Monday, September 8, 2025

 *సర్వం భక్తిమయం.....* 

*భారతీయ జీవన విధానంలో భక్తి ఒక శాఖగా విస్తరించింది. 'భక్తి' అనే భావనలోనే జ్ఞాన, కర్మ, యోగాది సాధనలన్నీ అంతర్లీనమై ఉన్నాయి. బ్రహ్మానందానుభవం భక్తి పారవశ్యంలోనే కలుగుతుందని వేదాంతం చెబుతోంది. ప్రేమ, సేవ అనే రెండూ భక్తికి అంగాలే. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ భక్తిని మిళితం చేసుకోవచ్చు.*

*పండుగల్లో మనం ఇంట్లో చేసుకుతినే కొన్ని ప్రత్యేక వంటకాలు దైవానికి నైవేద్యంగా పెట్టి మనం తింటే అది ప్రసాదమవుతుంది. ప్రసాదమనగానే ఆహారాన్ని వ్యర్థం చెయ్యం. ఆహారానికి భక్తిని జోడిస్తే అది ప్రసాదం. ఎంతో పవిత్రం. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తాంత్రిక పూజావిధానంలో మాంసాహారమూ ప్రసాదమవుతుంది. మనం రోజూ తాగే నీరే అయినా అది మామూలు జలమైనా, కొబ్బరి నీళ్లయినా ఆలయంలో అర్చకుడిస్తే తీర్థమవుతుంది. జలాశయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల సమీపంలో ఉంటే అవి పుణ్యతీర్థాలు. అక్కడ* *పవిత్రస్నానాలు ఆచరిస్తారు. ఆకలిని లెక్క చెయ్యకుండా నిరాహారంగా ఉండటానికి భక్తి తోడైతే, అది ఉపవాసం. భగవంతుడిపై చిత్తం నిలిపే క్రమంలో ఆహారం తయారుచేసుకోవడం, తినడం, రుచిని ఆస్వాదించడం వంటివి అవరోధాలు గనుక భక్తిలో నిరాహారంగా ఉండటానికి ప్రాధాన్యం ఏర్పడింది. అప్పుడప్పుడూ ఆచరించే ఉపవాసాలు దేహారోగ్యానికీ మేలు చేస్తాయి. మన ఆధ్యాత్మిక చింతనలో ఆరోగ్య స్పృహా దాగి ఉంది.*

*పాశ్చాత్య దేశాల్లో విహారయాత్రలకు ప్రాముఖ్యం ఎక్కువ. మన సంస్కృతిలో పర్వదినాలకు భక్తిభావం దోహదమైతే అది తీర్ధయాత్ర అవుతుంది. ప్రకృతి సౌందర్య నిలయాలైన ప్రదేశాలను భారతీయులు ఉపయోగించుకునే తీరే విలక్షణమైనది. సుందర ప్రదేశాలను భోగమగ్నులు కావడానికి, ఇంద్రియ చాపల్య ప్రదర్శనకు కాకుండా నిగ్రహంతో అంతర్ముఖులై ఉపాసన ద్వారా సుందర ప్రకృతిని అనుగ్రహించిన పరమాత్మను అందుకోవడానికి ఉపయోగిస్తారు.*

*గంగానదీ మార్గంలోనే నయాగరా జలపాతం ఉన్నట్టయితే మానవజాతి దాన్ని ఉపయోగించే విధానం ఇప్పటి పద్దతికి ఎంతో విభిన్నమై ఉండేది అంటారు సోదరి నివేదిత 'వెబ్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథంలో నిత్యం ఎన్నో పాటలు వింటుంటాం. సంగీతానికి భక్తిని మేళవిస్తే అది 'కీర్తన' అవుతుంది. నవవిధ భక్తిమార్గాల్లో కీర్తనం ఒకటి.* 

*ప్రసిద్ధ వాగ్గేయకారులందరూ గొప్ప భక్తులే. కొన్ని గృహాలు ప్రాతఃకాలంలో దైవ సుప్రభాతాలతో నినదిస్తాయి. సాయం సమయాలు ధూపదీపాలతో అలరారుతాయి. నిత్యం స్తోత్రాలతో, పారాయణాలతో పవిత్ర వాతావరణానికి నెలవవుతాయి. ఆ ఇళ్లు ఆలయాలే కదా! తోటి మనిషికి సాయపడటం, వీలైనంతవరకు ఉపకారం చెయ్యడం-ఇవన్నీ భక్తితో చేసే సేవలే. సాధారణమైన పనులు కూడా భక్తికి చోటు కల్పిస్తే సేవలవుతాయి.*

*మనుషులు వివిధ వృత్తులు ఆచరిస్తారు. విధ్యుక్త ధర్మాన్ని నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్షర హితంగా ఆచరించేవారు కొంతమందే ఉంటారు. భక్తి భావనతో సమాజహితం కోరి చేసే పనులు కర్మలవుతాయి. పనే దైవమన్న సూక్తి భారతీయ వాఙ్మయం ఎప్పుడో చెప్పింది. 'కాయకమే కైలాసమయ్యా' అన్నాడు బసవేశ్వరుడు. లోక కల్యాణం కోసం జీవించిన మహానుభావుల్ని కర్మయోగులంటాం.*

*అందరూ మనుషులే. కాని దైవచింతన, నిష్కాముకత్వం, ప్రకృతిని ఆరాధించడం, సాటి ప్రాణుల్ని ప్రేమించడం, దైవంపట్ల శరణాగతి-ఈ గుణాలు ఉన్నవారే కదా మనుషులవుతారు. అన్ని చోట్లా ఉన్న దైవాన్ని 'సర్వాంతర్యామి' అంటున్నాం. మనం భావిస్తే భక్తిలేని దెక్కడ? మన జీవితాల్లోని ప్రతి అంశమూ ప్రతి అణువూ భక్తిప్రపూరితమే.!*

*┈┉━❀꧁గణపతేనమః꧂❀━┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁

No comments:

Post a Comment