*భక్తి - జ్ఞానం*
భక్తి లేని జ్ఞానం ఎండిన విత్తనం లాంటిది, సంపద శూన్యమైన బొక్కసం లాంటిది. భక్తి మనసును శాంతింపజేస్తుంది, ఆత్మస్వరూపాన్ని వెలిగిస్తుంది. ఈ సత్యాన్ని హంసోపనిషత్తు తెలియజేస్తుంది.
అధర్వ వేదాంతర్గతమైన హంసోపనిషత్తులో లోతైన తత్త్వసారం ఉంది. ఒక సందర్భంలో గౌతముడు, సనత్కుమార మహర్షిని ఆశ్రయించి- ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు, దేహం, మనసు- వీటి మధ్య సంబంధం ఏంటి? బ్రహ్మజ్ఞానం సులభంగా ఎలా లభిస్తుంది? అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా సనత్కుమారుడు ఒక పురాణస్మృతిని వివరిస్తాడు. ఒకసారి పరమశివుణ్ని పార్వతీదేవి బ్రహ్మవిద్య గురించి ప్రశ్నించగా, ఆయన ‘హంసాసోహం’ అంటూ బ్రహ్మైక్య తత్త్వాన్ని ఉపదేశించాడు. అదే ఆ ఉపనిషత్తు సారం. ఇక్కడ ‘హంస’ అన్నది కేవలం పక్షి కాదు. ‘నేనే ఆ పరమాత్మ’ అనే అనుభూతి అది. ఉచ్ఛ్వాసలోనూ, నిశ్వాసలోనూ ఆ పరమాత్మే ఉన్నాడన్న భావన. రోజులో సుమారు 21,600 శ్వాసలతో ‘అజపా-గాయత్రి’ని మనం వల్లిస్తూనే ఉంటాం. ఈ శ్వాసనే ఈశ్వరుడికి సమర్పించడం యోగమార్గం. అదే భక్తి మార్గం. ‘నువ్వుల్లో నూనె దాగి ఉన్నట్లే, కట్టెలో అగ్ని ఉన్నట్లే, హృదయంలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు’ అని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి బయట వెతికితే ఆయన దొరకడు. ధ్యానం, ఆత్మజ్ఞానాల ద్వారా మాత్రమే దర్శించగలం.
ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే- మనిషికి జ్ఞానం మాత్రమే కాదు, భక్తి కూడా తప్పనిసరి. గురుభక్తి, దైవభక్తి లేకుండా ఆత్మసాక్షాత్కారం జరగదు. మనం ఎంత విద్య, సంపద, శక్తి సంపాదించినా, మన లోపల ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతే జీవితం అసంపూర్ణమే. కాబట్టి ప్రతి శ్వాసనూ హంసాసోహం అనుభూతిగా మార్చుకోవాలి. ప్రతి పనినీ సభక్తికంగా చేయాలి. ఈ తత్త్వం ఈనాటి సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ఎన్ని విభిన్న గుర్తింపులతో జీవిస్తున్నప్పటికీ, ‘నేనే పరమాత్మ’ అని తెలుసుకుంటే ద్వేషం, అసూయ, అహంకారం తొలగిపోతాయి. అందరూ ఒకే పరమహంస స్వరూపమని గుర్తించినప్పుడు భక్తి-జ్ఞానం సమన్వయం అవుతాయి. లోకంలో శాంతివనాలు వికసిస్తాయి.
పరమాత్మను భక్తి ద్వారానే పొందగలమని రుగ్వేదం, విశ్వమంతటా వ్యాపించిన ఆ పరమపదాన్ని భక్తితోనే చేరుకోగలమని యజుర్వేదం చెబుతున్నాయి. భక్తి ద్వారా జగత్తంతా ఒకే గృహమనిపిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. భక్తి కేవలం ఆలయపూజకే పరిమితం కాదు. సత్యనిష్ఠ, సేవ, సత్సంగం, నిష్కామకర్మలతో పాటు ధర్మనిష్ఠ రూపంలోనూ వ్యక్తమవుతుంది. అలాంటి భక్తి హృదయాన్ని శుభ్రపరుస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఏతావాతా హంసోపనిషత్తు మనకు నేర్పేది ఏంటంటే- భక్తి లేకుండా జ్ఞానం వృథా; జ్ఞానం లేకుండా భక్తి అరుదు. రెండూ కలిసినప్పుడే జీవితం పరిపూర్ణమై, అంతర్యామి సాక్షాత్కారం సాధ్యమవుతుంది.
~శ్రీధర్ కక్కెర్ల
No comments:
Post a Comment