్వేనా, వాట్ ఏ సర్ప్రైజ్' అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమన్ ని చూసేదాకా.
* * * *
అవంతి వచ్చి వారం దాటిపోయింది. అవంతి భర్త కి ఇండియా లో, అది కూడా వీళ్ళ ఊరిలోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతులని ఆనందోత్సాహాలలో ముంచెత్తింది. అమన్ కి అయితే చెప్పక్కర్లేదు. అవంతి కి పెళ్లి అయి వెళ్లిపోయేప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు. తన కన్నా దాదాపు పదేళ్లు చిన్న అయిన తమ్ముడు అంటే అవంతి కి ప్రాణం. అక్క ఎంత ముద్దు గా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడూ అక్క తో ఫోన్ లో, విడియోకాల్స్ లో తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండడమే తెలీదు. నాలుగేళ్ల చిన్నారి కృతి తో సహా అక్క తమకి దగ్గర్లోనే ఇంక ఉంటుందనే వార్త కి అమన్ కూడా సంతోషం తో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కృతికి, అమన్ మామ తో చాలా బాగా దోస్తీ కుదిరింది. అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి. ఇంకో నెల రోజులలో అవంతి భర్త ఇండియా కి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గర్లో ఇల్లు వెతకొచ్చు అనుకున్నారు అంతా.
* * * *
'అవంతి, అలా సంధ్య వేళా వాకిట్లో ఉండకమ్మా, దోమలు వచ్చే టైం ఇది. వస్తాడు లే నీ తమ్ముడు. వాడేమన్నా చిన్న పిల్లాడా, రోజూ ఆలా టెన్షన్ పడతావు' చిరుకోపం తో మందలించింది జానకి.
'నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్. నేను స్కూల్ నుంచో, కాలేజీ నుంచో రావడం పది నిముషాలు ఆలస్యం అయితే నువ్వు ఇలానే పడే దానివి టెన్షన్, ఇప్పుడేదో పెద్ద కూల్ మామ్ లాగ నాతో మాట్లాడుతున్నావ్' కినుక గా అంది అవంతి.
'నువ్వంటే వేరు, ఆడపిల్లవి కాబట్టి'
'ఏం ఆడపిల్ల అయితే, మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటినుంచి' కొంచం కోపంగానే అడిగింది అవంతి.
'అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి. ఆడపిల్ల కి బయట ప్రపంచం లో భద్రత లేదని భయం. అందుకే బయటకి వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ, నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా' చిన్నబుచ్చుకున్న తల్లి ని చూసి అవంతి కి అయ్యో అనిపించింది.
' అమ్మా, ఊరికే అన్నా సరదాకి, అంత సీరియస్ గా తీసుకోకు, కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది. ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఇంతసేపైనా, ఈ వారం లో మూడు సార్లు ఫ్రెండ్స్ తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు.చదువు మీద ఫోకస్ పెట్టాల్సినంత పెడుతున్నాడా, బయటకి వెళ్తే ఫోన్ ఎత్తడు ఎంతకీ, గట్టిగ అడగొచ్చుగా నాన్న, నువ్వు'.
'ఇంజినీరింగ్ లో చేరే వరకు ఆ రెసిడెన్సియల్ లో ఉన్నాడు గా, ఆ డిసిప్లిన్, చదువు వాటితో కాస్త విసిగిపోయాడు వాడు. ఈ ఏడాది రెండేళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా, తరువాత మళ్ళీ ఉద్యోగం, భాద్యతలు, అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తా అంటాడు. మన పిల్లాడి సంగతి మనకి తెలుసుగా. చదువు నిర్లక్ష్యం చెయ్యడు, వాడి లిమిట్స్ వాడికి తెలుసు. అందుకే కొంచం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు' తమ్ముడిని సమర్థిస్తూ చెప్పుకు పోతున్న తల్లి మాటలకి ఏం అనాలో తెలీట్లేదు అవంతి కి. 'నిన్న నైట్ వాడు పార్టీ నుంచి వచ్చినపుడు తాగొచ్చాడేమో వాసన కి అనిపించింది' అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది.
'అమ్మా, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇంకేలాగు ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ రాద్దామనుకుంటున్నా, నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా, తను ట్రై చెయ్యమన్నారు'
'అబ్బో, ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా, నీ చదువు అర్ధాంతరం గా ఆపామని బాధ పడని క్షణము లేదనుకో మీ నాన్న, నేను. కనీసం ఇప్పుడన్నా నువ్వు చదువు పూర్తి చేస్తే ఇంకేం కావలి మాకు. కానీ నువ్వు ఇంజనీరింగ్ ఒక ఏడాది చదివి ఆపేసావు కదా, మరి లా ఎందుకు , ఆ చదువే పూర్తి చెయ్యొచ్చు కదా' అమాయకం గా అడిగిన తల్లి ని చూసి నవ్వింది అవంతి.
'అది ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ క్రితం సంగతి. ఇంక ఆ సీట్ నాకోసం ఉండదు కదమ్మా, ఎలానో ప్రైవేట్ గా డిగ్రీ పూర్తి చేశా కాబట్టి లా ఎంట్రన్స్ రాయచ్చు. అయినా నాకు కూడా ఇప్పుడు లా చదవాలని కోరిక గా ఉంది కూడా'
' ఆలా అయితే సరే తల్లి, నీకేం చదవాలనుకుంటున్నావో, ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో, కృతి ని నేను చూసుకుంటాను. చదువులతల్లి వి, మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు, నువ్వెంత క్షోభ పడుంటావో మాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి, మాకు దూరం చెయ్యాల్సి వచ్చింది. ఆ బాధ జీవితాంతం వదలదు'. కళ్ళు తుడుచుకుంది జానకి.
'చా చ అమ్మా, ఆలా బాధ పడకు, మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా, అయినా అంత మంచి భర్త ని వెతికి తెచ్చారు, నాకేం లోటు చెప్పు. దూరమైపోయిన మీరు, చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి, ఇప్పుడు సంతోషించాలి గాని జరిగినవి తల్చుకుని బాధ పడతారా చెప్పు' కన్నీళ్లు తుడిచింది తల్లివి.
'నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, లా పూర్తి అయి ప్రాక్టీస్ చేస్తోంది. రేపొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్ కి తెలుసుకోడానికి'. తలూపింది అవని మాటలకి జానకి.
* * * *
'కృతి, ఆలా బయటకి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు, బూచి ఉంటుంది బయట అని చెప్పనా', అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్నా మామయ్యని కరుచుకుపోయింది కృతి.
'ఏమైంది బుజ్జి, అమ్మమ్మ అరుస్తోంది, అమ్మా పిల్లలని ఆలా బూచి అని భయపెట్టకూడదని తెలీదూ, ఎందుకలా చెప్తున్నావ్, ఇదే మైండ్ లో ఉండిపోతుంది పెద్ద అయ్యాక కూడా' తల్లి ని కోప్పడ్డాడు అమన్.
వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కర్తీ బయటకి వెళ్ళిపోతోంది రా, ఎంత కాచుకున్న సరే అందుకే భయం పెట్టడం'
"అర్ధమయ్యేట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా, అక్క చూడు అమ్మ బుజ్జిపాప ని ఎలా భయపెడుతోందో' అప్పుడికే లొపలకి వచ్చి అంతా చూస్తున్న అవంతి కి ఫిర్యాదు చేసాడు అమన్.
'పెట్టనీ భయం, ఆడపిల్ల కదా,ఎలానూ భయపడుతూ బ్రతకాల్సిందే, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోనీ' అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యం గా చూసారు.
'ఏమైంది తల్లి, ఏమిటా మాటలు, నీ మొహం ఏమిటి ఆలా వాడిపోయింది, ఒంట్లో బానే ఉందా' రామారావు అవంతి కి నుదిటి మీద చెయ్యి పెట్టి చూసాడు. ' జ్వరం ఏం లేదు, కానీ నువ్వెందికిలా ఉన్నావ్, ఒక్కదానివే బయటకి వెళ్ళావ్, నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా' మాటలు మింగేశాడు రామారావు . తల్లితండ్రుల మొహాలలో ఆ ఆందోళన అర్ధం కావట్లేదు అమన్ కి.
'మీరనుకున్నదే జరిగింది నాన్న, ఎంత వదుల్చుకుందామనుకున్నా ఆ గతం వదలట్లేదు, మళ్ళీ మళ్ళీ ముందుకి వస్తూనే ఉంది. నేను ఇంక ఇక్కడ ఉండలేను, ఇప్పుడే వెళ్ళిపోతాం నేను,కృతి'.
'మళ్ళీ కనిపించాడా ఆ త్రాష్టుడు, మారిపోయాడన్నావ్, ఇంకేం పర్లేదని ధైర్యం గా ఉన్న టైం లో ఇదేమిటండి' జానకి భోరుమంది.
'అమ్మా, ఏమైంది, ఏం మాట్లాడుతున్నారు మీరంతా, ఎవరు కనిపించింది, అక్కా నువ్వన్నా చెప్పు, ఏం జరిగింది' అమన్ కి టెన్షన్ వచ్చేస్తోంది.
'నీకు తెలీదు కదరా జరిగిన విషయం , అవును అప్పడికి నువ్వు చిన్న పిల్లాడివి, పైగా హాస్టల్ లో ఉండేవాడివి, అప్పట్లో తెలీదు కానీ పెద్ద అయ్యాక నీకెప్పుడూ డౌట్ రాలేదా, అక్క ఎందుకు చదువు సడన్ గా మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇన్నేళ్లు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో' అవంతి అమన్ ని తీక్షణం గా చూస్తూ అడిగింది.
'చాలాసార్లు అడిగా అక్క, నీకు ఎమ్ సెట్ లో వంద లోపు రాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా, మరెందుకు అక్క ని చదువు మాన్పించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని, మంచి సంబంధం , వదులుకోడం ఇష్టం లేక అనేవాళ్ళు, నిజానికి నాకు వింతగానే అనిపించేది, ఇప్పుడర్ధం అవుతోంది. ఏదో జరిగింది అని, చెప్పక్క ఏం జరిగిందసలు అమన్ ఆత్రుత గా అడిగాడు.
'అవంతి, ఊరుకో, చిన్నపిల్లాడు వాడికెందుకు ఇవన్నీ, లోపలికిపద, మనం మాట్లాడుకుందాం' రామారావు మాటలకి అడ్డం గా తల ఊపింది అవంతి.
'అంత చిన్న పిల్లాడు కూడా కాదు నాన్న ఇప్పుడు వీడు. వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది, అమన్ నేను చెప్తా విను. నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివే దాన్నో, మంచి కాలేజీ లో సీట్ వచ్చింది. అది ఉన్న ఊరిలోనే . కానీ మా సీనియర్ పృథ్వి అని ఉండేవాడు. ఆతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నేను నెమ్మదిగానే నో చెప్పాను. నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను, ఆతను వినలేదు, వెంటపడి వేధించాడు, అతన్నే పెళ్లి చేసుకోవాలని ,లేదంటే చంపేస్తా అని బెదిరించాడు. నేను అంతవరకూ ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పుడు మాత్రం భయపడి చెప్పాను. నాన్న ని తీసుకెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఒక వారం రోజులు సస్పెండ్ చేసారు, వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది అంతకన్నా కాలేజీ మానెజ్మెంట్ ఎమ్ చెయ్యలేదు, కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. ఆ రోజూ రాత్రే ఆతను తన ఫ్రెండ్స్ నలుగురిని తీసుకుని ఇంటి దగ్గరకి వచ్చిచాలా గొడవ చేసాడు. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి లేకపోతె చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు'. చెప్తూ దీర్ఘం గా శ్వాస తీసుకుంది అవంతి.
' ఆ గొడవ కి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బ్రతిమాలాను. కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలే, నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రి కి రాత్రే బాబాయ్ దగ్గరకి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు. అప్పటికే పిన్ని వాళ్ళ రెలెటివ్స్ మీ బావగారు వాళ్ళు సంబంధం అడిగారు నా గురించి. నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో, అప్పుడు అమ్మ, నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్ళతో మాట్లాడి జరిగినదంతా చెప్పి నా పెళ్లి కూడా ఢిల్లీ లోనే చేసేసి అటు నుంచి అటే నన్ను నైజీరియా పంపేశారు, కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవడానికి ఇదే కారణం, వస్తే నాకేదన్న అవుతుందనే భయం తో అమ్మ ఒప్పుకోలే'. అవంతి కి దుఃఖం ఆగట్లేదు.
' అక్క, ప్లీజ్ ఏడవకు, అప్పుడు జరిగింది ఎదో జరిగింది. నీకప్పుడు ఎవరూ సపోర్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా , ఈసారి నువ్వు భయపడి వెళ్లిపోవాల్సిన అవసరమే లేదు. చెప్పు ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ కనిపించాడు' ఆవేశం గా అడిగాడు అమన్.
'ఫోన్ మెసేజ్ ఉంది, వింటావా' అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి.
'ఏమనుకుంటున్నావు నీ గురించి, ఏం చూసుకునే అంత ఎగిరెగిరిపడుతున్నావ్ అసలు , నాలాంటి హ్యాండ్సమ్ గై నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతుంటే అంత ఇగో చూపిస్తావా, ఆడదానివి నీకే అంత పొగరు ఉంటే మగాడిని నాకెంత ఉండాలే, నాకు గాని తిక్క రేగిందనుకో , ఒక చిన్న ఆసిడ్ చుక్క చాలు అందం గా ఉన్న అని తెగ ఫీల్ అవుతున్నావుగా నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దం లో, ఒక్కటి గుర్తు పెట్టుకో నీకుప్రేమ అన్నా, పెళ్లి అన్నా అంటే అది నాతోనే. లేదా నిన్ను చంపి నేను చస్తా'. ఆ గొంతు విని అందరూ స్థాణువై పోయారు.
' ఇది ... ఇది ... మన అమన్ గొంతు కదా' గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి.
'అక్కా....ఇది నీకెలా, అసలేమైందంటే' తడబడుతున్న అమన్ చెంప చెళ్లుమనిపించింది అవంతి.
'అవంతీ...ఏమిటిదంతా.. నాకేం అర్ధం కావట్లే' వణుకుతున్న గొంతు తో అన్నాడు రామారావు.
'నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి తన దగ్గరకి వెళ్ళాను కదా నాన్న, అక్కడ నేను వెళ్ళేప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూయిసైడ్ అట్టెంప్ట్ చేసింది. చెయ్యి కోసుకుని నైఫ్ తో, లక్కీ గా చూసుకున్నారు కాబట్టి అపాయం తప్పింది. ప్రీతి నేను వెళ్లేసరికి అక్కడే వాళ్ళతో మాట్లాడుతోంది. నన్ను అక్కడికి రమ్మంది. ఎందుకా అని వెళ్తే తెలిసింది ఈ విషయం. వీడు రోజూ ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం ఆ దీప ని వేధించుకు తింటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి మీలానే భయపడి చదువు మాన్పిచేద్దామనుకున్నారు. పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తనే తీసేసుకుందామనుకుంది. ఆ ప్రబుద్దుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసెజ్ వినిపించింది. ఇది చాలా సంస్కారవంతమైన మెసెజ్. మీరు వినలేనివి మనం అనలేనివి కూడా చాలా ఉన్నాయ్ వీడి మెసాజ్లు', అమన్ వైపు అసహ్యం గా చూస్తూ కొనసాగించింది అవంతి.
'దీప కి, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పొచ్చా ఏం భయపడొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను సాక్షం ఇస్తాను వచ్చి ఆ గొంతు వాడిదే, ఆ నెంబర్ వాడిదే అని'. అవంతి మాటలకి అదిరిపడ్డారు అందరూ.
' అవంతి... జరిగింది తప్పే....కానీ ఆ అమ్మాయి సూయిసైడ్ వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారని చేసుకోపోయింది కానీ వీడి వల్ల కాదుగా, నువ్వు ఆవేశపడుతున్నావ్, వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది'. రామారావు వారించబోయాడు.
'జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ కి విలువ లేదు నాన్న, తప్పు అంటే తప్పే. వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా. మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి, తనకేదన్న అయి ఉంటే అప్పుడేం చేసే వాళ్ళు. లేదా నాలానే ఒప్పుకుని చదువు మానేసి ఉంటే అప్పుడు బ్రతికి వుండి చచ్చిపోయేది, ఇన్నేళ్లు నేనెలా ఉన్నానో తెలుసా నాన్న మీకు, నా తప్పేం లేకుండా నా కలలు, కోరికలు, ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి , కన్నవారిని చూడడానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్లు బ్రతికాను. నాకెలా అనిపించేదో తెలుసా అమ్మా, ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకు పారిపోయి బ్రతుకుతున్నాను , నా మీద నాకే విరక్తి కలిగేది. ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్ధం కాదు కూడా, నా ఒకే ఒక అదృష్టం అర్ధం చేసుకునే భర్త దొరికాడు కాబట్టి ఆగిపోయిన నా కలలు పూర్తి చేసుకుందాం, లా లో చేరి అమ్మాయిలకి వాళ్ళ హక్కుల గురించి పోరాటం లో సాయం చేద్దాం అని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసాయి నా తమ్ముడి ఘనకార్యాలు.' ఆవేశంతో ఊగిపోతోంది అవంతి.
'నువ్వు ఒక వైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావ్ అవంతీ, నా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు అలాంటి వాడు కాదు, నేను నమ్మను ఇదంతా' రోదిస్తోంది జానకి.
'నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మా, సరే చెప్పు రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా, వాడి ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ,ఫోన్ నెంబర్ కానీ తెలుసా, ఎలా చదువుతున్నాడో, బాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా, అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా, వాడి పాకెట్ లో సిగెరెట్ ఉంది అది తెలుసా, ఏం తెలుసనీ మీకు, అసలు తెలుసుకోవాలని అనుకున్నారా, ఎంతసేపు మగపిల్లాడు గా పర్లేదు పర్లేదు. ఆడపిల్ల కి బయట సేఫ్టీ లేదు అన్నావ్ కదా అమ్మా, ఎవరి వల్ల లేదు సేఫ్టీ నీ కొడుకు లాంటి మగపిల్లాడి వల్ల లేదు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లితండ్రుల వల్ల లేదు, మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు'. బాణాల్లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర.
'నువ్వు చెప్పరా, ఆడదానివి నీకే అంత ఉంటె మగాడిని నాకెంత ఉండాలి, అదేగా అన్నావ్, మగాడివి అయితే ఏమిటి నీ గొప్ప అసలు. ఒక విషయం ఆలోచించావా, ఒక ఆడదాని వొంట్లో తొమ్మదినెలలు భాగం గా ఉండే నువ్వు బయటకి వచ్చావు. ఆ తొమ్మది నెలలు నీకో అస్తిత్వమే లేదు. తానే నువ్వు కూడా, ఆలా మీ జీవితం లో కొంత భాగమే స్త్రీత్వం . ఇంకేం చూసుకునిరా నీకంత మిడిసిపాటు. .. ఎప్పుడూ అవంతి లో అంత కోపాన్ని చూడని అందరికి తనని చూస్తే భయం వేసింది.'
