☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
145. ద్యుభిః హితః జరిమా సు నః అస్తు
మా ముసలితనం ప్రకాశవంతంగా, మేలుగా అగు గాక
జీవితంలో వృద్ధాప్యం ఒక తప్పని దశ.
యౌవనకాలంలో ఉన్న వ్యక్తి వృద్ధులను చూసి 'ముసలోళ్ళు' అని అవహేళన చేస్తాడు. కానీ తాను చేరబోయే దశ అదేనని ఊహలోకి రానివ్వడు.
తప్పనిస్థితి వృద్ధాప్యం. బాల్య కౌమార యౌవనాలు హాయిగానేసాగిపోతాయి.
కష్టసుఖాలు కదలిపోతున్నా వాటికి తగినట్టు స్పందించి, తట్టుకొని సాగే శక్తి ఆ దశలలో ఉంటుంది. తీరా - వార్ధక్యం వచ్చాక క్రమంగా శారీరక పాటవం తగ్గుతుంది.దాని ప్రభావంతో మనశ్శక్తి క్షీణిస్తుంది. దేనికీ తట్టుకోలేకపోవడం, మార్పుని
జీర్ణించుకోలేకపోవడం, అసహాయత, మరపులాంటి వికారాలు కలుగుతాయి.
జీర్ణించే ఈ దశను 'జర' అంటారు.
ఇది ఏ ఒక్కరూ ఇష్టపడని, ప్రతి ఒక్కరికీ తప్పని స్థితి.
అయితే దీనిని కూడా తేజోవంతం చేసుకోవాలని వాంఛించడం, దానికై
ప్రయత్నించడం అవసరమని వేదమాత బోధిస్తోంది. ప్రచోదన కలిగిస్తోంది.
వృద్ధాప్యంలో కూడా ఒక అందముంది. దానిని గుర్తించే ప్రయత్నం చేయాలి.
'ప్రకాశవంతం' అంటే తేజోమయం.
ఉత్సాహం, చురుకుతనం, కర్మశీలత - ఇవే 'ద్యుభిః' అనే పదం ద్వారా
సూచించబడుతున్నాయి.
ఇవి ఉన్నపళంగా వార్ధక్యదశలో తెచ్చుకోలేనివి.
యౌవనంలోనే తగిన జాగ్రత్తలతో మసలుకుంటే ముసలితనంలో వీటిని
నిలుపుకోగలం.
క్రమశిక్షణ, వ్యాయామం, తగిన పౌష్టికాహారం... వంటివి యౌవనకాలంలోనే వీడకుండా గ్రహించగలిగితే, ముసలితనంలో దేహ, మనః పటిష్టతలు సమకూరుతాయి.
మన దేహం, మన మనస్సు మనకు హితకారిగా ఉండాలి.
'మేలు' రెండు రకాలు.మనకి మేలు. మన నుండి ఇతరులకు మేలు. ఈ రెండూ కలిగి ఉండడమే అసలైన
మేలు. అదే మేలిమి జీవితం.
'నిరంతరాధ్యయనం' మనల్ని చురుకుగా ఉంచే గొప్ప సాధన. మన వ్యక్తిత్వాన్ని దివ్యత్వంగా మలచగలిగే ఆర్షవిద్యలు, అభ్యాసాలు, అధ్యాత్మ సాధనలు బాల్యంతో మొదలై యౌవనంలో క్రమం తప్పక కొనసాగితే వృద్ధాప్యం తప్పక తేజోమయం
కాగలదు.
ముఖ్యంగా - మన నుండి ఏదో ప్రయోజనం అందుతున్నంత కాలం లోకం ఆదరిస్తుంది. ఎంత ప్రఖ్యాతుడైనా - వర్తమానమే ప్రధానం లోకానికి. గతాన్ని స్మరించి ప్రశంసిస్తుందేమో కానీ దానితో వర్తమానాన్ని భరించడం లోకానికి
సాధ్యం కాదు. మన నుండి ఏదో ఒక ప్రయోజనం పొందుతున్నప్పుడే తిరుగుతున్న చక్రంలా చైతన్యవంతంగా ఉంటుంది జీవితం.
శారీరకంగా మునుపటిలా శ్రమించలేకపోయినా, గతకాలపు అనుభవాలు, జ్ఞాపకాలు, విజ్ఞానాలు వంటివి భద్రపరచి, తరువాతి తరానికి అందించడం పెద్దలు లోకానికి చేసే పెద్ద మేలు. అటాంటి హితం వృద్ధుల నుండి భావితరాలకు అందించడం
మహాప్రయోజనకరం.
మన వృద్ధాప్యం కూడా చేతనతో, వికాసవంతంగా ఉండాలని శుభాశంస పలికిన వేదసంస్కృతి ఎంతటి సంపూర్ణ మానవజీవితాన్ని సంభావించిందో గ్రహించవచ్చు.
వృద్ధమూర్తులను గౌరవించే సంప్రదాయం మనది. పెద్దల నుండి వాత్సల్యం, జ్ఞానం,అనుభవం వంటి వెలుగులు లోకంపై ప్రసరించాలి.
No comments:
Post a Comment