"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 2వ భాగము.
బ్రహ్మ అందరికంటే ముందు పుట్టాడు. ఆయనే సృష్టికర్త, రక్షకుడు కూడా. అతడు సకలశాస్త్రములకు మూలమైన "బ్రహ్మవిద్యను" తన మొదటి మానస పుత్రుడైన అథర్వునకు బోధిస్తాడు. ఆ విద్యను అథర్వుడు అంగిరునకు బోధిస్తాడు. పిమ్మట సత్యవహుడు ఆ విద్యను అంగిరుని నుండి గ్రహిస్తాడు. పిదప సత్యవాహుడు ఆ బ్రహ్మవిద్యను అంగిరసునికి ప్రసాదిస్తాడు.
శునక ఋషి పుత్రుడు, ఉత్తమ గృహస్తుడు అయిన శౌనక మహర్షి ఒకనాడు అంగిరస మహర్షిని సమీపించి, మహర్షీ! దేనిని తెలుసుకుంటే, ఈ ప్రపంచం అంతా తెలుసుకోవచ్చు? అని ప్రశ్నిస్తాడు.
అంగిరసుడు శౌనకునితో, శౌనకా! ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా, పరావిద్య మఱియు అపరావిద్య అనే రెండు విద్యలను అవగతం చేసుకోవాలని బ్రహ్మవిదులు పేర్కొన్నారు.
అపరావిద్యలో నాలుగు వేదాలుతో పాటు వేదాంగములైన శిక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషము వస్తాయి. ఈ నాలుగు వేదముల సంవిధానమును బట్టీ అనేకానేక కర్మల ఆచరణ జరుగుతుంది. ఈ నాలుగు వేదములు, దేవతలను స్తుతించు ఋక్కులను (ఋగ్వేదము), యజ్ఞయాగాది కర్మలను (యజుర్వేదము), ఋగ్వేదంలోని ఋక్కులను సుస్వరంతో గానం చేయడం (సామవేదము), యజ్ఞ పద్దతులు, ఆయురారోగ్య పద్ధతులు, అస్త్రశస్త్ర విషయములు (అధర్వవేదము) పేర్కొంటాయి. ఇవన్నీ కూడా అపరావిద్యను భోదిస్తాయి.
శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించేదే పరావిద్య. ఇది సనాతనమైన ఆత్మను గురించి తెలియజేస్తుంది. దీనినే "ఉపనిషద్విద్య" అని కూడా అంటారు.
కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు అందనిది, చేతులూ మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిది, రంగు లేనిది, అవయములు లేనిది, చావుపుట్టుకలు లేనిది, శాశ్వతమైనదీ, అంతటా వున్నది, అత్యంత సూక్ష్మమైనది, అయినటువంటి "అక్షరపరబహ్మము" ఈ విశ్వమంతటికి మూలంగా భావించి, జ్ఞానులైన మహర్షులు దీనిని అంతటా దర్శిస్తారు.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి)
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻
No comments:
Post a Comment