*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🔔🍁 🔔🍁🔔 🍁🔔🍁
*జీవిత లక్ష్యం*
*జీవిత లక్ష్యం ఏంటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాలనుంచి చూడవచ్చు. ప్రకృతిపరంగా చూస్తే మనిషి- ప్రాణికోటిలో ఓ భాగమంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం లేవనే చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం!*
*ఇక ప్రపంచపరంగా చూస్తే- మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశ పౌరుడు- ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు* *చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే- పోషించే పాత్ర, వయసు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ‘లక్ష్యం’ అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్నీ జీవితలక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం.*
*ప్రకృతిపరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యం, పరమార్థం లేకపోతే ఇక జీవించి ఉపయోగమేంటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న ‘అహం’ నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు- ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపచేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా ఎదగగలడు. సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు. ఈ విశ్వ రహస్యాలను శోధించగలడు. ఇంతటి మహాద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతమిత్థమైన అర్థమూ, లక్ష్యమూ లేకపోవటమే జీవితానికి అందం.*
*రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే- జీవితంలో దేన్నయినా కళాత్మకంగా మార్చవచ్చు, ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోలోతులకు వెళ్లే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజనశక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా- ఎవరైనా సరే, తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం.*
🍁🔔🍁 🔔🍁🔔 🍁🔔🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment