కాఫీ కబుర్లు సంఖ్య 830 (ఫిబ్రవరి 28 - 2025) -- ప్రయాణంలో పదనిసలు -- అన్నిటితో పాటు రైలు ప్రయాణంలో కూడా చాలా మార్పులు వచ్చాశాయి. కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉంటున్నాయి. పూర్వపు రోజుల్లో ప్లాట్ ఫాంలు తక్కువ సంఖ్యలో ఉండేవి. చాలా పట్టణాల్లో రెండే ఉండేవి. డౌన్ ట్రైన్స్ ఒకపక్క, అప్ ట్రైన్స్ మరోపక్క ఆగడంతో ప్రయాణీకుల్లో ఇబ్బంది ఉండేదికాదు. ఇప్పుడు జనాలు రైళ్ళు బాగా పెరగడంతో ట్రైన్ ట్రాఫిక్ ఎక్కువైంది. విజయనగరం వంటి స్టేషన్లలోనే ఐదు ప్లాట్ ఫాంలు ఉన్నాయి. నగరాల్లో ఐతే 8 నుంచి 16 వరకు ఉంటాయి. దీనివలన రోజు వచ్చే రైళ్ళు ప్లాట్ ఫాం నంబర్లు మారుతుంటాయి. మనం ఎక్కబోయే రైలు ఏ నంబర్ ప్లాట్ ఫాం కి ఖచ్చితంగా వస్తుందో 10-15 నిమిషాలు ముందుగానీ డిస్ ప్లే లో కనబడదు. ఈ 10-15 నిమిషాల్లోపు ఆ నెంబర్ కి చేరుకోవాలి.. లగేజీ ఈడ్చుకుంటో లెదా మన సామాను మోస్తున్న కూలీ వెనకాతలో గబగబ నడవాలి. మనం ఉండే 1 నుంచి 6కి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఓవర్ బ్రిడ్జిలు లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఉన్నా జనసందోహం కారణంగా ఆలస్యం అవుతుంది. లిఫ్టు వద్ద కొంత వెయిటింగ్, నడక ఇవన్నీ ఉంటాయి. మనం ఆ ప్లాట్ ఫాం చేరేలోపు రైలు ఎక్కడొచ్చిస్తుందో గాభరా మనకి ఉంటుంది. అరవై దాటినవారు, కాళ్ళ కీళ్ళ నొప్పులు ఉన్నవారు, భారీ శరీరంతో ఉన్నవారు గబగబ నడవలేని పరిస్థితి.. టెన్షన్. కాకుండా ప్లాట్ ఫాంల మీద కుర్చీలు స్తంభాలు స్టాల్స్ రకరకాల లగేజీలు బస్తాలు వంటివి అడ్డు తగులుతుంటాయి. గోతులు గతకలు ఉంటాయి. మరామత్తులు కారణంగా రాళ్ళు పెచ్చులు అడ్డం తగులుతుంటాయి. పడిపోకుండా కింద చూసుకుంటూ నడవాలి. ఇంత ఇబ్బంది పడుతూ రైలు మన కోచ్ ఎక్కితే మన సీటు మీదకో కిందకో ఇంకెవడో తన బ్యాగులు, సూట్ కేస్ లు పెట్టేస్తాడు మన లగేజీకి సరియైన ప్లేస్ ఉండదు. ఇదో బాధ. నగరాల్లో ఐతే మన ప్లాట్ ఫాం కి ఎటువెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది. బోర్డులు ఇండికేటర్స్ కోసం కళ్ళు అటూఇటూ తిప్పాలి. కొత్త గనుక సరిగా అర్ధంకాదు. అందరికీ హడావిడే గనుక ఎవరికీ అడగలేం.. అడిగినా సరిగా చెప్పరు.. ఆ భాష యాస అర్ధంకావు. ఆ నగరంలో ఉంటున్న మన వాళ్ళెవరైనా స్టేషన్ కొస్తే గానీ వెళ్ళలేని పరిస్థితి. ఇంత ప్రయాణం చేసి అలసి బయటకొస్తే పెయిడ్ ఆటోలు, క్యాబ్ ల కోసం కొంత వెయిటింగ్ విపరీతమైన రద్దీ కారణంగా. అన్ని గంటలసేపు రైల్లో కూర్చున్నా పడుకుందికి బెర్తు ఉన్నా సౌఖ్యం ఉండదు సందడి గోల కారణంగా. బాత్ రూంకి వెళ్ళాలంటే భయం.. వెళ్ళకపోతే కాదు. ఇన్ని ఇబ్బందులు పడి ఇల్లు చేరేసరికి మావైపు భాషలో చెప్పాలంటే ఒళ్ళు పచ్చిపుళ్ళు అని చెప్పాలి. ధరించిన బట్టలు వాషింగ్ మేషిన్ లో పడేసి వేణ్ణీళ్ళతో స్నానం చేస్తేనేగానీ సగం అలసట తీరదు. రైలు ప్రయాణం అంటే చిన్నపుడు ఉన్న సరదా ఇప్పుడు ఏ కోశానా ఉండదు. రైలు రావడం బాగా లేట్ కావడంతో.. బీపీ మాత్రలు పట్టుకోవడం మరిచిపోయిన ఒకాయన ఇబ్బంది పడటం నా దృష్టికి వచ్చింది. రైలు ఎక్కే హడావిడిలో చక్రాలున్న ఓ చిన్న సూట్ కేస్ ఈడుస్తూ వడవడిగా నడుస్తున్న ఓ మధ్య వయస్కురాలు తన కాలే లగేజీకి అడ్డం తగిలి పడిపోయింది.. సూట్ కేస్ ఓపెన్ అయి అందులో ఉన్నవి చెల్లాచెదురు అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమిటంటే ప్లాట్ ఫాం మీదే పడటం రైల్వే ట్రాక్ మీద కాకుండా. ఇవన్నీ రైలు ప్రయాణంలో పదనిసలు. సాధ్యమైనంత వరకు తక్కువ లగేజ్ తో బయలుదేరాలి.. బీపీ షుగర్ మాత్రలు అందుబాటులో పెట్టుకోవాలి.. నిర్ణీత సమయానికి కనీసం ముప్పావు గంట ముందే రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి.. మన ట్రైన్ రావడానికి ముందే ఆ నంబరు ప్లాట్ ఫాంపై రెడీగా ఉండాలి.. ఎటెంటివ్ గా ఉండాలి.. అరవై దాటిన వారు ఒక్కరైనా దంపతులైనా మరొకరి సపోర్ట్ చాలా అవసరం.. రైలు ఎక్కించడానికి, రిసీవ్ చేసుకోవడానికి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ట్రైన్ జర్నీ కష్టమే ఈరోజుల్లో.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment