Saturday, July 13, 2024

 రామాయణానుభవం....371.

రావణాజ్ఞను శిరసా వహించి సీతాదేవిని పుష్పకవిమానంపై ఎక్కించుకొని త్రిజట స్వయంగా రణరంగానికి తీసుకువెళ్ళింది. విజయోత్సాహంతో జెండాలు ఎగురవేస్తున్న లంకనుదాటి రణరంగానికి చేరింది విమానం. 

యుద్ధానికి పునరుద్యుక్తులౌతున్న వానరమహావీరులను చూసారు. సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ అటూ ఇటూ హడావిడిగా పరుగులు తీస్తున్న విభీషణుడిని చూసారు. అల్లంతదూరంలో కదలికలు కోల్పోయి పడివున్న రామలక్ష్మణులను చూసింది.

 సీత, కన్నీటితో, చిన్నవోయిన వదనాలతో వారిద్దరినీ పరివేష్టించిన వానరసైన్యాన్నీ హనుమదాదులనూ చూసింది. రామలక్ష్మణులు చనిపోయారన్న వార్త నిజమేననుకుంది.

 దారుణంగా విలపించింది. సంతానవతివిగా సౌభాగ్యవతివిగా యజ్ఞయాగాది క్రతువులతో జీవితాంతం పుంస్త్రీగా ఉంటావన్న ఋషుల జ్ఞానుల ఆశీస్సులన్నీ అసత్యాలైపోయాయా అని వాపోయింది. సాముద్రికులూ జ్యోతిష్కులూ చెప్పిన భవిష్యం అంతా వ్యర్థమైపోయింది. అని దుఃఖించింది. 

త్రిజట కల్పించుకొని - దేవీ ! విలపించకమ్మా! నీ భర్త జీవించే ఉన్నాడు. పరిశీలనగా చూడు. వానరసైన్యం తీవ్రకోపంతో యుద్ధానికి పునరాయత్తం అవుతోంది. అంటే ఏమిటి? నాయకుడు జీవించి ఉన్నాడని అర్ధం. 

రాముడే చనిపోయివుంటే ఈ సైన్యమంతా చుక్కాని విరిగిన నావలా చెల్లాచెదురైపోయి ఉండేది. మరొక విశేషం చెప్పనా! ఇది పుష్పకమని దివ్య విమానం. నీ భర్త నిహతుడే అయ్యుంటే ఇది నిన్ను మోసేది కాదు. పుంస్త్రీలకు మాత్రమే దీనిలోకి ప్రవేశం. అందుచేత నీవు దుఃఖించవలసిన అవసరంలేదు. నిస్సందేహంగా రామలక్ష్మణులు జీవించే ఉన్నారు. నిశ్చేష్టులై పడి ఉన్నారంతే.

 ఇద్దరి ముఖాలూ చూడు. కళ తప్పలేదు. స్పృహ కోల్పోయారు. త్వరలోనే స్పృహలోకి వస్తారు. మేల్కొంటారు. అమ్మా! నేనెప్పుడూ అసత్యం చెప్పలేదు. ఇకముందు చెప్పనుకూడా. నిజం చెబుతున్నాను. శీలసంపదతో నువ్వు నా మనస్సు దోచుకున్నావు. నా మైత్రికి ఇదే కారణం.

హేతుబద్ధమైన ఈ మాటలతో సీతకు విశ్వాసం కుదిరింది. కృతజ్ఞతాపూర్వకంగా త్రిజటకు నమస్కరించింది. నీవన్నట్లే. అగుగాక! అనిమెల్లగా పలికింది. సీతా త్రిజటలతో పుష్పకం వెనక్కు మళ్ళింది. లంకలో ప్రవేశించింది. ఇద్దరూ యథాస్థానానికి చేరుకున్నారు.

      ......సశేషం.....

చక్కెర.తులసీ కృష్ణ.

No comments:

Post a Comment