*పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని దర్శించాలి*
*భగవంతుడిని కళ్లతో చూడాలనుకోవడమే లక్ష్యం కాకూడదు.రాయిలో, చెట్టులో, ప్రతి ప్రాణిలో, చివరకు మన హృదయంలో ఆయన ప్రవిష్టుడై ఉన్నాడు . కళ్లు మూసుకుని అంతర్దృష్టితో చూస్తే సర్వత్ర ప్రకృతిలో మనకు పరమాత్మ దర్శనమిస్తాడు.*
*దైవ సాక్షాత్కారం చాలా మంది భక్తుల కోరిక. ఒక శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి. ''గురువర్యా! నేను దేవుడిని నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను' అన్నాడు. గురువు గారు నవ్వి ఊరుకున్నారు. అయితే ఈశ్వర దర్శనం కోసం గురువుగారు ఏదైనా మంత్రం ఉపదేశిస్తారని అతని ఆశ. మధ్య మధ్య గురువును కలిసే అతను వచ్చినప్పుడల్లా గురువును అదే ప్రశ్న వేసేవాడు. ఆయన నవ్వి ఊరుకునేవారు. ఒకసారి అతను వచ్చినప్పుడు గురువు 'ఎండలు ఎక్కువగా ఉన్నాయి. నదిలో స్నానం చేసి వద్దాం 'పద' అని అతనిని తీసికెళ్ళారు. నదిలో శిష్యుడు మునిగి లేద్దామనుకుంటుండగా గురువు అతని తలపై* *చేయి ఉంచి తీయలేదు. కొద్ది సేపు ఆయన శిష్యుడి తలను నీళ్ళలోనే ఉంచేశాడు. శిష్యుడు ఊపిరి సలపక గిజగిజలాడాడు. తరువాత గురువుగారు చేయి తీసివేశారు. 'ఏమిటి గురువర్యా అలా చేశారు?' అని శిష్యుడు అడిగాడు. 'నువ్వు నీ తలను నీటిలో ఉంచి. బయటకు తీయలేకపోయినప్పుడు నీ ఏకైక లక్ష్యం ఏమిటి?' అని ఆయన శిష్యుణ్ణి అడిగాడు. 'అప్పుడు శ్వాస పీల్చుకోవాలన్నదే నా లక్ష్యం. అందుకనే కాళ్లూ చేతులు కొట్టుకుని విశ్వ ప్రయత్నం చేశాను. ఊపిరాడకపోతే బతికి ఉండలేను కదా' అన్నాడు. 'ఆ సమయంలో శ్వాస క్రియ జరగాలన్న తపన ఎంతగా ఉందో అంతటి తపన ఈశ్వరుని చూడాలని ఉంటే ఆక్షణమే నీకు ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఈశ్వరుని దర్శించాలనే ఆకలి నీకు మనస్పూర్తిగా లేనపుడు, తగిన సాధన చేయకుండా పరమాత్మ దర్శనం కాదు. అందుకు కోరిక కంటె సాధన ముఖ్యం. ఆ లక్ష్యాన్నే ఎల్లవేళలా మననం చేయి. ఆ లక్ష్యాన్నే స్వప్నంలో కూడా చూడు. ఆ లక్ష్యం కోసమే జీవించు, మనస్సును, బుద్దిని, శరీరాన్ని ఆ లక్ష్యం కోసం ఏకాగ్రం చేయి. మరో విషయం గురించి ఆలోచించకు. నీ లక్ష్యం నుంచి ఎట్టి పరిస్థితుల్లోను విముఖుడవు కాకు. జీవితంలో సిద్దికి ఇదొక్కటే మార్గం. ధార్మిక ప్రవృత్తిగల మహాపురుషులు తమ లక్ష్యం కోసం పిచ్చివారయ్యారు. అంతటి కఠోర సాధన వల్లనే నీకు ఈశ్వర దర్శన భాగ్యం లభిస్తుంది. ఇది ఒక్కటే మార్గం.*
*మయ్యేవ మన అధత్స్వమయి బుద్ధిం నివేశయ*
*నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సం శయః*
*సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును ఏకాగ్రం చేసి నా యందు. ఉంచు. నిశ్చయాత్మకమగు బుద్ధిని కూడా నా యందే ఉంచు. అలా చేస్తే నా యందే నివసించగలవు ఇందులో సంశయం లేదు అన్నాడు శ్రీకృష్ణభగవానుడు,*
*అజ్ఞాన వృత్తి చొరబడతాయి. ప్రాపంచిక సంసార బంధాలలో పూర్తిగా చిక్కుకున్న సామాన్యులు భగవంతుని మీద ఏకాగ్రత ఉంచలేరు. వారిలో దుష్ట సంకల్పాలు, విషయ వాసనలు, అందువలన ఈశ్వర ప్రాప్తి సామాన్యులకు దుస్సాధ్యం. అయితే దుస్సాధ్యం కదా అని భగవంతుడిని వదులుకోమని నేను చెప్పడం లేదు. నీది ధార్మిక ప్రవృత్తి అయితే భగవంతుడు నిన్ను వదలడు. ఎన్ని వ్యాపకాలున్నా భగవన్నామస్మరణ వదలివేయరాదు' అన్నారు గురువుగారు.*
*మరో వారం రోజుల తరువాత ఆ శిష్యుడు తిరిగి గురువు వద్దకు వచ్చి 'రోజు రోజుకి అవసరాలు పెరిగిపోతున్న ఈ రోజులలో వాటిని సమకూర్చుకోవడానికే సమయం చాలటం లేదు. మరి మనస్సును భగవంతుని మీద ఏకాగ్రం చేయడం ఎలా సాధ్యమవుతుంది?' అని ప్రశ్నించాడు. దానికి గురువు సమాధానం ఇస్తూ, 'ఏ కాలంలోనైనా మనిషి అవసరాలకు ఒక పరిధి, పరిమితి ఉండాలి. కాని మన అవసరాలకు అవధులు లేవు. నివసించడానికి ఒక ఇల్లు సరిపోతుంది. అది అవసరం. కాని నాలుగు అంతస్తుల భవనం కావాలని లేదా మరో ఇల్లు కావాలనుకోవడం అత్యాశే. ఈ అత్యాశ వల్ల జీవితమంతా ఈ కోరికలను తీర్చుకోవడానికి వృథా చేస్తుంటాము. భర్తృహరి వైరాగ్య శతకంలో చేయి దిండుగా వాడుకోగలిగినప్పుడు ఇక దిండు అవసరమేముంది అంటాడు. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే కోరికలు ఉన్నంత వరకు భగవంతుని వైపు మనస్సును మళ్ళించడం సాధ్యం కాదు. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాల వల్ల కలిగేది అశాంతే అని అవి అశాశ్వతమని గ్రహిస్తామో అప్పుడు మాత్రమే మనస్సు భగవంతునివైపు మరలుతుంది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు. కామినీ కాంచనములందు ఆసక్తి వీడి, లభించిన వానితో తృప్తి చెంది, పరమార్థ విషయ బుద్ధి కలిగి ఉండాలి' అని.*
*మనిషి ఉదాసీన వైఖరితో ఉండకూడదు. ఉదాసీనత వైఫల్యానికి హేతువు. తాను చేసే పనిపై పూర్తి అవగాహన, అధ్యయనం, దీక్ష, క్రియ అనేవి ముఖ్యం. నిరంతర ఆచరణ గమనశీలమైన చైతన్యానికి చిహ్నం. మనకంటూ ఉన్నత లక్ష్యం ఉండాలి. దానితో పాటు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. వెనుతిరగని ధృతితో ఆత్మ సంయమనంతో అవాంతరాలను దాటుకుంటూ వెళ్ళాలి. అయితే మనం విడువకూడనిది ధార్మికత. ధార్మికతకు మూలం దైవ శక్తిపై విశ్వాసం. దీనికి తోడు కర్తవ్య నిష్ఠ ఉండాలి. అందువల్ల అన్ని వేళలా మన చైతన్యాన్ని సక్రమంగా, సముజ్వలంగా, సర్వ సమృద్ధిగా ఆనందంగా మలచుకోవాలి. మనిషి శ్రేయస్సు విశ్వ శ్రేయస్సుతో ముడిపడి ఉంది. భగవంతుడి ని కళ్లతో చూడాలనుకోవడమే లక్ష్యం కాకూడదు. రాయిలో, చెట్టులో, ప్రతి ప్రాణిలో, చివరకు మన హృదయంలో ఆయన ప్రవిష్టుడై ఉన్నాడు. కళ్లు మూసుకుని అంతర్దృష్టితో చూస్తే సర్వత్ర ప్రకృతిలో మనకు పరమాత్మ దర్శనమిస్తాడు.*
*ఒక పనిలో విజయం సాధించాలంటే అందులో సారం తెలిసి దానికి తగినట్లు పాటుపడాలి. సంత్ కబీర్ ఒక సందర్భంలో ఇలాంటి సద్బోధ చేస్తూ 'ధైర్యంగా, గంభీరమైన, లోతైన సముద్రంలో మునిగే వానికే ముత్యాలు, పగడాలు, రత్నాలు దొరుకుతాయి. మునగడానికి భయపడి ఒడ్డున కూర్చుంటే గడ్డిపరకలే దొరుకుతాయి అన్నాడు.*
*అబ్దిరత్నమధోదత్తే దత్తేచ శిరసాత్పణమ్*
*అబ్దేరేవహి దోషాయం రత్నం రత్నం తృణమ్ తృణమ్*
*అనగా సముద్రం రత్నాలను అడుగున ఉంచుతుంది. గడ్డి పరకలను తలపై ధరిస్తుంది. అంతమాత్రాన రత్నాలకు విలువ తగ్గదు. గడ్డిపరక విలువ పెరగదు. రత్నం రత్నమే. గడ్డిపరక గడ్డిపరకే.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment