[7/1, 05:31] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 22🌹
👌మనస్సు స్వరూపమే దైవం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 22. మనస్సు స్వస్వరూపమే దైవం 🌹
✳️ శ్రీరమణభగవాన్ సమక్షంలో జంతువులు, పక్షులు కూడా తమ సహజ నైజాన్ని, వైరాన్ని మరచి సంచరించేవి. భగవాన్ ఎల్లప్పుడూ తన మనో మూలంలో స్వస్వరూపంతో ఉండటమే అందుకు కారణం. మనసు యొక్క స్వస్వరూపం అంటే స్వభావాలన్నీ విడిచిపెట్టిన నిశ్చలస్థితి. మనకు మన శరీర స్వరూప స్వభావాలు స్పష్టంగా తెలుసు. శరీరానికి స్వరూప స్వభావం ఉన్నట్లే, మనసుకు కూడా స్వరూప స్వభావాలు ఉన్నాయి. కొంత ప్రయత్నం చేస్తే మనస్సు స్వభావం తెలుసుకోగలుగుతున్నాం. కానీ మనమనస్సు ‘స్వరూపం' ఏమిటో మనకు తెలియడం లేదు. మనసు స్వరూపం తెలుసుకోవడమంటే మన దేహంలో అది పుట్టే మూలస్థానాన్ని తెలుసుకోవటమే.
✳️ *'ఈ దేహమే నేను’* అన్న భావనలో మనసు పూర్తిగా ఈ శరీరం యొక్క స్వరూప స్వభావాలను తనకి ఆపాదించుకుంటుంది. శరీరానికి అవసరమైన ఆకలి, నిద్ర, సుఖం వంటివి మనసు తనవిగా భావిస్తుంది. వివేకంతో విచారణ చేస్తే మనసుకి ఉన్న ఈ వికారాలు, జ్ఞాపకాలు దాని స్వభావాలుగా ఉన్నాయని అర్థం అవుతుంది. మనం మన మనసు స్వభావాన్ని గమనిస్తూ అదనంగా వచ్చి చేరిన ఈ వికారాలను తీసేయ్యాలి. అప్పుడు ఏ స్వభావం లేని పరిపూర్ణమైన దాని స్వస్వరూపం మనకి తెలుస్తుంది. అంటే మనసు స్వరూపాన్ని తెలియనీయకుండా అడ్డుపడేది అదనంగా వచ్చి చేరిన దాని స్వభావమే. కోపం, భయం, ఇష్టం, ద్వేషం వంటి లక్షణాలేవి మనసుకి సహజంగా ఉన్న స్వభావాలు కావు. ఈ విషయం ప్రతి రోజు మనకు నిద్రలో నిరూపణ అవుతుంది. అవన్నీ మనసు లక్షణాలు అయి ఉంటే వాటి నుండి స్వేచ్ఛను పొంది, నిద్రలో శాంతి అనుభవించటం సాధ్యమయ్యేది కాదు.
✳️ మనిషి జీవితానికి మనసే మూలం. కాబట్టే మరణించిన వ్యక్తిలో అది ఉండదు. మన జీవితానికి ఆధారంగా ఉన్న మనసునే మనం జీవుడని అంటున్నాం. పరమాత్మ స్వరూపమైన ఆత్మే మన శరీర పోషణం కోసం మనస్సుగా వ్యక్తం అవుతూ ఈ వికారాలను ప్రోగు చేసుకొంటుంది. పరిపూర్ణ శాంతిని, భగవంతుని సాన్నిధ్యాన్ని, ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు, యోగులు, జ్ఞానులు ఈ మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు. కప్ప సహజంగానే తన నాలుకను మడిచి ఖేచరీ విద్యతో ఆకలి దప్పులు లేని నిశ్చల స్థితిలో ఉంటుంది. యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు.
✳️ అద్దంలో మంట కనిపించినా అది అద్దానికి కానీ దాన్ని చూసే వారికి కానీ ఏ హానీ చేయదు. అలాగే రమణ భగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతో పాటు జీవిస్తున్నా ఏ విషయాలు వారి మనసును చలింపజేయలేవు. మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది. వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు. కానీ మనకి ఆ విషయం అనుభవంలో లేదు. ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్వంతో సాధనలో ముందుకు సాగుతాం. దేనిపై ప్రసరిస్తే దాని స్వరూప స్వభావాలతో మనసు మమేకత చెందుతుంది. అందుకే మనసు తాను నిత్యం దేహాన్ననే భావనలోనే ఉంటుంది. పెద్దల మాటలు, సత్సంగం, మంత్రజపం, యోగాభ్యాసాల వలన మనం (మనసు) ఈ దేహం కాదని తెలుస్తుంది. ఆ జ్ఞానమే సాధనలో మన స్వస్వరూపాన్ని తెలియజేస్తుంది.
✳️ చెడు సహవాసాల వల్ల దారితప్పిన పిల్లవాడిని మంచి మాటలతో సత్ప్రవర్తన అలవర్చి దారికి తెచ్చుకుంటాం. అలాగే దేహసహచర్యంతో వికారాలు ప్రోగుచేసుకున్న మనసును విచారణా వైరాగ్యాలతో దారికి తెచ్చుకోవాలి. నిజానికి పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడమే మనసు లక్షణం. గ్రహించే విషయాల ఎడల మనసుకు ఉన్న అనుకూలత, ప్రతికూలతలే వికారాలుగా ఉన్నాయి. ఇవే కష్టసుఖాలుగా, సంతోషదుఃఖాలుగా మనసుకు ద్వంద్వభావనని కలుగజేస్తున్నాయి. మనసు ఎంత తాపత్రయ పడినా కోర్కెల ద్వారా గానీ, వాటిని తీర్చుకోవటం ద్వారాగానీ పొందేది, కేవలం క్షణికమైన అనుభవమే. తాను పొందేది తనకు మిగిలేది ఏదీ లేదని మనసుకు తెలియడమే వైరాగ్యం. తనకు అంటని వాటి గురించి పెట్టే పరుగులు ఆపడమే వివేకం.
✳️ ఇంట్లో పోయిన వస్తువును బయట వెన్నెల ఉంది కదా అని వెతకటం అవివేకం. నీలోఉన్న మనసును బాహ్య విషయాలపై పెట్టి దాని స్వరూపాన్ని వెతకాలను కోవటం కూడా అలాంటిదే. ఎందుకంటే, బాహ్య విషయాలపైకి వెళ్లగానే మనసు వాటి స్వరూపంలోకే మారిపోతుంది. అందుకే వికారాల నుండి, బాహ్య విషయాలనుండి, దేహాత్మభావన నుండి విముఖమైన మనసు మాత్రమే తన స్వరూపమైన ఆత్మ మన దేహంలో కలిసి మనసుగా మలినమైంది. నిశ్చలస్థితి ద్వారా నీరు తన సహజ స్థితిని పొందినట్లే సాధనలో మనసు స్వస్వరూపమైన పరమాత్మ స్థితిని పొందుతుంది. కనుకనే సాధనలో మనం సహజ స్థితిని పొందటం తప్ప కొత్తగా సాధించేది ఏది ఉండదని భగవాన్ చెప్తున్నారు.
✳️ విచారణా మార్గం అంటే గమనింపు ద్వారా మనసు స్వభావాలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించుకోవడమే. మనం ఏ పని చేయాలన్నా శరీరం కన్నా ముందే మనసు ఆ విషయంలో లగ్నమవుతుంది. అప్పుడు మాత్రమే మనం దేన్నైనా చేయగలుగుతాం. హనుమంతుడు సూక్ష్మరూపంలో లంకను ముందే చూసి వచ్చాడా? అని భక్తుడి సందేహం.
[7/1, 05:31] +91 73963 92086: దీనికి భగవాన్ సమాధానం చెప్తూ ఏ కార్యమైనా ముందు మనసు చేస్తేనే ఆ తర్వాత శరీరం చేయగలుగుతుందని సమన్వయం చేశారు. ఒక భక్తుడు కొన్ని చేపలను తన వస్త్రంలో మూటకట్టుకొని దేవాలయానికి వెళ్లాడు. అతనంటే గిట్టనివారు గుడిలో ఆ మూట విప్పించి చేపలు బయట పెట్టారు. ఈ విషయం రాజు వద్ద విచారణకు వచ్చింది. అప్పుడు ఆ భక్తుడు “గుడిలో చేపలు బయటపెట్టింది నేనా? వారా? అని ప్రశ్నించాడు. తప్పు తనదే అయితే కడుపులోనే ఉన్న మలమూత్రాల మాటేమిటని ప్రశ్నించాడు. అలాగే ఏ పని జరిగినా దాన్ని ప్రేరేపించిన మనసుదే తొలి బాధ్యత అవుతుంది.
✳️ స్మరించడానికీ, ధ్యానించడానికీ ఏ దేవత రూపనామాలైనా ఒక్కటే. ఇక్కడ మనసు చేసేస్మరణ, ధ్యానాలే ముఖ్యం కానీ అదిఎంచుకునే రూప నామాలు ప్రధానం కావు. తనను ఏ నామస్మరణ చేయమంటారని రామశాస్త్రి అనే భక్తుడు రమణ భగవాన్ని అడిగాడు. నీ పేరునే సార్థక నామం చేసుకోమని భగవాన్ సందేశమిచ్చారు. అంటే కేవలం రాముడన్నది పేరుకే పరిమితం చేసుకోకుండా నిజంగా రాముడిగానే ఉండేందుకు ప్రయత్నించమని భగవాన్ సారాంశం. మనం అనేక దేవతల పేర్లు పెట్టుకుంటాం. కానీ అవి పిలిచేటపుడు, పలికేటప్పుడూ వారిస్మరణే ఉండదు. అలాకాక పేరు పిలిచే ప్రతిసారి ఆ దైవాన్ని స్మరించగలిగితే అది కూడా సాధనే అవుతుంది. పేరు మన దేహానికే అయితే శవాన్ని కూడా పేరు పెట్టి పిలవాలి. కానీ ప్రాణం పోయిన తర్వాత దాన్ని 'రామయ్యశవం' అని అంటారేగానీ శవాన్ని రామయ్య అని ఎవరూ పిలవరు. పేరు తనదని భావించే మనసు కూడా ఒక్కొక్క దేహంలో ఉన్నప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. అందుకే మనసుకు, దేహానికి వర్తించని ఆ నామం అనాదిగా వస్తున్నా మన ప్రాణస్వరూపుడైన ఈశ్వరుడిదే. ఈ ధ్యాసతో ఉండగలిగితే ప్రతి పిలుపు భగవంతుని సంకీర్తనే అవుతుంది. మన పూర్వీకులు రాముడనీ, కృష్ణుడనీ, శంకరా, లక్ష్మీ, దుర్గా అనీ దైవనామాలనే పిల్లలకు పెట్టేవారు. ఇందులో దేవునిస్మరణతో పాటు ప్రతి వ్యక్తిలోను భగవంతుడే ఉన్నాడన్న సత్యానికి సమీప భావన కూడా ఉండేది. నాగరికత పేరుతో చిట్టి, టింకు, వంటి ఏ పవిత్రతా లేని పేర్లు పెట్టుకొని మనం ఈ సద్భావనకు దూరం అవుతున్నాం.
✳️ మన సాంప్రదాయంలోని నమస్కారం మొదలు ప్రతిదీ భగవంతునికే అర్పిస్తున్నామన్న భావనతోనే జరుగుతుంది. సద్గురువులకు, జ్ఞానులకూ పాదపూజలు చేసినా మనం ఆ ఈశ్వరభావనతోనే చేస్తాం. వారికి మనం చేసే పాదపూజలను చూడగలుగుతున్నాం. కానీ అంతకు మునుపే వారు మనలోని ఈశ్వరుడికి చేసే భావార్చనను మనం దర్శించలేక పోతున్నాం. దీని వల్లనే పరిపూర్ణత చెందని భక్తులలో అనేక సంశయాలు తలెత్తుతుంటాయి. మహానుభావులకు చేసే సేవ మొదలు అర్చన దాకా ఈశ్వరునికే చెందుతుంది. అందుకు కారణం వారు మనలా దేహభావనతో కాక అహంకార రహితమైన ఈశ్వరభావనతో ఉండటమే. దేహభావనతో స్వీకరించే నమస్కారం కూడా అనేక పాపాలకు హేతువు అవుతుంది. కనుక సామాన్యులు తమకు ఎదురైన నమస్కారాన్ని కూడా శివార్పణ చేస్తూనే ప్రతి నమస్కారం చేయాలి.
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment