4️⃣8️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
*64. రాగద్వేషవియుక్తైస్తు విషయానినిండ్రియైశ్చరన్l*
*ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతిll*
*65. ప్రసాదే సర్వదు:ఖానాం హానిరస్యోపజాయతేl*
*ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠతిll*
రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు, ఇంద్రియములు ఉన్న మానవుడు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖములు అనుభవిస్తున్నా, తానుమాత్రం పరమ శాంతంగా ఉంటాడు. అటువంటి శాంతిని పొందిన మానవుడికి దుఃఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మయందే లగ్నం అయి ఉంటుంది.
మనస్సులో రాగద్వేషములు లేని వాడు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కలవాడు, పరమ శాంతిని పొందుతాడు. అతడి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా అతడి మనసు ఎటువంటి వికారములకు లోనుకాదు. విషయ వాంఛలలో లగ్నం కాదు. దేనితోనూ ఎటువంటి సంగమము పెట్టుకోదు. అతడి శరీరం అనే రథం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నడుస్తుంది. దీనికంతా మూలకారణం అతని మనసు, ఇంద్రియములు, రాగద్వేషములను వదిలిపెట్టి అతని స్వాధీనంలో ఉండడమే. కాని ప్రపంచంలో ఎక్కువ మంది ఇంద్రియములకు, మనసుకు దాసులై, తమ ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇంద్రియములను మనసును స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితం దు:ఖరాహిత్యము. పరమ శాంతి పరమానంద ప్రాప్తి. సర్వదుఃఖానాం అని అన్నారు. అంటే ఏదో ఒక దు:ఖం కాకుండా సకల దుఃఖాలు నశించిపోతాయి. ఎప్పుడైతే సకల దుఃఖాలునశిస్తాయో, అప్పుడు అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతని మనసు ఆత్మయందు లీనం అవుతుంది. అపుడు కలిగేదే పరమానందము, బ్రహ్మానందము. శాశ్వత సుఖము, పరమశాంతి. ఇప్పుడు ఈ విషయాలను కాస్త లోతుగా పరిశీలిద్దాము.
కిందటి శ్లోకములలో చెప్పబడిన పతనావస్థకు కారణం ఏమిటి? మొట్ట మొదట చూడండి. ప్రాపంచిక విషయముల గురించి విషయ వాంఛల గురించి ఆలోచించడం. ఈ స్తితి నుండి పతనావస్థకు అంచెలంచలుగా చేరుకున్నాడు మానవుడు. కాని మొట్ట మొదట అంటే ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించేటప్పుడే చిన్న జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ పతనావస్త దాపురించదు అని భగవానుడు అంటున్నాడు. అదేమిటంటే ప్రాపంచిక విషయములు, కామ వాంఛలు, విషయ వాంఛలు, మానవులను ప్రలోభ పెడతాయి. అది సహజం. ఆ ప్రలోభాలు వచ్చినపుడు మానవుడు బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి. ఇది నాకు ఇష్టం అది నాకు ఇష్టం లేదు. ఇది నాకు చాలా ఇష్టం అనే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. ఈ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం బుద్ధితో ఆలోచించాలి. దానికి మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు బయట ఉన్న ప్రాపంచిక విషయములు మనలను ఎంత ప్రలోభ పెట్టినా దానికి వశులము కాము. చిరునవ్వుతో చూస్తూ ఉంటాము కానీ మనశ్శాంతిని కోల్పోము. అది కావాలి ఇది వద్దు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటాము.
రాగము అంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే భావన. ఇది నాకు చాలా ఇష్టం అనే భావన, ద్వేషము అంటే ఇది నాకు ఇష్టంలేదు. దీని వలన నాకు ఎటువంటి సంతోషము కలుగదు. పైగా దుఖం వస్తుంది. కాబట్టి ఇదంటే నాకు ద్వేషము అనే భావన ఈ రెండూచెడ్డవే. ఇవి దూరంగా పెడితే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది. ఎవరైతే రాగద్వేషములకు లోనుకాకుండా, మనసును బుద్ధిని అదుపులో పెట్టుకొని ఉంటాడో అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో మునిగితేలుతున్నా వాటికి అంటకుండా, వాటితో ఎటువంటి సంగము లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె అటు ఇటు తిరుగుతుంటాడు కానీ దేనికి అంటుకోడు. అటువంటి వాడి ఇంద్రియములు, మనన్సు అతనిస్వాధీనంలో ఉంటాయి. అతడు చెప్పినట్టు నడుచుకుంటాయి. స్వామీజి అంటే అర్థం ఇదే. ఎవరైతే తన మనస్సును ఇంద్రియములను తన వశంలో ఉంచుకుంటాడో, వాటికి తానే యజమాని అంటే స్వామి అవుతాడో ఆయనే స్వామీజి. అంతే కానీ సిల్కు కాషాయాలు కట్టుకొని విలాసవంతమైన ఆశ్రమాలలో ఉండేవాళ్లు కాదు.
ఇంక రెండవ శ్లోకంలో ఈ ప్రసన్నత, మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే సకల దు:ఖములను నాశనం చేస్తుంది. మనలో అడ్డదిడ్డంగా చెలరేగే ఆలోచనలు మన ప్రశాంతతను నాశనం చేస్తే ఈ ప్రసన్నత మనలో ఉన్న దుఃఖాలను నాశనం చేస్తుంది. దుఃఖాలు నశిస్తే కలిగే స్థితి నిశ్చలానంద స్థితి. బ్రహ్మానందస్థితి. మనకు ఎక్కడ చూచినా ఆనందం తాండవిస్తుంది. అటువంటి వాడు శ్మశానంలో ఉన్నా ఆనందంగా ఉంటాడు. ఎటువంటి విపత్కరపరిస్థితులలో కూడా సంయమనము కోల్పోడు. ఇది బయట జరిగే పరిణామము. ఈ ప్రసన్నత, ప్రశాంతత ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. భగవంతుని మీద ఏకాగ్రబుద్ధి ఉంటుంది. ప్రాపంచిక విషయముల యందు పరుగెట్టదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటుంది. అప్పుడు వాడు కర్మయోగి అవుతాడు. అతని మనస్సు పరమాత్మయందు స్థిరంగా లగ్నం అవుతుంది.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P126
No comments:
Post a Comment