☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
120. వాతా ఆ వాతు భేషజం శంభు మయోభు నో హృదే
శుద్ధమైన వాయువు ఔషధం - శుభకరం - ఆనందకరం(ఋగ్వేదం)
పర్యావరణ పరిశుద్ధికి సంబంధించిన ఎన్నో ఉపయోగకరమైన భావాలు
వేదవిజ్ఞానంలో కనిపిస్తాయి. మనచుట్టూ ఉన్న భూమి, వాయువు, నీరు, అన్నం...
అన్నీ క్షేమకరంగా ఉండాలనీ, ఉంచాలనీ వేదాకాంక్ష. యజ్ఞాదులు పర్యావరణాన్ని
శుద్ధిగా, బలంగా పరిరక్షించేందుకే ఏర్పరచబడినాయి.
ఋగ్వేదంలో ఏ ఏ ఋతువులో ఏవేవి తినాలో, తాగాలో, ఏ విధంగా జీవించాలో
చాలా మంత్రాల్లో వివరించారు. ఈ వేదాంశాలే ఆయుర్వేదంలో స్వీకరించబడినాయి.భూమినీ, నీటినీ క్షయం కాకుండా, నిస్సారం కాకుండా, వృధా కాకుండా పరిరక్షించుకోవలసిన బాధ్యతను వేదభాగాలు వివరించాయి.
వృక్షాలను నరకడం పాపమని ఎన్నో మంత్రాలు పేర్కొన్నాయి. పురాణాల్లో,
ధర్మశాస్త్రాలలో కూడా చెట్లను నరికితే పాప ఫలాలనుభవించాల్సి ఉంటుందని
హెచ్చరించాయి. యజ్ఞదుల్లో వాడే సమిధలు కూడా ఎండిన కట్టెలు మాత్రమే.
తమంత తాము ఎండిన కట్టె పుల్లలను ఏరి తెచ్చి వాడడమే యజ్ఞంలో కర్తవ్యం.
చెట్లను నరకడం కానీ, పచ్చి చెక్కలను ఉపయోగించడం యజ్ఞంలో నిషేధం.
అలాగే పంటలను పండించే పద్ధతుల్లో కూడా భూసారం క్షయం కాకుండా ఉండే విధానాలను ప్రాచీన వాఙ్మయాలు బోధించాయి. గోఘృతం, పలాశాది
సమిధలు, గోమయంతో చేసిన పిడకల వలన రేగే అగ్నిలో, మంత్ర సహితంగా
హుతం చేయడం వలన రేగే ధూమం వాయుమండలంలో శుద్ధిని కలిగించడమే
కాక, ప్రాణశక్తిని నింపి పర్యావరణాన్ని బలోపేతం చేస్తుందన్న యజ్ఞవిజ్ఞానం నేటి
శాస్త్రపరిశోధనల్లో కూడా సత్యంగా తేలింది.
ఎటువంటి కాలుష్యాలు లేని వాయువు మందు వలె ఆరోగ్యాన్ని కలిగిస్తుందనీ,
శుభాన్నీ, శాంతినీ, ఆహ్లాదాన్నీ ప్రసాదిస్తుందని పై ఋగ్వేద మంత్రం చెబుతుంది. ఓషధీ విలువలు కలిగిన తులసి, బిల్వం, ఉసిరిక వంటి చెట్లను పరిసరాలలో పెంచడం వల్ల వాయువులో శుభ్రత, ఆరోగ్యం లభిస్తాయి అని ఆర్షగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
విజ్ఞానం పేరుతో ప్రగతి సాధిస్తున్నామనే భ్రమలో భూ, జల, వాయు, ధ్వని
కాలుష్యాలను విస్తరింప జేస్తున్న నేటి నాగరికత - వేదసంస్కృతి ఆదర్శాలను
స్వీకరించాల్సిన అవసరముంది.
ఇమా ఆపః ప్రభారామ్యయక్ష్మా మక్ష్మనాశనీః॥ (అథర్వవేదం)
'రోగంలేని, రోగాలని పోగొట్టగలిగే జలాలను కాంక్షించే అథర్వ వేదభావన జలశుద్ధిని పేర్కొంది.
"శం నో దేవీరభీష్టయ ఆపో భవన్తు పీతయే" అని జలాలు శుభకరం కావాలని
ఋగ్వేదం సంభావించింది. మౌనం, ధ్యానం, పవిత్రకరమైన వాక్కు, స్వరసహిత
వేద ఉచ్చారణ మొదలైన ధ్వని కాలుష్యనివారణ సాధనలు కూడా వేద నాగరికతలో కనిపిస్తాయి.
‘వాచం వదామ భద్రయా' - శుభకరమైన భావనతో పలికే మాటలు శబ్దశుద్ధతని
ప్రకటిస్తాయని అథర్వవేద సంభావన. యంత్రాల రొదలో, హోరులో బ్రతుకుతున్న
మనకి ప్రశాంత ప్రకృతి నాదాలతో సహజీవనాన్ని బోధించిన తపోభూముల
నిర్మలత్వాన్ని స్మరించితే చాలు శాంతి లభిస్తుంది.
భౌతిక కాలుష్యాలనే కాక అంతరిక కాలుష్యాలను సైతం నివారించే పవిత్ర
భారత ఋషి సంస్కృతిని తిరిగి ప్రతిష్ఠించగలిగినప్పుడు ప్రపంచ కాలుష్య సమస్యను నివారించి, చల్లని పుడమిని సాధించగలం.
No comments:
Post a Comment