'తల్లి, నువ్వు సంబాళించుకో ముందు, చాల ఉద్రేకపడుతున్నావ్, కొంచం ప్రశాంతం గా ఆలోచించు. మేము వీడిని వెనకేసుకురావట్లేదు. జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతి తో మోగవు ఎప్పుడూ అంటున్నాను అంతే, ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరకుటి లాగ లేరు. ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీడిని' అవంతి కి నచ్చచెప్పబోతున్న జానకి తన చూపు చూసి ఆగిపోయింది.
'చెప్పమ్మా ఆగిపోయావేం, అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది, లేదా వాడి తో అతిచనువు గా ప్రవర్తించి ఉంటుంది, కాదూ వాడితో మిడ్నైట్ పార్టీ కి వెళ్లి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది. చెప్పు ఆగవేం. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో, పృథ్వి వాళ్ల ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయే నువ్వన్నట్టు రెచ్చగొట్టినా కూడా చంపెయ్యలా దానికి, లేదా ఎందుకలాంటి అమ్మాయి తో అని వదిలేయాలా. చెప్పు నువ్వు.'
' వాడు మగాడు కాబట్టి వాడి కి ఇష్టం అయితే ఆ అమ్మాయి కి నచ్చే తీరాలి. తనకి వేరే ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ ఉండకూడదు.ఎరా అంతేగా, అవసరమైతే చంపేస్తావ్ అంతేగా, మరి అలాంటప్పుడు అమ్మాయి భయపడడం నేర్చుకోవాలిగా, అప్పుడు నేను భయపడ్డాను, ఇప్పుడు దీప, రేపు కృతి. దాన్ని కూడా రేపెవరో ఇలానే అంటాడు, మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు. ఈ మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు, కోరికలు. ఒక పని చెయ్యి. నువ్వే చంపెయ్ కృతి ని కూడా, పెరిగి పెద్ద ఐయ్యిందంటే దాని మనసు ఎలా ఉంటుందో, , అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడే మనిషి ని చంపేద్దాం'. జరిగింది తప్పే ...కానీ అనే అవసరమే ఉండదెవరికి పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే' గొంతు దుఃఖం తో పూడుకుపోయింది అవంతికి.
'అవంతి, తల్లి ఇంక మాటల్తో చిత్రవధ చెయ్యకమ్మా, మేము ఎంత తప్పు చేసామో. ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్ధమైంది, మమ్మల్ని క్షమించు తల్లి'. రామారావు చిన్నపిల్లాడిలా భోరుమన్నాడు, జానకి కొంగు లో మొహం దాచుకుంది.
'అక్కా, ప్లీజ్ సారీ అక్కా, నిజం గా నేను ఊహించలేదు, అసలు అలా తనని ఎదో చేద్దామని కూడా నేను అనుకోలేదు. బెదిరిద్దాం అనుకున్నా అంతే, ఇలా జరుగుతుందని అనుకోలే, నన్ను క్షమించు అక్కా, పోలీస్ రిపోర్ట్ ఇస్తారనే భయం తో కాదు నిజం గా సిగ్గు తో చచ్చిపోతున్న, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు నేను దీప కి, వాళ్ళ అందరికి కూడా క్షమాపణ చెప్పుకుంటా, ప్లీజ్ అక్కా' అవంతి కాళ్ళ దగ్గర కూర్చుని బరస్ట్ అయ్యాడు అమన్.
'తీసుకెళ్తాను, వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్ళది, నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తా' నిక్కచ్చిగా చెప్పింది
'కృతి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడూ ఏ అమ్మాయి తోను తప్పుగా ప్రవర్తించాను, ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి, దీప వాళ్ళేమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను, నేను మారా అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు. అక్కా ముఖ్యం గా నువ్వు' తన ఒళ్ళో తల పెట్టుకుని కుమిలిపోతున్న తమ్ముడి లో మార్పు నిజం గానే వచ్చిందని అర్ధమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది.
No comments:
Post a Comment