Tuesday, June 3, 2025

 *మాట విలువ....‌.*

*"అంగీకృతం సుకృతినో న పరిత్యజన్తి"...*

*అనేకమంది యితరులకు సహాయం చేస్తామని చాలా తొందరగా వాగ్దానం చేస్తారు. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు. అది చాలా పాపం. మన పూర్వీకులు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారు. హారిశ్చంద్రుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చెప్పుకోలేని బాధలు పడ్డాడని పురాణాలు చెప్తున్నాయి. సత్యవాక్పాలానా ద్వారా కలిగే తృప్తి అతను పడ్డ కష్టాల కంటె చాలారెట్లు ఎక్కువ.*

*అలాగే శ్రీరాముని కథ చదివితే తానిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు. సుగ్రీవునితో స్నేహం చేసినప్పుడు రామునికి సుగ్రీవుని దుస్థితి తెలిసి "నీ కష్టాన్ని తొలిగించి, నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందేటట్లు చేస్తాను" అని వాగ్దానం చేసాడు. సుగ్రీవునికి ఆ వాగ్దానం నెరవేరుతుందా అనే సందేహం ఏర్పడి ఉండవచ్చు, రామునికి ఎటువంటి సందేహంలేదు.* *అందువలనే ఇలా అన్నాడు.*

*"రామో ద్విర్నాభిభాషతే"...*

*"రాముడు రెండు రకాలుగా మాట్లాడడు"... అని. ఇంకో విధంగా చెప్పాలంటే మాట మార్చడు. సుగ్రీవుని శత్రువైన వాలిని సంహరించి, సుగ్రీవునికి పట్టం కట్టాడు. విభీషణుడు శరణు కోరి వచ్చినప్పుడు కూడా నీకు లంకారాజ్యాన్ని అప్పచెప్తానన్నాడు. ఆ మాట ప్రకారమే రావణుని వధించి లంకను విభీషునికి అప్పచెప్పాడు. ఎట్టి పరిస్థులలోనైనా ఇచ్చినమాటను తప్పక నెరవేర్చాలని ఈ ఉదాహరణల ద్వారా మనకర్ధమవుతుంది.*

*సహాయం చేస్తామని చెప్పి సహాయం చేయకపోవటం మోసం చేయటంతో సమానం. మోసం చెయ్యటం పాపం. మాటివ్వకపోతే అది వేరే విషయం. కానీ... మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవటం తప్పు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని మాటను నిలబెట్టుకోలేని సందర్భం రాకుండ జీవితంలో నడుచుకోవాలి.*

*"అంగీకృతం సుకృతినో న పరిత్యజన్తి"...*

*మహానుభావులు తాము అంగీకరించిన విషయాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టరు.*

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🌼🍁 🙏🕉️🙏 🍁🌼🍁

No comments:

Post a Comment