*జ్ఞాన వాహిని.....*
*జ్ఞానం అనంతం. అది ఒక తరం నుంచి మరొక తరాన్ని సుసంపన్నం చేసే నిరంతర ప్రవాహం. వేదాలు భారతీయుల తొలినాళ్ల జ్ఞాన భాండాగారాలు, వేదం లేదా విద్య అనే పదాలకు జ్ఞానం అని అర్ధం. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు భారతీయులు గర్విం చదగిన అపురూపమైన ఆస్తి.*
*ఏ వ్యక్తి అయినా పుట్టుకతో జ్ఞానవంతుడు కాలేడు. జ్ఞాన సముపార్జన సాధన ద్వారానే లభ్యమవుతుంది. జ్ఞాన సంపన్నత నాలుగు మార్గాల్లో జరుగుతుం"దని పెద్దల మాట. మొదటగా విద్యార్థి గురువుకు శుశ్రూషతో వినయ సంపన్నుడై విద్యాభ్యాసం చెయ్యాలి. గురువు ముఖతః అందించే జ్ఞానాన్నే కాక ఆయన చర్యల ద్వారా కూడా ప్రకటితమయ్యే జ్ఞానఫలాన్ని అందుకోవటానికి శిష్యుడు సిద్ధంగా ఉండాలి...*
*ఆచరణ ద్వారా విద్యార్థులకు ఆదర్శనీయుడు అవుతున్నందువల్ల గురువును ఆచార్యుడన్నారు. అనేక సత్య్రంథాల పఠనం ద్వారా మనిషి తన మేధను పెంచుకోవచ్చు. జ్ఞానాన్వేషణలో* *ఉన్నవారికి గ్రంథాలు దైవసమానాలు. పుస్తకాలు తమలోని జ్ఞానసర్వస్వాన్ని అందరికీ సమానంగా పంచుతాయి. జ్ఞాన సాధకులకు ఇది రెండో మార్గం. స్నేహితులు, బంధువుల నుంచి వ్యక్తి పొందే జ్ఞానసిద్ధి మూడోది. కాలగమనంలో మనిషి జ్ఞానవంతుడు కాగలగటం చివరి మార్గం. వాల్మీకి, వేమనలాంటి వారు సైతం సామాన్యులుగా జీవితం మొదలు పెట్టినా వారికెదురైన అనుభవాలు లోకోత్తరులుగా తీర్చిదిద్దాయి.*
*భౌతిక సుఖాలు సాధారణ దీప కాంతిలాంటివి. అవి మనిషికి తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ దీపం చిరుగాలికే కాంతిహీనమవుతుంది. జ్ఞానానందం రత్నదీప కాంతివంటిది. రత్నం వెలువరించే కాంతిని పెనుగాలి కూడా ఆర్పలేదు. ఈ సత్యాన్ని గ్రహించినట్లేతే మనిషి ధననిధుల కోసం వెదుకులాడక, జ్ఞాననిధికై అన్వేషణ కొనసాగిస్తాడు.*
*జ్ఞానవంతుడు కావటానికి ఎంత శ్రమించటానికైనా సిద్ధంగా ఉండాలి. హనుమంతుడి దీక్షాదక్షతలు ఈ విషయాన్నే చాటిచెబుతాయి. ఆంజనేయుడు విద్యాభ్యాసం చెయ్యగోరి ఆదిత్యుడిని సమీపిస్తాడు. తన వేగంతో సమానంగా ప్రయాణించి విద్య నేర్చుకొమ్మంటాడు సూర్య భగవానుడు. హనుమంతుడు అతడి శిష్యుడై సకల శాస్త్ర పారంగతుడవుతాడు. ఆంజనేయుడు పరిచయమైనప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఆయన పాండిత్యాన్ని పరిపరి విధాల కొనియాడతాడు. శ్రీరాముడి మన్నన పొందిన అంజనీసుతుడి జ్ఞానం వెనక కఠోర శ్రమ ఉందన్న సత్యం గుర్తించాలి.*
*జిజ్ఞాసాపరులకు జ్ఞానం త్వరగా లభ్యమవుతుంది. వయస్సు పైబడి వృద్ధులు కాకపోయినా సమాజం వారిని జ్ఞానవృద్ధులుగా గుర్తిస్తుంది. శంకరాచార్యుడు చిన్నతనంలోనే తల్లిని విడిచి గురు ఆశ్రయం పొందాడు. జ్ఞానిగా ఎదిగాడు. శంకరుడి తత్వం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం. చండాలుడు ఎదురై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక ప్రణామాలర్పిస్తాడు. అతడి ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటాడు.*
*ఆ మహానుభావుడు భూమి మీద నివసించింది తక్కువ కాలమే అయినా ఇతరులకు సాధ్యం కాని రీతిలో ఉత్తమ గ్రంథాలను రచించాడు. ఎన్నో తరాలవారి చేత జగద్గురువుగా పూజలు అందుకుంటున్నాడు.*
*కాళిదాసంతటి మహాకవి జీవిత ఆరంభంలో అజ్ఞాని. అవివేకంతో తాను కూర్చున్న చెట్టుకొమ్మనే నరకడానికి సిద్ధపడ్డట్లు చారిత్రకగాథ. కాళికామాత అనుగ్రహంతో అన్ని విద్యలను నేర్చుకున్నాడు. సామాన్యులమైన మనం కూడా అంతే. పెద్దలు, గురువులు, సజ్జనసాంగత్యం వల్ల జ్ఞానవంతులమవుతాం. తరతరాల నుంచీ అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న జ్ఞానవాహినిలో విహరించగలుగుతాం. కాళిదాసులోని అజ్ఞానం నశించినట్లే మనలోనూ ఏదో ఒకనాడు అజ్ఞానం అస్తమిస్తుంది. విజ్ఞానం విస్తరిస్తుంది.*
*┈┉┅━❀꧁ జై శ్రీరామ్ ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹
No comments:
Post a Comment